పండ్ల తోటల్లో నాటు కోళ్లు! | Fruit garden in the wild chickens | Sakshi
Sakshi News home page

పండ్ల తోటల్లో నాటు కోళ్లు!

Published Tue, May 26 2015 1:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పండ్ల తోటల్లో నాటు కోళ్లు! - Sakshi

పండ్ల తోటల్లో నాటు కోళ్లు!

కొత్తపుంతలు తొక్కుతున్న ప్రకృతి సేద్యం
పండ్ల తోటల్లో నాటు కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం
కోళ్ల పెంపకంతో భూసారం పెరిగి రెట్టింపైన పంట దిగుబడి

 
కొత్త ఆలోచన సరికొత్త ఆచరణ దిశగా తొలి అడుగులేయిస్తుంది. ఆ అడుగులు.. వెలుగుబాటలు వేసి పదుగురికీ మార్గదర్శకమవుతాయి. కడప జిల్లాకు చెందిన రైతు గంగరాజు వెంకట్రామరాజు సేంద్రియ పండ్ల తోటల్లోనే నాటు కోళ్లను పెంచుతూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు. పదేళ్లుగా సాగు చేస్తున్న తోటల్లోనే నాలుగేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతుల్లోనే నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టి భళా అనిపించుకుంటున్నారు. నాటు కోళ్లు, గుడ్ల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. దీంతో పాటు భూమి సారవంతమై పంట దిగుబడులు కూడా రెట్టింపవ్వటం విశేషం.
 
రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయా నుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుం దని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు సేంద్రియ రైతు గంగరాజు వెంకట్రా మరాజు. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలతోపాటు నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు.  వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ని సిద్దిరాజు కండ్రిగ ఆయన స్వగ్రామం. తనకున్న ఆరెకరాల్లో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అరటి, బొప్పాయి, మామిడి తోటలను సాగు చేస్తున్నారు. నాటుకోళ్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను గుర్తించి తోటలోనే నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. అదనపు ఆదాయంతో పాటు భూసారంతోపాటు పంట దిగుబడు లు పెరుగుతున్నాయంటున్నారు.

వెంకట్రామరాజు  2010లో  2 పెట్టలు, 2 పుంజులుతో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. మరుసటి ఏడాదికి కోళ్ల సంఖ్య 500కు చేరింది. తాను పెంచిన కోళ్లను, గుడ్లను వినియోగదారులకు తోట వద్దనే విక్రయిస్తున్నారు. పాములు, పిల్లుల బారి నుంచి కోళ్లను రక్షించుకోవటం కష్టంగా ఉండటంతో.. తోట చుట్టూ ఐదడుగుల ఎత్తున వైర్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు.
 
చేలో పండిన చిరుధాన్యాలే మేత

సేంద్రియ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మేత గురించే. నాటుకోళ్లకు మేతకోసం 5 నెలల పాటు ఒక్కో కోడిపై రూ. 100 ఖర్చవుతుంది, ఆదాయం మాత్రం దీనికి మూడున్నర రెట్ల వరకూ వస్తుంది. ఇది ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించినదై ఉండాలి. అందుకే తన చేలోనే పండించిన జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు లాంటి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతోనే వెంకట్రామరాజు నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్లకు వ్యాధి నివారణ టీకాలు కూడా వేయడంలేదు. అయినా ఇంతవరకూ వీటికి ఎటువంటి జబ్బులు, సీజనల్ వ్యాధులు  రాలేదు. దీనికి కారణం కోళ్లు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలోనే తిరుగుతూ.., సేంద్రియ ఆహారాన్ని మేతగా తినటమేనంటారాయన.

రైతుకు రెండు విధాలా లాభం..

సేంద్రియ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకం వల్ల రైతుకు అదనపు ఆదాయం లభించటంతో బాటు పొలం సారవంతమవు తుంది. పంటలకు హాని చేసే క్రిమికీటకాల ను ఇవి తింటాయి. దీంతో చీడపీడల బాధ తప్పుతుంది. 500 కోళ్లను పెంచినట్టయితే వాటి విసర్జితాల వల్ల ఏడాదికి7 నుంచి 8 టన్నుల సేంద్రియ ఎరువును పొలానికి వేసినట్టేనంటారు వెంకట్రామరాజు. ఇంతకు ముందు హైబ్రిడ్ దోస సాగుచేస్తే ఎకరాకు 10 టన్నులు దిగుబడి వచ్చింది.నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాక 20 టన్నుల వరకూ దిగుబడి వచ్చిందని ఆయన  చెబుతున్నారు. పంటలను నాశనం చేసే ప్రమాదం ఉండటంతో ఆహారపంటలు సాగు చేసే పొలాల్లో వీటి పెంపకం సాధ్యం కాదు. పండ్ల తోటల్లో నాటు కోళ్ల పెంపకాన్ని చేపడితే వాటికి స్వేచ్ఛగా తిరిగేందుకు అవసరమైన స్థలం లభించటంతో పాటు పంటలకు నష్టం ఉండదు. కోళ్లు రాత్రిళ్లు చెట్లపైనే ఉంటాయి. పిల్లలకు మాత్రం గంపలను ఏర్పాటు చేశారు. ఫారం కోళ్ల ధర కన్నా  నాటుకోళ్ల మాంసాన్ని, గుడ్లను రెట్టింపు ధర చెల్లించి వినియోగదారులు కొంటున్నారు. ప్రస్తుతం నాటుకోళ్లను కిలో రూ. 230 - 250 ధరకు అమ్ముతున్నారు. మాంసం కిలో రూ. 350 - 400 ధరకు షాపుల వాళ్లు అమ్ముతున్నారు. అలాగే సేంద్రియ నాటుకోడి గుడ్లకు రూ. 8 వరకూ ధర పలుకుతోంది.
 
మినీ ఇంక్యుబేటర్‌తో మరింత ఆదాయం


ముందుచూపుతో వ్యవహరించి రూ. 35 వేల ఖర్చుతో మినీ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసుకోవటంతో గుడ్ల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఇంక్యుబేటర్ ఏర్పాటుతో కోడి, గుడ్లను పొదిగే సమయం ఆదా అవుతుంది. మళ్లీ గుడ్లు పెట్టేందుకు కోడి త్వరగా సిద్ధమవుతుంది. ఇలా చేయటం వల్ల ఏడాదిలో ఏడు నుంచి ఎనిమిది సార్లు కోడి గుడ్లు పెడుతుంది. 600 గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్ ధర రూ. 35 వేలు. గుడ్లు పొదిగే సమయం ఆదా అవుతుంది.

చిన్న రైతులకు జీవనోపాధి

8 పెట్టలు, 1 పుంజుతో ఒక కుటుంబం ఆర్థికావసరాలు తీరుతాయి. ఒక నాటుకోడి పెట్ట ఏడాదిలో నాలుగైదుసార్లు గుడ్లు పెడుతుంది. 8 పెట్టలు ఏడాదికి కనీసం 80 గుడ్లు పెడతాయి. ఇందులో  20 పిల్లలు చనిపోయినా 60 పిల్లలు పెరుగుతాయి. ఐదు నెలలకు ఒక్కో కోడి 2 కిలోల బరువు ఉంటుంది. అంటే ఒక్కో కోడి రూ. 450 వరకూ ధర పలుకుతుంది. మార్కెట్ ధర          (60్ఠ450) ప్రకారం విక్రయిస్తే సుమారు రూ. 27, 000 వరకూ ఆదాయం వస్తుంది. ఒక్కో కోడిపై మేత కోసం పెట్టే ఖర్చు  (60్ఠ100 ) రూ. 6 వేలు అవుతుంది. అంటే రూ. 20 వేలకు పైగా నికరాదాయం. ఇది కేవలం ఐదునెలల్లో 8 పెట్టలు, ఒక పుంజుతో వచ్చిన ఆదాయం మాత్రమే. ఇలా ప్రతినెలా విడతలుగా గుడ్లు పొదిగిస్తే ఆదాయం వస్తూనే ఉంటుంది.
 - మాచుపల్లె ప్రభాకరరెడ్డి ,
 కడప అగ్రికల్చర్
 
 ఎకరం తోటలో 500 కోళ్ల వరకు పెంచొచ్చు!


 నాటుకోళ్లకు ప్రస్తుతం డిమాండ్ బాగా ఉంది. చిన్నగా మొదలుపెట్టి క్రమేణా కోళ్ల సంఖ్యను పెంచుకోవాలి. పొలంలో పండిన చిరుధాన్యాలనే మేతగా వేస్తున్నాము. ఒక ఎకరం తోటలో 500 వరకూ నాటుకోళ్లను పెంచవచ్చు. పొలానికి సేంద్రియ ఎరువు అందడంతో బాటు రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఖర్చు (మేత)రూ. 100 అయితే, ఆదాయం రూ. 450 వరకూ వస్తుంది. అంటే నికరంగా మూడింతల ఆదాయం వస్తుంది. నాటు కోడి గుడ్లు, మాంసం ఆరోగ్యకరమైన ఆహారమని వినియోగదారులు గుర్తించడంతో గిరాకీ పెరుగుతోంది. .
 - గంగరాజు వెంకట్రామ రాజు (96529 02972),
 సిద్దిరాజు కండ్రిగ, రైల్వేకోడూరు మండలం, వైఎస్సార్ జిల్లా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement