ఇటు వ్యాయామం... అటు సహజాహారం!
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. అయితే, ఆ వ్యాయామం కోసమే కాకుండా.. రసాయనిక అవశేషాల్లేని సహజాహారాన్ని ఇంటిపట్టునే పండించుకోవడానికి కూడా ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే రేణుకుంట్ల శ్రీరాములు తన ఇంటిపైన 3 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు.
హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ మాజీ ఉద్యోగైన శ్రీరాములు(61) కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో స్థిరపడ్డారు. ఇంతకుముందున్న ఇంటి వద్ద పెరట్లో చాలా ఖాళీస్థలం ఉండడంతో పూలమొక్కలు, కూరగాయ మొక్కలు పెంచే అలవాటుంది. కొద్ది నెలల క్రితం 3 అంతస్థుల కొత్త ఇంట్లోకి మారిన తర్వాత.. మేడ మీద గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. గుండ్రంగా ఉండే పెద్ద గ్రోబాగ్స్ పది, 50కి పైగా చిన్న కుండీల్లో టమాటా, బీర, పొట్ల, సొర, దోస, గోంగూర, పాలకూర, చుక్కకూర సాగు చేస్తున్నారు. మొక్కలకు ఎండాకాలంలో మొక్కలకు షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షించుకోవడానికి టైపైన పక్కాగా ఇనప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. మొక్కలంటే ప్రాణం కాబట్టి కొంత ఖర్చయినప్పటికీ ఈ ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు.
దసరా పండుగ తర్వాత గ్రోబాగ్స్ తెచ్చి టై కిచెన్ గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్ ఎర్రమట్టి, అర ట్రాక్టర్ చివికిన పశువుల ఎరువుతోపాటు కోకోపిట్, వేపపిండితో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొక్కలకు రోజ్‌క్యాన్‌తో తగుమాత్రంగా నీరు పోయడంతో శ్రీరాములు దినచర్య ప్రారంభమవుతుంది. కనీసం గంట సేపు చక్కని వ్యాయామం దొరుకుతోందని ఆయన చెప్పారు. దీంతోపాటు మొక్కలను దగ్గరగా పరిశీలించడం వీలవుతోందన్నారు.
నలుగురు కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో 60% వరకు ప్రస్తుతం తామే పండించుకుంటున్నామన్నారు. 15-20 రోజులకోసారి వేపనూనెను మొక్కలపై పిచికారీ చేస్తామని, అంతకుమించి మరేమీ అవసరం రావడం లేదని ఆయన తెలిపారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలను సొంతంగా మేడ మీద పండించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కూరగాయలు, ఆకుకూరలను కోసిన 5 నిమిషాల్లోనే వండుకునే వీలుండడం, రుచి చాలా బాగుండడం సంతృప్తినిస్తోందన్నారు. ప్రగతినగర్ మాజీ సర్పంచ్ అయిన శ్రీరాములు ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. టైలు ఖాళీగా ఉంచేకన్నా ఉన్నంతలో సహజాహారాన్ని పండించుకోవడం మేలని తన చేతల ద్వారా చాటుతున్నారు.
- ఇంటిపంట డెస్క్