Orissa police
-
కోరిన కంపెనీ లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు ఎర
ఒడిశా : దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగినట్లు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉద్యోగం ఇప్పిస్తామంటే చాలు నిరుద్యోగులకు అదో పండుగే. దీన్నిఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్ల నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ అశ చూపి అందినంత వరకు దోచుకుంటున్నారు. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్న ఓ గ్యాంగ్‌కి ఒడిశా పోలీసులు చెక్ పెట్టారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను మోసం చేస్తున్నఐదుగురు అంతర రాష్ట్ర మోసగాళ్లను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా ప్లాన్ ప్రకారం చేస్తారు అంగూల్ పోలీసు సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా మాట్లాడుతూ, ఈ ముఠా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి వద్ద 8 లక్షల వరకు తీసుకుంటారు. అనంతరం వారికి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ నియామక పత్రాలను జారీ చేస్తుంటారు. తాము మోసపోయినట్లు నిరుద్యోగులు తెలుసుకునే సమయానిక అక్కడి నుంచి మకాం మార్చేస్తారు. ఈ దందా 2018 నుంచి జరుగుతోందని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. అయితే గత నెలలో ఈ మోసగాళ్ల భాగోతం మొదట పోలీసుల దృష్టికి వచ్చింది. అంగూల్ జిల్లాకు చెందిన 59 ఏళ్ల ప్రణబంధు జెనా తన కొడుకుకి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మిశ్రా అనే వ్యక్తికి 4,50,000 నగదుని తీసుకున్నాడు. నెలలు గడిచిన తన కొడుకుకు ఎలాంటి ఉద్యోగం రాకపోయేసరకి మోసపోయాడని గ్రహించి జెనా పోలీసులను ఆశ్రయించాడు. ఐతే... పోలీసులు ఇంకైనా ప్రజలు ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దనీ, అడ్డదారుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన ఓ సర్వేలో నిరుద్యోగిత రేటు 10.7 శాతం పాయింట్లు పెరిగి 2020 ఏప్రిల్‌కు 23.8 శాతం నిరుద్యోగులు ఉన్నారని తేలింది. ( చదవండి : లక్నో కేంద్రంగా కాల్ సెంటర్.. నిరుద్యోగులకు వల ) -
కుందులి కేసులో ఇద్దరు అధికారుల విచారణ
జయపురం: కొరాపుట్ జిల్లా కుందులిలో బాలికపై సామూహిక లైంగికదాడి ఆరోపణల కేసులో దర్యాప్తు కమిషన్ (జయపురం జిల్లా జడ్జి) ఆదివారం మరో ఇద్దరు అధికారుల సాక్ష్యాలను సేకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ సౌభాగ్యలక్షి పట్నాయక్ తో పాటు లక్ష్మీపూర్ డీఎస్పీ తపన నారాయణ రథ్‌లను కమిషనర్ విద్యుత్ కుమార్ మిశ్రా ప్రశ్నించి వారినుంచి దర్యాప్తు రికార్డులను పరిశీలించి విషయాలను సేకరించారు. ఈ విచారణలో ప్రభుత్వ న్యాయవాది, దర్యాప్తు కమిషన్ ప్రత్యేక న్యాయవాది ప్రభాకర పట్నాయక్ కూడా పాల్గొన్నారు. గత ఏడాది అక్టోబర్ 10 వ తేదీన కొరాపుట్ జిల్లా కుందులి సమీప సొరిసిపొదర్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ముషిగుడ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక కుందులి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో జవాన్ దుస్తులు ధరించి ఆయుధాలు గలిగిన నలుగురు వ్యక్తులు ఆమెను ఎత్తుకు పోయి సమీప అడవిలో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధిత బాలిక ఆరోపించిన విషయం పాఠకులకు విదితమే. అనంతరం బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొరాపుట్ జిల్లా జడ్జి విద్యుత్ కుమార్ మిశ్రాతో దర్యాప్తు కమిషన్‌ను నియమించింది. -
పైపులో కూరుకు పోయిన వ్యక్తి
భువనేశ్వర్/కటక్ : పైప్‌లో కూరుకుపోయిన ఓ వ్యక్తి గంటల తరబడి ఊపిరాడని పరిస్థితుల్లో ప్రాణాలతో మృత్యుపోరాటం చేసి బతికి బయటపడ్డాడు. ఈ సంఘటన గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. కటక్ మహానగరం పంపింగ్ స్టేషను పైపు మరమ్మతు పనులు జరుగుతుండగా సిబ్బంది ఓ వ్యక్తి ఆకస్మికంగా 25 అడుగుల లోతు పైపులో కూరుకు పోయాడు. తోటిసిబ్బంది తప్పిదంతో ఈ ఘటన సంభవించింది. పైప్‌లైన్‌లో అడ్డు తొలగించే పనిలో వ్యక్తి నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో 25 అడుగుల లోతుకు కొట్టుకుపోయాడు. విషయం ప్రసారం చేయడంతో అనుబంధ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అందరి సమష్టి కృషితో పైపులో కూరుకు పోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశా పోలీసు (వైర్లెస్) ప్రధాన కార్యాలయం ఎదురుగా కటక్ మహానగరం బిడానాసి ప్రాంతంలో ఈ ఆందోళనకర సంఘటన సంభవించింది. చాహత్ బజార్లో ఉంటున్న 45 ఏళ్ల ప్రాణ కృష్ణ ముదులి అనే సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా పైపులో కూరుకు పోయాడు. దాదాపు 6 గంటల పాటు ఈ పైపులో ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని కొట్టుమిట్టాడు. ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్), అగ్ని మాపక దళం సంయుక్త సహాయక చర్యలతో ఈ వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీయగలిగారు. -
ప్రేమపేరుతో ముంచాడు.. న్యాయం కావాలి
ఒడిశా(బరంపురం) : నగరమంతా బుధవారం యువతీ యువకులు ప్రేమికుల రోజును అమితోత్సాహంతో ఓ వైపు జరుపుకుంటోం ది. మరో వైపు ప్రేమపేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని ఏడాది పాటు కాపురం చేసి ఒక బిడ్డకు తల్లిని చేసి భర్త పరారైన కారణంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంటోంది. ఈ మేరకు బరంపురం ఎస్పీ కార్యాలయం ఎదుట బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కుదలా బ్లాక్ పరిధి మధురా గ్రామంలో నివాసం ఉంటున్న రస్మిత సాహు..అక్కడికి దగ్గరలో ఉన్న కౌసిలా గ్రామానికి చెందిన యువకుడు సమీర్ పడియారి మధ్య రెండేళ్లు ప్రేమవ్యవహారం నడిచింది. వీరి ప్రేమను యువకుని పెద్దలు వ్యతిరేకించడంతో వారిద్దరూ నారాయణి శక్తిపీఠంలో వివాహం చేసుకున్నారు. గుజరాత్లో కాపురం అనంతరం భార్యాభర్తలు సమీర్ ఇంటికి వెళ్లగా రూ.5 లక్షలు కట్నం ఇవ్వాలని రస్మిత సాహు కుటుంబసభ్యులను అత్తవారు డిమాండ్ చేయడంతో కొత్తజంట గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్లి ఏడాది పాటు కాపురం చేసింది. ఈ క్రమంలో రస్మిత ఒక బిడ్డకు తల్లిఅయిన అనంతరం భర్త సమీర్ సూరత్‌లో భార్య రస్మితను విడిచి పరారయ్యాడు. అనంతరం రస్మిత అతి కష్టంమీద గ్రామానికి చేరుకుని కౌసలిపూర్ గ్రామంలో నివాసముంటున్న అత్తవారింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం తనను అత్తవారు తనను ఇంటి నుంచి బయటకి పంపేశారని ఆరోపించింది. జరిగిన సంఘటనపై కుదలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా భర్తపై గానీ అత్తవారిపై కానీ చర్యలు తీసుకోక పోవడంతో ఎస్పీ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు, పసిబిడ్డతో కలిసి ఆందోళనకు దిగినట్లు బాధితురాలు రస్మిత సాహు వాపోయింది. పోలీసు అధికారులు దృష్టి సారించి తనకు వెంటనే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. అనంతరం ఒక వినతి పత్రాన్ని ఎస్పీకి బాధితురాలు, కుటుంబసభ్యులు అందజేశారు. -
వీధి పోరాటం
భువనేశ్వర్ (కటక్): రజత నగరం కటక్‌లో గురువారం రెండు వీధుల ప్రజల మధ్య జరిగిన ఘర్షణ బీభత్సం సృష్టించింది. ఈ ఘర్షణలో పోలీసులు గాయపడ్డారు. దుర్గా దేవి నిమజ్జనాన్ని పురస్కరించుకుని రగిలిన స్పర్థలు చినికిచినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీశాయి. బదాంబాడి, పూరీ ఘాట్ పోలీసు స్టేషన్ల ఇన్స్పెక్టర్ ఇన్చార్జిలు ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డారు. బదాంబాడి, పూరీ ఘాట్ పోలీస్ స్టేషన్ల పరిధి సర్వోదయపూర్, స్వీపర్ కాలనీ వాసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు ఒకరిపై వేరొకరు తేలికపాటి మాటల్ని ప్రయోగించడంతో ఘర్షణ ప్రారంభమైనట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. వాస్తవానికి దుర్గా పూజా నిమజ్జనం నాటికి ఇటువంటి పరిస్థితి లేనట్లు నగర డీసీపీ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తమైనట్లు అందిన సమాచారం ఆధారంగా పోలీసు దళాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరాయి. ఇరు వర్గాలు పగిలిన గాజు సీసాలు, రాళ్లు రువ్వుకోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసు వర్గాలు గాయపడ్డాయి. తొలి దశలో 12 మందికి అదుపులోకి తీసుకున్నామని మిగిలిన నిందితుల్ని గుర్తించి చర్యలు చేపడతామని సహాయ పోలీస్ కమిషనర్ అనిల్ మిశ్రా తెలిపారు. -
కోవర్టుల పనే..?
సాక్షి, హైదరాబాద్: ఏఓబీ ఎన్కౌంటర్ కోవర్టుల కారణంగానే జరిగిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులను కలిసే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. సోమవారం నాటి ఘటనా స్థలంలో ఆర్కే సహా మరికొందరు అగ్రనేతలు ఉన్నారని సమాచారం. ఒడిశా పోలీసులు కన్నెత్తి చూడని సురక్షిత ప్రాంతం కాబట్టే మావోయిస్టు అగ్రనేతలు, దళాలు అక్కడికి చేరుకున్నారని తెలుస్తోంది. పక్కా చిరునామా (పిన్ పాయింట్) దగ్గర ఉండి చూపేవారుంటేనే పోలీసులు అంత లోపలికి రావడం సాధ్యమంటున్నారు. కోవర్టుల సమాచారంతోనే పోలీసులు అక్కడికి వెళ్లగలిగారని అంటున్నారు. మరోవైపు మావోయిస్టులు తిన్న ఆహారంలో విష ప్రయోగం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏటా నవంబర్, డిసెంబర్ మధ్య మావోయిస్టుల సమావేశాలు జరుగుతాయని, ఆ సమాచారంతోనే నిఘా పెట్టి ఉంటారని తెలుస్తోంది. ‘‘మావోయిస్టులు ఆ ప్రాం తాన్ని షెల్టర్ జోన్‌గా వాడుకుంటారు. పక్కా సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది’’ అని గ్రేహౌండ్స్‌లో అనుభవమున్న ఓ పోలీసు అధికారి చెప్పారు. -
గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం
అన్యాయంగా ఇద్దరు అరెస్టు నిరసనగా గ్రామస్తుల రాస్తారోకో సీలేరు, న్యూస్‌లైన్ :అడవుల్లోను, మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం నానాటికీ పెరుగుపోతోంది. విశాఖ జిల్లా జీకేవీధి మండలం దుప్పుడువాడ పంచాయితీ కాట్రగెడ్డ గ్రామంలో పది రోజుల కిందట ఓ వివాహం జరిగింది. ఆ గ్రామానికి పక్కనే ఉన్న ఒడిశా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు మూడు బైక్‌లపై వచ్చి అక్కడ దొరికిన రెండు కేసుల మద్యాన్ని తీసుకువెళ్లారు. అయితే రెండు రోజుల కిందట సదరు మద్యం కేసుల యజమానిగా భావిస్తున్న వంతల నారాయణరావు కొడుకు, అతని స్నేహితురాళ్లను తీసుకుని బలిమెల రిజర్వాయర్ని చూపించడానికి బైక్‌పై వెళుతుండగా ఒరిస్సా పోలీసులు వారిని అడ్డగించి బైక్‌ను స్వాధీనం చేసుకొని మీ తండ్రిని తీసుకురావాలని చెప్పి పంపారు. దీంతో గ్రామస్తులు నారాయణరావును తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ తరుణంలో పోలీసులు నారాయణరావును అక్రమంగా బంధించి స్టేషన్లో ఉంచారు. స్టేషన్లో ఉన్న ఈయన్ను చూడడానికి వచ్చిన బంధువైన చిట్టి పడాలుపైనా తప్పుడు కేసు పెట్టి మల్కన్‌గిరి కోర్టుకు తరలించారు. పోలీసులు అకారణంగా తమవారిని బంధించడాన్ని నిరసిస్తూ కాట్రగెడ్డ గిరిజనులు ఏకమై ఆంధ్ర -ఒడిశా సరిహద్దు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ ఊరికి వచ్చి మద్యం అడిగితే తాము ఇవ్వలేదని, ఈ కోపంతోనే పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.