- అన్యాయంగా ఇద్దరు అరెస్టు
- నిరసనగా గ్రామస్తుల రాస్తారోకో
సీలేరు, న్యూస్‌లైన్ :అడవుల్లోను, మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం నానాటికీ పెరుగుపోతోంది. విశాఖ జిల్లా జీకేవీధి మండలం దుప్పుడువాడ పంచాయితీ కాట్రగెడ్డ గ్రామంలో పది రోజుల కిందట ఓ వివాహం జరిగింది. ఆ గ్రామానికి పక్కనే ఉన్న ఒడిశా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు మూడు బైక్‌లపై వచ్చి అక్కడ దొరికిన రెండు కేసుల మద్యాన్ని తీసుకువెళ్లారు.
అయితే రెండు రోజుల కిందట సదరు మద్యం కేసుల యజమానిగా భావిస్తున్న వంతల నారాయణరావు కొడుకు, అతని స్నేహితురాళ్లను తీసుకుని బలిమెల రిజర్వాయర్‌ని చూపించడానికి బైక్‌పై వెళుతుండగా ఒరిస్సా పోలీసులు వారిని అడ్డగించి బైక్‌ను స్వాధీనం చేసుకొని మీ తండ్రిని తీసుకురావాలని చెప్పి పంపారు. దీంతో గ్రామస్తులు నారాయణరావును తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ తరుణంలో పోలీసులు నారాయణరావును అక్రమంగా బంధించి స్టేషన్లో ఉంచారు.
స్టేషన్లో ఉన్న ఈయన్ను చూడడానికి వచ్చిన బంధువైన చిట్టి పడాలుపైనా తప్పుడు కేసు పెట్టి మల్కన్‌గిరి కోర్టుకు తరలించారు. పోలీసులు అకారణంగా తమవారిని బంధించడాన్ని నిరసిస్తూ కాట్రగెడ్డ గిరిజనులు ఏకమై ఆంధ్ర -ఒడిశా సరిహద్దు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ ఊరికి వచ్చి మద్యం అడిగితే తాము ఇవ్వలేదని, ఈ కోపంతోనే పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.