
ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్/కటక్ : పైప్‌లో కూరుకుపోయిన ఓ వ్యక్తి గంటల తరబడి ఊపిరాడని పరిస్థితుల్లో ప్రాణాలతో మృత్యుపోరాటం చేసి బతికి బయటపడ్డాడు. ఈ సంఘటన గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. కటక్ మహానగరం పంపింగ్ స్టేషను పైపు మరమ్మతు పనులు జరుగుతుండగా సిబ్బంది ఓ వ్యక్తి ఆకస్మికంగా 25 అడుగుల లోతు పైపులో కూరుకు పోయాడు. తోటిసిబ్బంది తప్పిదంతో ఈ ఘటన సంభవించింది.
పైప్‌లైన్‌లో అడ్డు తొలగించే పనిలో వ్యక్తి నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో 25 అడుగుల లోతుకు కొట్టుకుపోయాడు. విషయం ప్రసారం చేయడంతో అనుబంధ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అందరి సమష్టి కృషితో పైపులో కూరుకు పోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశా పోలీసు (వైర్‌లెస్) ప్రధాన కార్యాలయం ఎదురుగా కటక్ మహానగరం బిడానాసి ప్రాంతంలో ఈ ఆందోళనకర సంఘటన సంభవించింది.
చాహత్ బజార్‌లో ఉంటున్న 45 ఏళ్ల ప్రాణ కృష్ణ ముదులి అనే సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా పైపులో కూరుకు పోయాడు. దాదాపు 6 గంటల పాటు ఈ పైపులో ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని కొట్టుమిట్టాడు. ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్), అగ్ని మాపక దళం సంయుక్త సహాయక చర్యలతో ఈ వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీయగలిగారు.