గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..? | Stop Pipeline Work Around Golconda Fort Says Telangana High Court | Sakshi
Sakshi News home page

గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?

Published Tue, Dec 17 2019 2:43 AM | Last Updated on Tue, Dec 17 2019 5:30 AM

Stop Pipeline Work Around Golconda Fort Says Telangana High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోల్కొండ కోట కందకం దెబ్బతినేలా కోట వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) నుంచి అనుమతి లేకుండా నిర్మాణ పనులెలా చేస్తారని ప్రశ్నించింది. కోట వద్ద పైపులైన్‌ పనుల నిర్మాణం గురించి పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాహితవ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారణ చేపట్టింది. కోట చుట్టూ నిర్మాణ పనులు చేయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

జాతీయ ప్రాముఖ్యత ఉన్న గోల్కొండ కోట 500 ఏళ్ల నాటిదని, అలాంటి చారిత్రక కట్టడం వద్ద పైపులైన్‌ పనులని ఏవిధంగా చేపట్టారో, ఎవరి అనుమతి తీసుకుని చేస్తున్నారో తెలియజేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. చార్మినార్, గోల్కొండ వంటివి కాకుండా ఇంకేమైనా జాతీయ రక్షిత కట్టడాల గురించి తెలియజేయాలని ఏఎస్‌ఐ, జీహెచ్‌ ఎంసీలను ఆదేశించింది. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించిందని, రాష్ట్రం మాత్రం చారిత్రక కట్టడాల్ని పట్టించుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

జరుగుతున్నాయా.. లేదా.. 
కోట వద్ద పనులు జరుగుతున్నాయో లేదో మధ్యాహ్నం 2.30 గంటలకు చెప్పాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. తిరిగి విచారణ ప్రారంభం కాగానే జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఎలాం టి పనులు జరగడం లేదని చెప్పారు. అక్కడే ఉన్న అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ఉద్దేశించి.. హైదరాబాద్‌ మహానగరంలోని చారిత్రక కట్టడాల జాబితాలో కొత్త వాటిని చేర్చేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించట్లేదని ధర్మాసనం ప్రశ్నిం చింది. హెరిటేజ్‌ మాన్యుమెంట్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.

జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి కట్టడాల రక్షణకు తీసుకునే చర్యలు, ప్రాధాన్యత ఉన్న భవనాల జాబితాలను ఏఎస్‌ఐ, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా నివేదించాలని ఆదేశించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌కూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వాదనలతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణను జనవరి 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా(అమికస్‌క్యూరీగా) సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డిని ధర్మాసనం నియమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement