కళ్ళు చెదిరే వెండితెర మహాసంగ్రామం
అందుకే... అంత బాగుంది!
ట్రాయ్ (2004)
తారాగణం: బ్రాడ్‌పిట్, ఎరిక్ బన, ఓర్లాండో బ్లూమ్, డయానె క్రూజెర్, బ్రియాన్ కాక్స్ తదితరులు; ఛాయాగ్రహణం: రోజెర్ ప్రట్; సంగీతం: జేమ్స్ హార్నర్ రచన: డేవిడ్ బెనిఆఫ్; నిర్మాతలు: ఓల్స్ గ్యాంగ్ పీటర్సన్, డయానా రత్బన్, కోలిన్ విల్సన్; దర్శకుడు: ఓల్ఫ్ గ్యాంగ్ పీటర్సన్; విడుదల: 14-5-2004 సినిమా నిడివి: 162 నిమిషాలు; నిర్మాణ వ్యయం: 175 మిలియన్ డాలర్లు (సుమారు 1000 కోట్ల రూపాయలు); ఇప్పటివరకూ వసూళ్లు: 497.4 మిలియన్ డాలర్లు (సుమారు 3000 కోట్ల రూపాయలు)
గడచిన పదేళ్లలో నాకు బాగా నచ్చిన హాలీవుడ్ సినిమా ‘ట్రాయ్’. గ్రీస్ దేశంలోని ట్రాయ్ అనే రాజ్యంలో జరిగిన యథార్థ గాథతో ఈ సినిమా తీశారని తెలియగానే నాకు వెంటనే చూసేయాలనే ఆసక్తి కలిగింది. ఆ రోజు నాకింకా గుర్తుంది... 2004 జూన్ 25. నా స్నేహితుడు వీవీఎస్ ప్రకాశ్‌తో కలిసి మల్టీప్లెక్స్‌కి వెళ్లా. సాయంత్రం 7 గంటలకు ఫస్ట్ షో. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఉద్విగ్నతతో ఉంటుండగానే, ‘ట్రాయ్’ మొదలైంది.మైదానంలో ఓ కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. సినిమాలో కనిపించే ఫస్ట్ షాట్ ఇదే. ఆ కుక్కకు తొలుత ఓ శవం కనిపిస్తుంది.
కాసేపు శవాన్ని వాసన చూస్తుంది. అక్కడ్నుంచి కొంచెం ముందుకెళ్లి చూస్తే రెండు వైపులా మోహరించిన సైన్యం. కుక్కలకు రాబోయే భూకంపం గురించి ముందే తెలుస్తుందట. రెండు రాజ్యాల మధ్య జరగబోయే యుద్ధ భూకంపానికి సింబాలిక్‌గా ఇలా కథ మొదలుపెట్టాడేమో అనిపించింది.ఓ పక్క ప్రేక్షకునిలా సినిమా ఆస్వాదిస్తున్నా కూడా, నాలోని రచయిత చాలా తీక్షణంగా ఈ కథ ఏ విధంగా మలుపులు తిరుగుతుందా అని గమనిస్తూనే ఉన్నాడు. అయితే చిత్రమేమిటంటే - సినిమాలో లీనమైపోయి నేను రచయితననే విషయమే మరిచిపోయి... పూర్తిగాప్రేక్షకుడిలా మారిపోయి సినిమాను ఆస్వాదించడం మొదలుపెట్టా.
ఇది మన పురాణాల తరహా కథే. ఓ స్త్రీ కోసం జరిగే సమరం ఇది. ఇద్దరు అన్నదమ్ములుంటారు. ట్రాయ్ రాజ్యానికి యువరాజులు వాళ్లు. స్పార్టా రాజ్యంతో వీళ్లకు ఏళ్ల తరబడి వైరం. చివరకు ఇరు రాజ్యాల మధ్య శాంతి సమావేశం జరుగుతుంది. అందరూ చేతులు కలిపి మిత్రులవుతారు. స్పార్టా రాజు భార్యను, ఈ తమ్ముడు మోహిస్తాడు. అన్న వద్దంటాడు. తమ్ముడు తప్పదంటాడు. ఆమెను తమతో పాటు ట్రాయ్‌కు తీసుకుని బయలుదేరతాడు. దాంతో మళ్లీ యుద్ధం మొదలు. ఇరు రాజ్యాల మధ్య హోరాహోరీ పోరు. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చివరకు ట్రాయ్ సర్వనాశనమైపోతుంది.
ఈ కథకు సైన్యాధిపతి అకిల్లెస్ పాత్ర కీలకం. సైన్యం మొత్తాన్ని ఒంటి చేతిమీద నడిపిస్తూ, ట్రాయ్‌ని అల్లకల్లోలం చేయడంలో అతనే ముందుంటాడు. ఈ నేపథ్యంలో ట్రాయ్ రాజవం శానికి చెందిన బ్రీనస్ వీళ్లకు బందీగా చిక్కుతుంది. అకిల్లెస్, బ్రీనస్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఓ పక్క యుద్ధం చేస్తూనే అకెల్లస్ మరో పక్క మనసులో ప్రేమ సంఘర్షణకు గురవడాన్ని బాగా చిత్రీకరించారు.ఈ సినిమాకు అసలు హీరో ఎవరంటే - దర్శకుడు ఓల్ఫ్గ్యాంగ్ పీటర్సన్ పేరు చెప్పాలి. రచయిత ఎంత గొప్పగా స్క్రీన్‌ప్లే రాసినా, దాన్ని తెరపై రసరంజకంగా ఆవిష్కరించాల్సింది దర్శకుడే.
‘ట్రాయ్’ సక్సెస్ క్రెడిట్లో సగభాగం ఓల్ఫ్గ్యాంగ్ పీటర్సన్కే దక్కుతుంది. ఈ వెండితెర మహాసంగ్రామాన్ని తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకున్న తీరు, ముఖ్యంగా పోరాట సన్నివేశాల రూపకల్పన, ప్రధానంగా 24 శాఖల్ని సమ్మిళితం చేసుకున్న శైలి ఎక్స్ట్రార్డినరీ. అందుకే ఈ సినిమా స్కై లెవెల్లో వచ్చిందంటాను. సముద్రపు ఒడ్డున అంత మంది జనం... సైనికుల గెటప్స్... గుర్రాలు... కత్తులు... బళ్లాలు... విల్లంబులు... ఎంత గ్రాఫిక్స్ వాడినా ఇంత గొప్పగా వార్ సీన్స్ తీయడం చాలా చాలా కష్టం. గుట్టల్లా శవాలు... ఏరులై పారుతున్న రక్తం... ఓ స్త్రీ కోసం, రాజ్యకాంక్ష కోసం ఇంత మారణకాండ అవసరమా? అనిపిస్తుంది.
ఇక తిరిగి కథలోకి వెళితే... ఎన్నో ఎమోషన్స్‌తో ఇంటర్వెల్ వరకు బలమైన కథ, కథనాలతో లాక్కొచ్చిన రచయిత డేవిడ్ బెనిఆఫ్, ఇంటర్వెల్ తర్వాత, ప్రీ క్లైమాక్స్ వరకూ సమానమైన గెలుపోటములను అందిస్తూ కథనాన్ని రసవత్తరంగా నడిపారు. ఇక ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి... ప్యాట్రొక్లస్, హెక్టర్లు మరణించే ఘట్టాన్ని ఒళ్లు గగుర్పొడిచే పోరాట సన్నివేశాలతో తెరకెక్కించారు దర్శకుడు పీటర్సన్.ఇక చెప్పుకోవల్సింది క్లైమాక్స్ గురించి. అది రెండు లైన్లకు మించి చెప్పకూడదనుకుంటున్నాను. యుద్ధం ఎలాంటిదైనా అది విషాదాన్నే మిగులుస్తుంది.
ఈ కథ కూడా విషాదంగానే ముగుస్తుంది. గొప్ప కళాఖండమైన ‘ట్రాయ్’ చిత్రాన్ని చూస్తున్నప్పుడు కలిగే భావోద్వేగాలు అన్నీ ఇన్నీ కావు. అవి ఎవరికి వారు అనుభవించాల్సిందే! ముఖ్యంగా పాత్రల మధ్య భావోద్వేగాలనూ, పోరాటాన్నీ ఉత్కంఠభరితంగా నడుపుతూనే, అంతకు మించిన సున్నితత్వాన్ని తెరపై చూపడం ఈ సినిమాలో విశేషం. సినిమాలో ఎన్నో పాత్రలున్నా, ప్రతి పాత్రకూ దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. ప్రతి పాత్రా ప్రేక్షకుడి మనసుపై ముద్ర వేస్తుంది. అది స్క్రిప్టులోని గొప్పదనం. అలాగే, ఇంత భారీ చిత్రాన్ని రూపొందిస్తూ, అదే సమయంలో ప్రతి చిన్న అంశం మీదా పూర్తి శ్రద్ధ పెట్టి, జాగ్రత్తగా చూపినందుకు దర్శక, నిర్మాతలను అభినందించాలి.
అకిల్లెస్గా బ్రాడ్‌పిట్, హెక్టర్‌గా ఎరిక్ బానా, పారిస్‌గా ఓర్లాండో బ్లూమ్, స్పార్టా దేశపు రాజు మెనెలౌస్గా బ్రియాన్కాక్స్, మిలానస్ భార్య హెలెన్‌గా డయానా క్రూజర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచారు.వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా మంచి లాభాలు తెచ్చింది. ప్రస్తుతం హయ్యెస్ట్ గ్రాసర్ మూవీ లిస్ట్‌లో 150వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2005లో ఆస్కార్‌కు నామినేటైన ఈ చిత్రం కాస్ట్యూమ్స్ విభాగంలో అవార్డు కూడా దక్కించుకుంది.
దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు దక్కించుకున్న ‘ట్రాయ్’ ఈ శతాబ్దపు ‘వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీ’గా గుర్తింపు పొందింది. ఇన్ని అద్భుత విషయాలు, వినోదం, వ్యాపారాత్మకత, వాటన్నిటికీ తోడు ఒక గంగాఝరి లాంటి వేగం ఉన్న సినిమా ఇది. అందుకే, కామెడీ, సెంటిమెంట్, పొలిటికల్, భక్తి, వ్యంగ్య చిత్రాలెన్నింటికో విజయవంతంగా రచన చేసిన నాలోని రచయితనూ, నటుణ్ణీ సంపూర్ణంగా సంతృప్తి పరచిన అద్భుత చిత్రం ‘ట్రాయ్. నేను, నా సహాయకుడు వినయ్ ఇప్పటికీ నెలకొక్కసారైనా ‘ట్రాయ్’ డీవీడీ చూసి చర్చించుకుంటుంటాం.
‘ట్రాయ్’ సినిమా ప్రేరణతో భవిష్యత్తులో ఏ యువ దర్శకుడైనా తెలుగులో సినిమా చేస్తే, మరో రాజమౌళి మనకు దొరికినట్టే!
నిర్వహణ: పులగం చిన్నారాయణ
హాలీవుడ్లో జెండా పాతిన జర్మన్
జర్మనీకి చెందిన ఓల్ఫ్గ్యాంగ్ పీటర్సన్ దర్శకుడిగా, సినీ రచయితగా ప్రసిద్ధుడు. 1973నుంచి జర్మనీలో సినిమాలు, టీవీ ప్రొడక్షన్స్ తీస్తూ వచ్చిన ఆయనకు యుద్ధక్షేత్రం నేపథ్యంలోని సినిమాలంటే ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లనిపిస్తుంది. ‘ట్రాయ్’ కన్నా రెండు దశాబ్దాల పైచిలుకు ముందే ఆయన రెండో ప్రపంచ యుద్ధకాలంలో జలాంతర్గాముల పోరాట నేపథ్య చిత్రం ‘దాస్ బోట్’ రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో జన్మించిన ఆయన యుద్ధానికి వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రం 1981లో రెండు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. అదే ఆయనకు హాలీవుడ్లో రాచబాట వేసింది. ‘ది నెవర్ ఎండింగ్ స్టోరీ’, క్లింట్ ఈస్ట్‌వుడ్ నటించిన హత్యానేపథ్య చిత్రం ‘ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్’, మరో థ్రిల్లర్ ‘ఔట్‌బ్రేక్’ (1995), బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ (1997) లాంటివి ఆయనకు పేరు తెచ్చిన ఇతర చిత్రాలు.
ఆడదే ఆధారం!
నిజం చెప్పాలంటే, మన రామాయణం సీత చుట్టూ, మహాభారతం ద్రౌపది చుట్టూ తిరిగే కథలైతే, గ్రీకు పురాణకథలో కనిపించే హెలెన్ అనే స్త్రీ కేంద్రంగా నడిచే కథ ఇది. ప్రపంచంలోనే అతిలోక సుందరిగా ట్రాయ్ రాజ్యానికి చెందిన హెలెన్ ప్రసిద్ధి. స్పార్టా రాజ్యపు మహారాణి హెలెన్ తన భర్త మెనెలౌస్ను వదిలేసి, ట్రాయ్ రాజ్యపు యువరాజు పారిస్‌తో వచ్చేస్తుంది. అవమానభారంతో ఆమె భర్త, తన సోదరుడితో కలసి భారీగా గ్రీకు సైన్యాన్ని సిద్ధం చేసి, అప్పటి దాకా ఓటమి అంటే ఎరుగని ట్రాయ్ దేశపు ట్రోజన్ల మీద యుద్ధానికి దిగుతాడు. గ్రీకు యోధుల్లో కీలక వ్యక్తి అయిన అకిల్లెస్, ట్రోజన్లలో అతనికి దీటైన హెక్టర్ల మధ్య ఢీ అంటే ఢీగా ఉంటుంది. మాయోపాయంతో తప్ప, మామూలుగా అయితే ట్రోజన్లను ఓడించలేమని గ్రీకులంతా ఒక భారీ కొయ్యగుర్రం తయారు చేసి, దాని లోపల రహస్యంగా సైనికుల్ని, ట్రాయ్ నగరంలోకి తరలిస్తారు. అదే పుస్తకాల్లో ‘ట్రోజన్ హార్స్’గా ప్రసిద్ధమైంది. పదేళ్ళ ఆ యుద్ధం, ఆ క్రమంలో జరిగే ఘటనలు చాలా ఆసక్తికరం.