OS manian
-
లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
చెన్నై: తమిళనాడులోని తిరువారూరులో మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు లిప్టులో ఇరుక్కుపోవటం కలకలం రేపింది. నాగపట్నంలో చేపల విక్రయానికి సంబంధించి ఆదివారం ఇరు గ్రామాల జాలర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 27 మంది గాయపడ్డారు. వీరందరినీ నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్సల నిమిత్తం ఏడుగురిని తిరువారూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. వీరంతా రెండో అంతస్తులో చికిత్స పొందుతున్నారు. జాలర్లను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి ఓఎస్ మణియన్, ఎంపీ గోపాల్, ఎమ్మెల్యే తమిమున్ అన్సారి, మాజీ మంత్రి జీవానందం సోమవారం ఉదయం తిరువారూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. వారిని డీన్ మీనాక్షి సుందరం, అన్నాడీఎంకే నగర కార్యదర్శి మూర్తి లిఫ్టులో తీసుకువెళ్లారు. ఆ సమయంలో లిఫ్టు మొదటి, రెండో అంతస్తు మధ్యలో నిలిచిపోయింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి అతికష్టం మీద లిఫ్టును మొదటి అంతస్తుకు తీసుకువచ్చారు. అరగంట సేపు నానా తంటాలు పడి తలుపులు పగులగొట్టి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మంత్రా మజాకా.. పదవీ రక్షణ పూజలు
చెన్నై : తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో ఓ మంత్రి ఏకంగా పదవీ రక్షణ పూజలు సాగించారు. వరుణ యాగం నినాదం తెర మీదకు తెచ్చినా, వెను వెంటనే పదవీ రక్షణ పూజలు చేయడం గమనార్హం. నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఓఎస్ మణియన్‌కు మంత్రి పదవిని దివంగత సీఎం జయలలిత కేటాయించారు. అమ్మ మరణంతో చిన్నమ్మ శశికళకు విశ్వాసపాత్రుడిగా ఈ మంత్రి ఉన్నారని చెప్పవచ్చు. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్‌కు మద్దతుగా కూడా వ్యవహరించారు. సీఎం పళనిస్వామి శిబిరంతో అంటీఅంటనట్టుగా ఉన్న ఆయన తన పదవికి గండం సృష్టిస్తారేమోనన్న ఆందోళనలో పడ్డట్టుంది. దీంతో ఆదివారం ఏకంగా 50 మేకపోతుల్ని బలి ఇచ్చి పూజలు చేయడం గమనార్హం. వేదారణ్యంలోని ప్రసిద్ధి చెందిన వేదారణేశ్వరర్ ఆలయంలో వరుణ యాగంకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ యాగంకు మంత్రి, అన్నాడీఎంకే వర్గాలు తప్ప, బయటకు వ్యక్తులు ఎవ్వరు లేరు. ఇక్కడ యాగం అనంతరం నేరుగా మంత్రి మునీశ్వర ఆలయానికి చేరుకుని 50 మేక పోతుల్ని బలి ఇచ్చి, తన బంధువులు, సహచరులకు విందుతో పూజలు సాగించారు. తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో మంత్రి ఈ పూజలు సాగించినట్టుగా చర్చ ఊపందుకుంది.