రాష్ట్రంలో 4,433 మంది 'ఇతర' ఓటర్లు!
ఓటర్లుగా నమోదు చేయించుకునేటప్పుడు మీరు పురుషులా.. స్త్రీలా అని అడుగుతారు. రెండూ కానివారు తమకూ ఓటుహక్కు కావాలని ఎన్నాళ్లనుంచో చేసిన పోరాటం ఫలించింది. ఈసారి 'ఇతరులు' అనే విభాగం కింద ఇలాంటి వారిని కూడా ఓటర్లుగా నమోదు చేశారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 4,433 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వారి పేర్లు తుది జాబితాలో కనిపించాయి. ప్రధాన ఎన్నికల అధికారి ప్రచురించిన జాబితాలో ఈ పేర్లున్నాయి. గత సంవత్సరం మార్చి కంటే ఈ సంఖ్య 2,987 ఎక్కువ కావడం గమనార్హం. అంటే, దాదాపు మూడు వేల మంది తాము పురుషులం గానీ, మహిళలం గానీ కాదని చెప్పుకొని తాజాగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారన్నమాట.
లింగమార్పిడి చేయించుకున్నవాళ్లు తమను ఇతరుల విభాగంలో చేర్చాలని పట్టుబడుతున్నారు. అయితే.. మొత్తమ్మీద ఎల్జీబీటీ కమ్యూనిటీ లెక్కలు చూస్తే వారిలో ఓటర్లుగా నమోదు చేయించుకున్నవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏపీ శాక్స్) లెక్కల ప్రకారం చూస్తే ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20 వేల మంది లింగమార్పిడి చేయించుకున్నవాళ్లున్నారు. అదే రాష్ట్రం మొత్తమ్మీద అయితే 2.4 లక్షల మంది వరకు ఉన్నారు.
జనాభాతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య కాస్త తక్కువే అయినా, గతంతో పోలిస్తే నమోదు గణనీయంగా పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ వర్గంలో కూడా అవగాహన పెరగడం, తామూ ఓటు వేయాలన్న చైతన్యం రావడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మగ, ఆడ కాకుండా ఇతరులు అనే విభాగాన్ని 2010లో ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. అప్పటినుంచి క్రమంగా మన రాష్ట్రంలో కూడా ఈ వర్గానికి చెందిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం పెరుగుతూ వచ్చింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 6,23,88,619 మంది ఓటర్లున్నారు. వారిలో 3,13,56,704 మంది పురుషులు, 3,10,27,482 మంది మహిళలు, 4,433 మంది ఇతరులు ఉన్నారు. వీళ్లంతా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి అర్హులు.
ఇన్నాళ్లుగా లింగమార్పిడి చేయించుకున్నవాళ్లు బయటకు చెప్పుకొనేవారు కారని, కానీ ఇప్పుడు ఎల్జీబీటీ వర్గం మొత్తం తమకు ఓ గుర్తింపు కావాలని కోరుకుంటున్నట్లు వివిధ రకాల లైంగిక జీవన శైలులపై పరిశోధన చేస్తున్న చల్లా సుధారాణి తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల ఓటర్ ఐడీ కార్డుల్లోనూ తమ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు.