ప్రమాదాలను తప్పించుకొని బతకొచ్చు..!
మెల్బోర్న్ః భారీ కారు ప్రమాదం జరిగితే బతికే వారు అరుదే. అటువంటి ప్రమాదాలను ఎదుర్కొని ప్రాణాలకు నష్టం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలా అన్న ఆలోచననుంచి ఓ కళాకారుడికి తట్టిన రూపమే గ్రాహం. మనిషి కంటే కాస్త పెద్దదిగా.. మనిషిని పోలిన మనిషిగా రూపొందిన ఆ శిల్పాన్ని వినియోగించి, భవిష్యత్తులో ప్రమాద మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉండదంటున్నాడు రూపకర్త, కళాకారుడు ప్యాట్రిసియా పిక్సినిని. ప్రముఖ ట్రౌమా సర్జన్, ట్రాష్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ పర్ట్ ల సహకారంతో రూపొందిన ఆ శిల్పం.. (గ్రాహం) ఇప్పుడు ఆస్ట్రేలియా రహదారి భద్రతా ప్రచారంలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.
మెడ కనిపించకుండా ఉండే అతిపెద్ద హెల్మెంట్ లాంటి తల, వికారమైన శరీరాకృతి, గిట్టల్లా ఉండే పాదాలు, ఇంకా ఇతర అసాధారణ లక్షణాలతో కూడిన మానవాకృతి ఇప్పుడు ఆస్ట్రేలియా రహదారి భద్రతా ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అనుకోకుండా జరిగే కార్లు, వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడాలంటే ఏం చేయాలో చోదకులకు వివరించేందుకు వీలుగా కళాకారుడు ప్యాట్రిసియా పిక్సినిని.. ప్రముఖ ట్రౌమా సర్జన్, ట్రాష్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ పర్ట్ సహకారంతో 'గ్రాహం' ను రూపొందించాడు. రహదారుల్లో పెరుగుతున్న మరణాలు, గాయాల సంఖ్య తగ్గించడం, నియంత్రించడంలో భాగంగా 'గ్రాహం'.. తో అవగాహనా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆస్ట్రేలియా ట్రాన్స్ పోర్ట్ యాక్సిడెంట్ కమిషన్ సీఈవో.. జో కలాఫియోర్ తెలిపారు. విపరీతమైన వేగంతో కారు.. లేదా ఏదైనా వాహనం నడిపే సమయంలో యాక్సిడెంట్ అయితే ప్రాణాలతో బయటపడటం చాలా అరుదని, మానవుడి వేగంకంటే కార్ల వేగం చాలా ఎక్కువగా ఉండటంవల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవడం కష్టమౌతుందని కాలాఫియోర్ చెప్తున్నారు. అందుకే ప్రమాదాలనుంచి బయటపడేందుకు మనం చేసే తప్పులను, రోడ్ల వ్యవస్థను మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అటువంటివాటిని క్షుణ్ణంగా వివరించేందుకు గ్రాహం సహాయపడుతుందని కాలాఫియోర్ పేర్కొన్నారు.
రాయల్ మెల్బోర్న్ ఆస్పత్రిలో ట్రౌమా సర్జన్ గా పనిచేస్తున్న క్రిస్టియన్ కెన్ఫీల్డ్.., మోనాష్ యూనివర్శిటీ యాక్సిడెంట్ రీసెర్చ్ సెంటర్ క్రాష్ పరిశోధకుడు డేవిడ్ లోగాన్ లు గ్రాహం రూపకల్పనకోసం మెల్బోర్న్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా కళాకారుడు పిక్సినిని కి సహకారం అందించారు. ఈ సందర్భంలో శరీరంలో ముఖ్యమైన భాగం తల అని, దానికి దెబ్బలు తగిలితే చాలా ప్రమాదం అని, అలాగే తల ముందుభాగం, వెనుక భాగం, మెదడు ఇలా తల్లోని భాగాలతోపాటు వెన్నెముక వంటి శరీర భాగాలకు గాయాలైతే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందన్న విషయాలను గ్రాహం చక్కగా చెప్తుందని కెన్ ఫీల్డ్ వివరించారు. అలాగే ప్రమాదాల్లో పక్కటెముకలు వంటివాటిని రక్షించేందుకు వీలుగా ఎయిర్ బ్యాగ్ లాంటి ఆకారం, రాపిడిని తట్టుకునేట్లు మందపాటి చర్మం వంటివన్నీ గ్రాహం రూపకల్పనలో కనిపిస్తాయి. చూసేందుకు అసహజంగా, ఓ భయంకరమైన హారర్ సినిమా మనిషిలా ఉన్నా... భారీ రోడ్డు ప్రమాదాలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మాత్రం గ్రాహం తో కల్పించే అవగాహన ఎంతో సహాయపడుతుందని చెప్తున్నారు.