గిరిజన యువతిని వివస్త్ర చేసి.. గుండు గీసిన అత్తమామలు
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న పాపానికి ఓ గిరిజన యువతి(19)ని ఆమె అత్తమామలే వివస్త్రను చేసి, గుండు గీశారు. ఈ సంఘటన ఆగస్టు 30వ తేదీన జరిగినా, ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయమై థానె జిల్లా షాహాపూర్ తాలూకా పడ్గా పోలీసు స్టేషన్లో ఆ యువతి శనివారం ఫిర్యాదుచేసింది. ఆరోజు వాళ్లు తనను వివస్త్రను చేసి, గుండుగీసి, తీవ్రంగా కొట్టారని తెలిపింది. వాళ్ల కొడుకు యోగేష్ పాటిల్‌ను పెళ్లి చేసుకున్నందుకే ఇలా చేశారని ఆరోపించింది.
భివాండి పట్టణంలోని ఓ గోడౌన్లో తాను ప్యాకర్‌గా పనిచేస్తున్నప్పుడు యోగేష్‌తో పరిచయమై, అది ప్రేమగా మారిందని ఆమె తెలిపింది. పెద్దలు వద్దన్నా కూడా అతడు మే నెలలో ఆమెను పెళ్లి చేసుకుని, అత్తవారింట్లోనే ఉన్నాడు. అయితే, ఆగస్టు 30న వాళ్లు ఆ ఇంటికి వెళ్తుండగా యోగేష్ కుటుంబసభ్యులు వారిని బలవంతంగా భివాండీలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఇద్దరినీ గుమ్మానికి కట్టేశారు. తర్వాత యువతి బట్టలు విప్పి, ఆమెకు గుండుచేశారు. అంతేకాదు.. యోగేష్ సోదరుడు తన ఫొటోలు కూడా మొబైల్ ఫోన్లో తీసుకున్నాడని ఆమె ఆరోపించింది. యువతి గ్రామ సర్పంచి సంతోష్ పాటిల్ ఆమెను రక్షించి, వారిని పడ్గా గ్రామానికి తీసుకెళ్లారు. దాంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది. అత్తమామలపై 498ఎ, 354, 353, 504, 506, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాల కింద కేసు నమోదు చేశారు.