ఔట్లుక్ ప్రతినిధులకు ఊరట
తీర్పు వెలువరించే వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేత
హైదరాబాద్: తన ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించారంటూ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తీర్పును వెలువరించే వరకు ఈ కేసులో పిటిషనర్ల అరెస్ట్తోపాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
స్మితా సబర్వాల్ ప్రతిష్టను దిగజార్చేలా కథనం, కార్టూన్ ప్రచురించారంటూ ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ ఏడాది జూలై 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు మాధవి తాతా, సాహిల్ భాటియా, కృష్ణప్రసాద్, ఇంద్రనీల్రాయ్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వీరు జూలై 13న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు బుధవారం విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.