‘అవుట్ సోర్సింగ్’లో అవినీతి ఎంత?
సాధారణంగా ప్రభుత్వం ద్వారా చిన్న పనిచేయాలన్నా ముందుగా టెండర్లు పిలవాలి. నిబంధనల ప్రకారం పత్రికలకు ప్రకటనలు ఇచ్చి, పనులు అప్పగించాలి. అయితే చిత్తూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది, అధికారులకు ఇవేవీ పట్టడం లేదు. దాదాపు రూ.30 లక్షల విలువచేసే అవుట్ సోర్సింగ్ పనులకు టెండర్లు పిలవకుండానే తమకు కావాల్సిన వారిని కూర్చోబెట్టేశారు. ఇందులో అవినీతి, అక్రమాలు భారీగానే చోటు చేసుకున్నట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి.
చిత్తూరు (అర్బన్/క్రైమ్), న్యూస్‌లైన్:
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేయడానికి ప్రతి ఏటా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలవాలి. అయితే పదేళ్లుగా ఆ ఆస్పత్రి లో ఒకటే ఏజెన్సీ ఉండడంతో గతంలో పనిచేసిన కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ గుర్తించి, సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆ ఏజెన్సీకి పనులు రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశిం చారు. ఈ నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుకు ఆరు పోస్టులు, ఎలక్ట్రీషియన్-1, ఫార్మాసిస్ట్ (గ్రేడ్-2)-2, అటెండర్-1, ఆపరేషన్ థియేటర్ అటెం డరు-2, ఈసీజీ అసిస్టెంట్-1, జూనియర్ శానిటరీ వర్క ర్లు -9, జూనియర్ అసిస్టెంట్-1, దోబీ-2, ఫిజియోసిస్ట్-1, ల్యాబ్ అసిస్టెంట్-3, సీటీ స్కానర్ టెక్నీషియన్-1, ఓపీ టికెట్ రైటర్-2 పోస్టులకు అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే అధికారులు టెండరు నోటీసులు పిలవకుండానే పనులు కట్టబెట్టేశారు.
అవినీతికి ఆజ్యం ఇలా..
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి నిరుద్యోగులను తీసుకోవడానికి రెండు వార్తా పత్రికలకు టెండరు నోటీసు ప్రకటన ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో సంబంధిత టెండరు నోటీసులను ప్రచురించాలి. కానీ ఏజెన్సీ నియామకానికి టెండరు పిలుస్తున్నట్లు మూడో కంటికీ తెలియకుండా తమకు కావాల్సిన వారికి పనులు కట్టబెట్టేశారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న ఎనిమిది ఏజెన్సీలకు నామమాత్రంగా ఆస్పత్రి టెండర్లకు దరఖాస్తు చేయాలని రిజిస్టర్ పోస్టులు పంపారు. వీటికి ఐదు ఏజెన్సీలు స్పందించాయి. అందులో ఒక ఏజెన్సీ అభ్యర్థులకు నిర్ణయించిన వేతనాల్లో 0.38 శాతం తక్కువ కమీషన్‌కు కోడ్ చేయడంతో వారికి పనులు కట్టబెట్టారు. జూన్1 నుంచి టెండర్ అమలయ్యేలా వర్క్ ఆర్డర్లను అందజేశారు. అంతటితో ఆగక పారిశుద్ధ్య కార్మికుడి నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టు వరకు 20 పోస్టుల్లో తాము సూచించిన అభ్యర్థులనే పనుల్లో పెట్టుకోవాలని ఆ ఏజెన్సీ నిర్వాహకుడికి కొందరు అధికారులు హుకుం జారీ చేశారు. ఈ పోస్టులకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఆ అధికారులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుండగా చంద్రగిరి, తిరుపతికి చెందిన ఇద్దరు అభ్యర్థులు చెప్పిన సమాచారం ఈ ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తోంది. వారిద్దరూ ఆస్పత్రిలో సూపర్వైజర్ పోస్టుల కోసం ఓ మధ్యవర్తిని ఆశ్రయించి, రూ.1.5 లక్షలు సమర్పించుకున్నారు. తీరా పారిశుద్ధ్య పనులు అప్పగించడంతో వారు తిరగబడి తమ నగదు ఇచ్చేయాలని పట్టుబట్టారు. ఇచ్చిన మొత్తంలో సదరు మధ్యవర్తి రూ.30 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని ఆస్పత్రిలో పనిచేసే ఓ అధికారికి ఇచ్చినట్టు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఈ తతంగంపై కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
మాకు సంబంధం లేదు
ఏజెన్సీ ఎంపిక వ్యవహారంలో మాకు సంబంధంలేదు. ఇది పూర్తిగా జిల్లా అభివృద్ధి కమిటీ చూసుకుంటుంది. ఏయే పోస్టులు అవసరమనే విషయాలు మాత్రమే కలెక్టర్‌కు నివేదించాం. అభ్యర్థుల నుంచి నగదు ఎవరు తీసుకున్నారనే విషయాలూ మాకు తెలియవు. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎవరైతే ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్‌పై చేరారో వారినే అడిగి చూడండి. ఇదంతా కావాలనే ఎవరో నాపై పుకార్లు చేస్తున్నారు. ఇదే విషయంపై కలెక్టర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
-సరళమ్మ, డీసీహెచ్ఎస్, చిత్తూరు
పద్నాలుగేళ్లు పనిచేశా
ఆస్పత్రిలో ఓపీ టికెట్లు రాస్తూ దాదాపు 14 ఏళ్లకుపైగా పనిచేశా. ఇప్పుడేమో నన్ను పనిలో నుంచి తీసేసి, వేరే వాళ్లను తెచ్చి పెట్టుకున్నారు. పిల్లాపాపలు ఉన్న మాలాంటి వారి కడుపులు కొడితే మేం ఎక్కడకెళ్లి బతకాలి.
-సుజాత, కాంట్రాక్ట్ పని పోగొట్టుకున్న బాధితురాలు