కార్పొరేషన్ దిశగా పాలమూరు
వడివడిగా పడుతున్న అడుగులు
ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ అధికారులు
ఇప్పటికే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం..ప్రభుత్వానికి నివేదిక
కార్యరూపం దాల్చిన ఔటర్‌రింగ్‌రోడ్డు
అన్నీ సక్రమంగా జరిగితే స్మార్ట్ సిటీగా మహబూబ్‌నగర్
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ పట్టణం కొత్తరూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం గ్రేడ్–1 మున్సిపాలిటీగా, దాదాపు 3లక్షల జనాభాతో కొనసాగుతున్న పాలమూరు మున్సిపాలిటీ త్వరలో కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. గతంలో కేవలం 28 చ.కి.మీ మాత్రమే ఉన్న మహబూబ్‌నగర్ పట్టణం ప్రస్తుతం 98.82 చ.కి.మీలకు విస్తరించింది. రోజు రోజుకూ జనాభా విస్తరిస్తుండటంతో మెరుగైన సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. పట్టణాలను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు బృహత్ ప్రణాళిక రూపొందించాలన్నా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు.. కార్పొరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. 2011 జనగణన ప్రకారం 2.53 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 41వార్డులు ఉండగా... గతేడాది పది గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. దీంతో పట్టణ విస్తీర్ణం పెరగడంతోపాటు జనాభా కూడా మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని.. కార్పొరేషన్ చేయాలంటూ రెండు నెలల క్రితమే మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
స్మార్ట్‌సిటీగా వడివడి అడుగులు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు సమీప పట్టణాలను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రాజధానికి అత్యంత చేరువలో పాలమూరు ఉండడం... సీఎం కేసీఆర్‌కు ఈ పట్టణంపై ప్రత్యేక అభిమానం ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు కేవలం గంట వ్యవధిలో హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. జిల్లా కేంద్రం నుంచి రవాణాకు డోకాలేదు. ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు 24 గంటలపాటు బస్సు, రైళ్లు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
మణిహారంగా ఔటర్ రింగ్‌రోడ్డు
రాయిచూరు రహదారి కారణంగా పట్టణంలో ట్రాఫిక్‌కు తీవ్ర అటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణం చుట్టూ మణిహారంలా ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందుకు రూ.96 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. స్వయంగా ముఖ్యమంత్రి సంక్షేమనిధి నుంచి రహదారి నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దాదాపు దశాబ్ధకాలంగా మాటలకే పరిమితమవుతూ ఔటర్ రింగ్‌రోడ్డు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ రహదారి వల్ల ముఖ్యంగా జడ్చర్ల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే మార్గంలో అప్పనపల్లికి ముందు హౌసింగ్‌బోర్డు నుంచి ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేయనున్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి బండమీదపల్లి వెనక నుంచి అలీపూర్ రోడ్డును తాకుతూ పాలమూరు విశ్వవిద్యాలయం వెనకనుంచి రాయిచూరు ప్రధాన రహదారికి అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాయిచూరుకు వెళ్లే వాహనాలు పట్టణం మీదుగా వెళ్తుండడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం భారీ వాహనాలు రాత్రివేళ పట్టణం మధ్యలోనుంచి వెళ్తుండగా... ఉదయం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పక్కనుంచి భూత్పూరు జాతీయరహదారి గుండా వెళ్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇరుకుగా మారిపోయిన రహదారులకు... ఔటర్ రింగ్‌రోడ్డు వల్ల వాహనదారులకు ఉపశమనం చేకూరనుంది.
పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే, మున్సిపల్‌చైర్‌పర్సన్ ప్రత్యేక దృష్టి..
మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దశాబ్ధ కాలంగా ఎదురు చూస్తున్న ఔటర్ రింగ్‌రోడ్డును సీఎం కేసీఆర్ వద్ద గట్టిగా ప్రస్తావించి రహదారికి గ్రీన్‌సిగ్నల్ ఇప్పించగలిగారు. అంతేకాదు సీఎం ప్రత్యేక సంక్షేమనిధి నుంచి నిధులు కూడా మంజూరు చేయించారు. రహదారి కోసం భూసర్వే పనులు శరవేగంగా చేయిస్తున్నారు. అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ తనదైన వ్యూహ రచనతో అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నట్లు పేర్కొంటూ ఏకంగా కౌన్సిల్ చేత ఏకగ్రీవ తీర్మాణం చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.
ఔటర్‌రింగ్‌రోడ్డు ఇలా..
జడ్చర్లనుంచి జిల్లా కేంద్రానికి వచ్చే మార్గంలో అప్పన్నపల్లికి ముందు హౌసింగ్బోర్డునుంచి ప్రత్యేక రహదారిని నిర్మిస్తారు. ఈ రోడ్డును హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా బండమీదిపల్లి.. అల్లీపూర్ రోడ్డును తాకుతూ పాలమూరు విశ్వవిద్యాలయం వెనుకనుంచి రాయిచూరు ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తారు. రింగ్‌రోడ్డుకు ప్రభుత్వం రూ.96కోట్లు నిధులు కూడా ఇచ్చింది.