overall championship
-
ఫార్ములా–2 చాంపియన్ మిక్ షుమాకర్
సాఖిర్ (బహ్రెయిన్): వచ్చే ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) లో అరంగేట్రం చేయనున్న దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. ఆదివారం ముగిసిన ఫార్ములా–2 చాంపియన్ షిప్లో 21 ఏళ్ల మిక్ ఓవరాల్ చాంపియన్‌గా అవతరించాడు. 12 రేసుల ఈ సీజన్లో ప్రెమా రేసింగ్ జట్టు తరఫున పోటీపడిన మిక్ మొత్తం 215 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది మిక్ ఫార్ములావన్‌లో అమెరికాకు చెందిన హాస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. జిహాన్ దారూవాలాకు తొలి ఎఫ్2 టైటిల్... భారత్‌కు చెందిన రేసర్ జిహాన్ దారూవాలా తన కెరీర్లో తొలిసారి ఎఫ్2 రేసులో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ ఎఫ్2 రేసులో 22 ఏళ్ల జిహాన్ స్ప్రింట్ రేసు విభాగంలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. బ్రిటన్‌కు చెందిన కార్లిన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిహాన్ 34 ల్యాప్‌ల స్ప్రింట్ రేసును 37 నిమిషాల 26.570 సెకన్లలో ముగించి తొలి స్థానాన్ని పొందాడు. ముంబైకి చెందిన జిహాన్ ఎఫ్2 సీజన్లో 72 పాయింట్లు స్కోరు చేసి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. జిహాన్–యుకీ సొనోడా సభ్యులుగా ఉన్న కార్లిన్ జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 272 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందడం విశేషం. -
మెరిసిన హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: పలువురు మేటి క్రీడాకారులు పాల్గొన్న చైనా చెస్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ చెస్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ అదరగొట్టాడు. చైనాలోని షెన్జెన్ నగరంలో ముగిసిన ఈ లీగ్‌లో హరికృష్ణ సభ్యుడిగా ఉన్న షాంఘై చెస్ క్లబ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. హరికృష్ణకు ఓవరాల్‌గా ఉత్తమ ప్లేయర్ పురస్కారంతోపాటు ఉత్తమ విదేశీ ప్లేయర్ అవార్డు కూడా లభించాయి. 12 జట్ల మధ్య 22 రౌండ్లపాటు జరిగిన ఈ లీగ్‌లో షాంఘై క్లబ్ 38 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 17 మ్యాచ్‌ల్లో గెలిచిన షాంఘై జట్టు నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ లీగ్‌లో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ కేటాయించారు. హరికృష్ణ మొత్తం 19 గేమ్‌లు ఆడి 16.5 పాయింట్లు సాధించాడు. 14 గేముల్లో గెలిచిన అతను, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. షాంఘై జట్టులో హరికృష్ణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, మత్లకోవ్ మాక్సిమ్ (రష్యా), వాంగ్ పిన్, ని షికిన్, జు వెన్జున్, లూ యిపింగ్, జు యి, ని హువా (చైనా) సభ్యులుగా ఉన్నారు. -
ఓవరాల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరబాద్: స్టేట్ మీట్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు సత్తా చాటాయి. ఉస్మానియాలోని సైక్లింగ్ ట్రాక్‌పై అండర్-17 బాలబాలికల విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. టైమ్ ట్రయల్ బాలుర విభాగంలో అజయ్ కుమార్ (హైదరాబాద్)... బాలికల విభాగంలో స్వర్ణ కుమారి (హైదరాబాద్) విజేతలుగా నిలిచారు. మాస్ స్టార్ట్ విభాగంలోనూ నగరానికి చెందిన తనిష్క్ అగ్రస్థానంలో నిలవగా... బాలికల విభాగంలో చైతన్య (వరంగల్) మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇతర విజేతల వివరాలు టైమ్ ట్రయల్ బాలురు: 1. అజయ్ కుమార్ (హైదరాబాద్), 2. రిషింద్ర (రంగారెడ్డి), 3. ఆదిత్య (హైదరాబాద్), 4. బి.జయ సూర్య (కరీంనగర్). బాలికలు: 1. స్వర్ణ కుమారి (హైదరాబాద్), 2. వైష్ణవి (హైదరాబాద్), 3. శిరీష (కరీంనగర్), 4. స్రవంతి (వరంగల్). మాస్ స్టార్ట్ బాలురు: 1. తనిష్క్ (హైదరాబాద్), 2. రాజ్ కుమార్ (హైదరాబాద్), 3. శశిధర్ (వరంగల్), 4. సారుు కిరణ్ (కరీంనగర్). బాలికలు: 1. చైతన్య (వరంగల్), 2. వన్షిక (హైదరాబాద్), 3. మమత (కరీంనగర్), 4.అర్చన (వరంగల్). -
ఓవరాల్ చాంప్ డెలాయిట్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఒలింపిక్స్‌లో డెలాయిట్ ఉద్యోగులు సత్తాచాటారు. దీంతో డెలాయిట్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. మొత్తం 17 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో డెలాయిట్ క్రీడాకారులు 26 స్వర్ణాలు, 17 రజతాలు, 25 కాంస్య పతకాలతో కలిపి 68 పతకాలు సాధించారు. ఈ పోటీల్లో హెచ్ఎస్బీసీ-ఈడీపీ ఓవరాల్ రన్నరప్‌గా నిలిచింది. వికలాంగ అథ్లెట్ కిరణ్ కానోజియా బ్లేడ్ సాయంతో పరుగెత్తి అందరినీ ఆకట్టుకుంది. 800 మీటర్ల పరుగులో ఆమె కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా నిర్వాహకులు ప్రత్యేక బహుమతిని అందజేశారు. పురుషుల 100 మీ. పరుగులో సమిరన్ భరద్వాజ్ (డెలాయిట్) 12.66 సెకన్లలో పోటీని పూర్తిచేసి స్వర్ణం సాధించాడు. చార్లెస్ బిన్నీ, రాజ్ కుమార్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. 200 మీటర్ల పరుగు పందెంలో అర్జున్ మారి (డెలాయిట్) పోటీని 25.12 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రాజ్ కుమార్ (డెలాయిట్), కశ్యప్ (హెచ్ఎస్బీసీ-ఈడీపీ) వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. రవీందర్ (డెలాయింట్) ఉత్తమ పురుష అథ్లెట్‌గా, జయంతి పాఠక్ (వెరిజాన్) ఉత్తమ మహిళా అథ్లెట్‌గా అవార్డులు గెలుపొందారు. ఏడీపీ బృందం స్ఫూర్తిదాయక జట్టుగా, టీసీఎస్ క్రమశిక్షణ జట్టుగా, వెరిజాన్ ప్రేరణ ఇచ్చిన జట్టుగా అవార్డులు దక్కించుకున్నాయి. -
స్విమ్మింగ్ ఓవరాల్ చాంప్ ఓక్రిడ్జ్
రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల జూనియర్, సీనియర్ ఆక్వాటిక్ మీట్లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ స్కూల్ (ఖాజాగూడ) సత్తాచాటింది. గ్లెన్డేల్ అకాడమీలో శనివారం నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో ఓక్రిడ్జ్ బృందం ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. ఈ పోటీల్లో 14 పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఓక్రిడ్జ్ పాఠశాల విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో ఏడు బంగారు పతకాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలు గెలుపొందారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్ సేన్ బజాజ్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను, కోచ్‌లను అభినందించారు.