ఒవైసీ వ్యాఖ్యల్ని ఖండించిన ఎంపీ అసెంబ్లీ
భోపాల్ : తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేదిలేదన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఖండించింది. ఆయనపై ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జితు పట్వారీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఒవైసీ వైఖరిని ఖండించిన ఆయన తమ పార్టీ అన్ని రకాల మతవాద భావజాలాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒవైసీలో ఇటువంటి భావజాలం మంచిది కాదని, సర్వ మతాల సంగమంగా ఉన్న దేశాన్ని 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'గా తొలి ప్రధాని నెహ్రూ రూపుదిద్దారని ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర శాసన వ్యవహారాల మంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ ఒవైసీలో ఇటువంటి జాతి వ్యతిరేక మనస్తత్వాన్ని ఏడాదిన్నరగా గమనిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలువురు సభ్యులు ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కాంగ్రెస్, బీజేపీ సభ్యులమధ్య విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గందరగోళం మధ్యే అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్ శర్మ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.