దయనీయం.. ఇంటి పైకప్పుతో తల్లి అంత్యక్రియలు
కలహంది: మొత్తం దేశ వ్యాప్తంగా మానవతావాదుల హృదయాలను కదిలించిన ఒడిశాలోని మాఝి అనే గిరిజన వ్యక్తి ఘటన మరువక ముందే అచ్చం అలాంటి హృదయవిదారక ఘటనే ఒడిశాలోని కలహంది జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది. తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కూతుళ్లు ఇంటి పైకప్పుకు ఉన్న కలపను ఉపయోగించారు. కనక్ సప్తతి (75) అనే మహిళ దీర్ఘకాలిక అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. వారిది చాలా బీద కుటుంబం.
ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఊర్లో వారందరిని తమకు సహాయం చేయాల్సిందిగా అర్థించారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో చేసేది లేక సొంత ఇంటి పైకప్పు ఊడదీశారు. దాని ద్వారా వెళ్లిన కలప తీసుకెళ్లి ఏర్పాట్లు చేశారు. శవాన్ని తీసుకెళ్లేందుకు సహాయంగా ఎవరూ రాకపోవడంతో ఇంట్లోని ఓ మంచంపై పెట్టి వారే స్వయంగా మోసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ ఇవ్వకుంటే భార్య శవాన్ని భుజానికెత్తుకుని మాఝి అనే గిరిజన వ్యక్తి మోసుకెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.