సమ్మర్ బరిలో గెలిచెదేవరు?
త్రిముఖ పోటీ. గెలిచేదెవరు? నిలిచేదెవరు? ఇదే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. భారీ అంచనాలున్న మూడు చిత్రాలు శుక్రవారం ఒకే సారి తెరపైకి వస్తున్నాయి. శివలింగ, పా.పాండి, కడంబన్ ఈ మూడు చిత్రాలే అవి. వీటిలో ముందుగా చెప్పుకోవలసింది పా.పాండి. పవర్ పాండిగా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం పేరును రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను కోల్పోకుండా పా.పాండి అని టైటిల్‌ను చివరి క్షణంలో మార్చారు. ఇక ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే నిత్యం వార్తల్లో ఉంటున్న యువ నటుడు ధనుష్ తొలి సారిగా మెగాఫోన్ పట్టడం.
ఆయనే కథను తయారు చేసుకుని తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించి ప్రత్యేక పాత్రలో మెరిసిన పా.పాండి చిత్రంలో నటుడు రాజ్‌కిరణ్ కథానాయకుడిగా నటించారు. నటి రేవతి, ప్రసన్న, ఛాయాసింగ్, మడోనా సెబాస్టియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాన్‌రోల్డన్ సంగీతాన్ని అందించారు. జీవితం అంతా కుటుంబం కోసం ధారపోసి, కష్టపడి సంపాదించిన వారికి వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను తెరపై ఆవిష్కరించిన చిత్రం పా.పాండి. ఈ చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి పరిశ్రమ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మెండుగానే ఉంది. ఇక రెండో చిత్రం శివలింగ. తొలుత కన్నడంలో రూపొంది మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్ర తమిళ రీమేక్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం జరగడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి.
కన్నడ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పీ.వాసు తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేశారు. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఇందులో బాక్సింగ్ క్రీడాకారిణి, ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్ రితికాసింగ్ నాయకిగా నటించింది. ఇది హారర్ కథా చిత్రం కాబట్టి సహజంగానే ఆసక్తి నెలకొంది. ఇక మూడో చిత్రం కడంబన్. ప్రముఖ నిర్మాత ఆర్బీ.చౌదరి సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థతో ఆర్య చిత్ర నిర్మాణ సంస్థ ది షో పీపుల్ కలిసి నిర్మిస్తున్న ఇందులో ఆర్యతో క్యాథరిన్ ట్రేసా నటించింది. అధిక భాగం అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి రాఘవ దర్శకుడు. ఇది అడవులను ఆక్రమించుకుని కార్పోరేట్ సంస్థలు దేశ ప్రజలను ఎలా బాధింపునకు గురి చేస్తున్నాయన్న సందేశంతో కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రం కడంబన్. మరో విశేషం ఏమిటంటే శివలింగ, కడంబన్ చిత్రాలు తెలుగులోనూ విడుదల కానున్నాయి. కాగా దేనికది ప్రత్యేకతను, అంచనాలను సంతరించుకున్న ఈ మూడు చిత్రాల్లో ఏది అధిక ప్రేక్షకాదరణ పొందుతుందన్న విషయం ఆసక్తిగా మారింది.