స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు!
మహారాణిపేట/ముంచంగిపుట్టు/సాలూరు/సాక్షి, అమరావతి : అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సిద్ధం చేస్తుండగానే తల్లిదండ్రులు స్కూటీపై తీసుకెళ్లడం కలకలం రేపింది. అధికారులు మార్గమధ్యంలో గుర్తించి, మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి సొంతూరుకు తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు, మహేశ్వరి దంపతులకు ఈ నెల 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు.
బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్ పిల్లల వార్డుకు రిఫర్ చేశారు. అదే రోజున శిశువును కేజీహెచ్ పిల్లల వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఎన్ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు కేజీహెచ్‌లోని గిరిజన సెల్ ఇన్చార్జి రామకృష్ణకు తెలిపారు.
శిశువు మృతదేహం తరలింపునకు వాహనం సిద్ధం చేస్తూండగానే.. తండ్రి ద్విచక్ర వాహనంపై తీసుకొని వెళ్లినట్టు ఆయన పాడేరు డీఎంహెచ్‌వో, ఐటీడీఏ పీవోకు సమాచారమిచ్చారు. ఈ విషయం కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో సిబ్బంది మృత శిశువును తీసుకెళ్తున్న స్కూటీని పాడేరు వద్ద గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో కుముడు గ్రామానికి తరలించారు. కేజీహెచ్ సిబ్బంది సరిగా స్పందించనందుకే తామిలా తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు.
విచారణకు ఆదేశం
ఈ ఘటనపై విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లను సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సాలూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీడీఏ అంబులెన్స్‌కు ఆయిల్ పట్టించుకుని వస్తామని సిబ్బంది తెలిపినప్పటికీ వినకుండా సదరు వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతోనో వెళ్లిపోయారన్నారు. అయినప్పటికీ మార్గం మధ్యలో వారిని గుర్తించి, అంబులెన్స్‌లో శిశువు మృతదేహాన్ని తరలించారని తెలిపారు.
ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా సీఎంకు మానవత్వం లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనులకు మంచి వైద్యం కోసం సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ విచారణ చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.