స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు! | child boy body was moved on a scooty | Sakshi
Sakshi News home page

స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు!

Published Fri, Feb 17 2023 4:13 AM | Last Updated on Fri, Feb 17 2023 4:13 AM

child boy body was moved on a scooty - Sakshi

స్కూటీపై మృతదేహంతో పసిబిడ్డ తల్లిదండ్రులు మత్స్యరాజు, మహేశ్వరి

మహారాణిపేట/ముంచంగిపుట్టు/సాలూరు/సాక్షి, అమ­రా­వతి : అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్‌ సిద్ధం చేస్తుండగానే తల్లిదండ్రులు స్కూటీపై తీసుకెళ్లడం కలకలం రేపింది. అధికారులు మార్గమధ్యంలో గుర్తించి, మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి సొంతూరుకు తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు, మహేశ్వరి దంపతులకు ఈ నెల 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు.

బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్‌ పిల్లల వార్డుకు రిఫర్‌ చేశారు. అదే రోజున శిశు­వును కేజీహెచ్‌ పిల్లల వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఎన్‌ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందు­తూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విష­యాన్ని వైద్యులు కేజీహెచ్‌లోని గిరిజన సెల్‌ ఇన్‌చార్జి రామకృష్ణకు తెలిపారు.

శిశువు మృతదేహం తరలింపున­కు వాహనం సిద్ధం చేస్తూండగానే.. తండ్రి ద్విచక్ర వా­హనంపై తీసుకొని వెళ్లినట్టు ఆయన పాడేరు డీఎంహెచ్‌­వో, ఐటీడీఏ పీవోకు సమా­చారమిచ్చారు. ఈ విషయం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. కలెక్టర్‌ ఆదేశా­లతో సిబ్బంది మృత శిశువును తీసుకెళ్తున్న స్కూటీని పాడేరు వద్ద గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో కుముడు గ్రామానికి తరలించారు. కేజీహెచ్‌ సిబ్బంది సరిగా స్పందించనందుకే తామిలా తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు.  

విచారణకు ఆదేశం
ఈ ఘటనపై విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లను సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సాలూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీడీఏ అంబులెన్స్‌కు ఆయిల్‌ పట్టించు­కుని వస్తామని సిబ్బంది తెలిపినప్పటికీ వినకుండా సద­రు వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతోనో వెళ్లిపోయార­న్నారు. అయినప్పటికీ మార్గం మధ్యలో వారిని గుర్తించి, అంబులెన్స్‌లో శిశువు మృతదేహాన్ని తరలించారని తెలి­పారు.

ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా సీఎంకు మానవత్వం లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనులకు మంచి వైద్యం కోసం సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలి­పారు. కాగా, ఈ ఘటనపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ విచారణ చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement