సాలూరులో జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్రలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాతే గిరిజనులకు మేలు జరిగిందని, వారి జీవితాలు బాగుపడ్డాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సామాజిక సాధికారయాత్రలో భాగంగా బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ వచ్చిన తర్వాతే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయని తెలిపారు. కేబినెట్, ఇతర పదవుల్లో 70 శాతం బడుగు, బలహీనవర్గాలకే అందించిన ఘనత దేశంలో ఒక్క జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, అలా తొలుత పుష్పశ్రీవాణి, తర్వాత తనకు ఆ గౌరవం దక్కిందన్నారు.
అడగకుండానే ఎస్టీ కమిషన్ వేశారని, గిరిజన సలహామండలిని నియమించారని, జీసీసీ, ట్రైకార్ సంస్థలకు చైర్మన్ పదవులను భర్తీచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో గిరిజనులనే కాదు ఎస్సీలు, బీసీలనూ చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఓ అనామకుడిని తీసుకొచ్చి ఈయనే గిరిజనశాఖ మంత్రి అన్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లోనూ చంద్రబాబుకు, జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. పింఛన్లు, ఇళ్లు, చేయూత, వైఎస్సార్ రైతుభరోసా.. వంటి ఎన్నో పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సామాజిక న్యాయం, సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ జగన్‌నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సాలూరులో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం
అర్హులందరికీ సంక్షేమం: మంత్రి ధర్మాన
జీవితాలను బాగు చేసుకోవడానికి పాలనలో భాగస్వామ్యం, రాజ్యాధికారం కోసం తరాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎవరూ ఉద్యమాలు చేయకుండానే పాలనలో పెద్దపీట వేశారని వివరించారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు అంటూ వివక్ష, ఆశ్రిత పక్షపాతం, లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగనే అని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుచేసి, సామాజిక న్యాయాన్ని సుసాధ్యం చేసి చూపిన నవతరం నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. మూడుసార్లు అవకాశం ఇచ్చినా బీదల సంక్షేమం గురించి ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. హామీలన్నీ తూచా తప్పకుండా అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను కాదని, చంద్రబాబు మాయలో పడి ఓటేస్తే మన పీక మనమే కోసుకున్నట్లేనని ధర్మాన హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్పాదాయ వర్గాలకు ఎంతో అవసరమని చెప్పారు.
చిన్నచూపున్న బాబుకు ఓటెందుకు వేయాలి?
నాయీ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తానని, మత్స్యకారులను చితక్కొట్టిస్తానని, బీసీలు ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిలుగా పనికిరారంటూ చిన్నచూపు చూసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిరావు పూలే ఆశయాలను సాకారం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, అలజంగి జోగారావు, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్తురాజు, జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతి రాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment