నమ్మించి ముంచడమే వారి నైజం | CM YS Jagan Fires On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

నమ్మించి ముంచడమే వారి నైజం

Published Thu, Jun 29 2023 5:16 AM | Last Updated on Thu, Jun 29 2023 5:16 AM

CM YS Jagan Fires On Chandrababu And Pawan Kalyan - Sakshi

గాంధీ గారి మూడు కోతుల కథలో ‘చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు అనొద్దు’ అని నీతి చెబుతాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ‘మంచి వినొద్దు, మంచి కనొద్దు, మంచి అనొద్దు, మంచి చేయొద్దు’ అనే నాలుగు కోతులున్నాయి. వీరినే దుష్ట చతుష్టయం అని మనం పిలుచుకుంటున్నాం. అవినీతి సొమ్మును పంచుకోవడం కోసం వారికి అధికారం కావాలి. ఇదీ వారి దుర్నీతి. నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడమే వారికి తెలిసిన ఏకైక నీతి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌   

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘మనం ప్రజలకు మంచి చేస్తున్నామని కొంత మందికి కడుపులో మంట. వారికి మద్దతుగా ఉండే దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. పదేపదే అబద్ధాలు చెబుతూ, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఈర్ష్యతో కళ్లు కప్పుకుపోయాయి. వీరి దుర్నీతిని ప్రజలు గమనించాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అమ్మఒడి నాలుగో ఏడాది ఆర్థిక సాయం విడుదల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండీ కూడా ఏమీ చేయని ఓ నాయకుడు (చంద్రబాబు), ఆ నాయకుడి కోసం 15 ఏళ్ల కిందటే పుట్టిన ఓ దత్తపుత్రుడు (పవన్‌ కళ్యాణ్‌) మన ప్రభుత్వం చేస్తున్న మంచి చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ‘ఇదీ టీడీపీ అంటే.. టీ–తినుకో, డీ–దోచుకో, పీ–పంచుకో. దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ.. బొజ్జలు పెంచుకుంటూ.. బొజ్జ రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. వారి పత్రికలు, వారి టీవీలతో కలిసి మంచి పనులు చేస్తున్న మనపై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

కొత్త డ్రామాలు మొదలు 
► మూడుసార్లు సీఎం అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని చంద్రబాబు.. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్‌ తెస్తారు. అది చేస్తా, ఇది చేస్తా అంటారు. అధికారంలోకి వస్తే దానిని చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్‌ రికార్డు. ఇదే దుష్ట చతుష్టయం, ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్లీ మోసానికి దిగారు. డ్రామాలు మొదలు పెట్టారు.  

► ఈసారి డ్రామాలను కొంచెం రక్తి కట్టించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారంట.. మోసం చేసేదానికి ఒక హద్దు పద్దు లేకుండా పోయింది. జగన్‌ ఏం చేస్తున్నాడు.. జగన్‌ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని చెప్పి మోసం చేయడంలో రక్తి కట్టిస్తున్నాడు. వీళ్లందరికీ తోడు ఒక దత్త పుత్రుడు ఉన్నాడు. 2014లో చంద్రబాబుకు మద్దతు పలికాడు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు దత్తపుత్రుడి సంతకాలతో మీకు లేఖలు వచ్చాయి. మాదీ బాధ్యత అని, అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయాక ఎన్నికల ప్రణాళికను చెత్తబుట్టలో వేశారు. 

ప్యాకేజీ స్టార్‌ ఊగిపోతున్నాడు 
► రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్న పిల్లలను సైతం వదలకుండా చంద్రబాబు మోసం చేశాడు. పూచీగా సంతకం పెట్టిన దత్తపుత్రుడు ఐదేళ్లలో ఒక్క మాటా మా ట్లాడలేదు. అలాంటి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్‌ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు. దాని పేరు వారాహి అట. ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు.. గుడ్డలూడదీసి తంతానంటాడు.. ఈయన నోటికి అదుపులేదు.. మనిషికి నిలకడ లేదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు.  అలా మనం మాట్లాడలేం. వారి లా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం. బూతులు తిట్ట లేం. నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకురాలేం. ఇవన్నీ వారికే పేటెంట్‌.  

తేడా మీరే గమనించాలి 
► బాబు వర్గానికి అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం (డీపీటీ). వాళ్ల పునాదులు, మన పునాదుల మధ్య తేడా గమనించండి. అప్పుడూ ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. మారిందల్లా కేవలం ఒక్క జగన్‌ మాత్రమే. మరి వాళ్లెందుకు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయారు? మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు?  వాళ్ల సోషల్‌ మీడియా, పత్రికలు, టీవీలు, వాళ్లంతా కలిసికట్టుగా రోజూ అదే అబద్ధాలు, వాళ్లు చేస్తున్న దుర్నీతిని గమనించాలి. చిన్న పొరపాటు జరిగినా ఇంతింత పెద్దగా చూపిస్తున్నారు. మనది కాని తప్పును మన మీద వేస్తూ బురద జల్లుతున్నారు.  

► మీ బిడ్డ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలే. రాష్ట్రానికి హోం మంత్రి నా దళిత చెల్లెమ్మ. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకొని సమాజాన్ని చీల్చడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూడాలి.  

► ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స , గుడివాడ, ఎంపీలు బెల్లాన, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, కళావతి, అలజంగి జోగారావు, కంబాల జోగులు, శంబంగి చినవెంకట అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం (సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌), పాలవలస విక్రాంత్, రఘురాజు తదితరులు పాల్గొన్నారు.  
మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ చెట్టెక్కి ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు   

పేదల పట్ల ప్రేమ నుంచి మన పునాదులు 
► మన పార్టీ పునాదులు పేదల పట్ల ప్రేమలోంచి పుట్టాయి. రైతుల మమకారంలోంచి పుట్టాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలోంచి పుట్టాయి. మాట ఇచ్చి మోసం చేయడం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. నా అక్కచెల్లెమ్మల భవిష్యత్తు కోసం, వారి కుటుంబాల భవిత కోసం  రెండు లక్షల 23 వేల కోట్ల రూపాయలు నాలుగేళ్లలో నేరుగా వారికి అందించిన డీబీటీ మీద మన పునాదులు పుట్టాయి. 

► పేదల కోసం తీసుకొస్తున్న విద్యా విప్లవంలో, వాళ్లకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో, వారి కోసం కట్టిస్తున్న ఇళ్లలో.. గ్రామాల్లో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న పౌర సేవల్లో నా పునాదులున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల్లో మన పునాదులున్నాయి. వాళ్ల మాదిరిగా పనికిమాలిన పంచ్‌ డైలాగుల్లో మన పునాదులు లేవు.  

► మన ఓదార్పు యాత్ర నుంచి, 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నుంచి, పేదల కష్టాల్లోంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోటులోంచి నా పునాదులు పుట్టలేదు. అబద్ధాలపైన మన పునాదులు లేవు. దోచుకో, పంచుకో, తినుకో అనే సిద్ధాంతం నుంచి పుట్టలేదు. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చడంలో లేవు. 

ఇదీ మన ఫిలాసఫీ 
► 2009 నుంచి ఇప్పటి వరకు పేద వాడి కోసం నిలబడగలిగిన జగన్‌ను గమనిస్తే.. ఏ కార్యకర్త అయినా అడు గో అతడే మా నాయకుడని కాలర్‌ ఎగరేసేలా నడత, ప్రవర్తన ఉంది. ఏ రోజూ అధర్మాన్ని, అబద్ధాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు. అధికారం కోసం, పొత్తుల కోసం పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ పేదవాడు బాగుండాలని ఆలోచన చేశా. ఇదీ మన పునాది, ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ, ఇదీ మన మనసున్న ప్రభుత్వం.  

► ఈ రోజు చేసిన మంచే మన బలం, ఇదే మన నినాదం. మనం యుద్ధం చేస్తున్నది రాక్షసులతో. అధర్మాన్నే ధర్మంగా వాళ్లు ఎంచుకొని యుద్ధం చేస్తున్నారు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లేదు. ఓ దత్తపుత్రుడు తో డుగా లేడు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పిందే చెప్పి.. అదే నిజమని భ్రమ కలిగించే మీడియా మాధ్యమాలూ లేవు. మీ బిడ్డ ఇలాంటి తోడేళ్లను నమ్ముకో లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్నే.  

► వీళ్లు చెబుతున్న అబద్ధాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డకు శ్రీరామరక్షగా నిలవాలని కోరుతున్నా. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement