Padmavathamma
-
పద్మావతీ అమ్మవారికి బంగారు వడ్డాణం కానుక
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి ఆదివారం రూ.10లక్షల విలువైన రాళ్లు పొదిగిన బంగారు వడ్డాణం కానుకగా అందింది. తిరుచానూరుకు చెందిన అమరజ్యోతి కల్యాణమండపం అధినేత బలరామనాయుడు రూ.10లక్షల వెచ్చించి, 286 గ్రాముల బంగారంతో పచ్చ, కెంపు, తెలుపు రాళ్లను పొదిగించి వడ్డాణాన్ని తయారుచేయించారు. ఆదివారం అమ్మవారి ఆలయంలో పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ రవి, అర్చకులు బాబు స్వామిలకు వడ్డాణం అందించారు. అధికారులు దాత కుటుంబసభ్యులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. -
టీటీడీకి రూ.3 కోట్ల ఆస్తి రాసిస్తా !
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకు వస్తే తన రూ.3 కోట్ల విలువైన ఆస్తి రాసి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం కడిగిరి గ్రామానికి చెందిన పద్మావతమ్మ (70) వెల్లడించారు. సోమవారం తిరుమలకు వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తనపేరు మీద, తన భర్త గోపాల్శెట్టి పేరు మీద కడిగిరి గ్రామంలో రూ. మూడు కోట్ల విలువైన భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని చెప్పారు. అధికారులు ముందుకు వస్తే... ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా టీటీడీకి రాసిస్తానని, సంబంధిత పత్రాలను కూడా అందజేస్తానని ప్రకటించారు. అలాగే తన ఆరోగ్యం కుదుటపడేందుకు అధికారులు సాయం చేయాలని ఆమె టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.