
కానుకగా అందజేసిన వడ్డాణం
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి ఆదివారం రూ.10లక్షల విలువైన రాళ్లు పొదిగిన బంగారు వడ్డాణం కానుకగా అందింది. తిరుచానూరుకు చెందిన అమరజ్యోతి కల్యాణమండపం అధినేత బలరామనాయుడు రూ.10లక్షల వెచ్చించి, 286 గ్రాముల బంగారంతో పచ్చ, కెంపు, తెలుపు రాళ్లను పొదిగించి వడ్డాణాన్ని తయారుచేయించారు. ఆదివారం అమ్మవారి ఆలయంలో పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ రవి, అర్చకులు బాబు స్వామిలకు వడ్డాణం అందించారు. అధికారులు దాత కుటుంబసభ్యులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు.