నేడు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. 9 రోజుల పాటు ఎటువంటి అవరోధాలు, ఆటంకాలూ కలుగకుండా బ్రహ్మోత్సవాలు సవ్యంగా జరగాలని సకల దేవతలను ప్రార్థిస్తూ అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఉద్యానవనంలో సర్వసేనాధిపతియైన విష్వక్సేనులు సమక్షంలో పుట్టమన్ను సేకరించనున్నారు. పుట్టమన్నుతో సహా విష్వక్సేనుల వారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి నవపాలికలలో పుట్టమన్ను నింపి, అందులో నవధాన్యాలు వేసి, అంకురార్పణకు శ్రీకారం చుట్టనున్నారు.
ఉదయం లక్ష కుంకుమార్చన..
శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారిని కొలువుదీర్చి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు లక్షకుంకుమార్చన సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు టికెట్ రూ.1,116 చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చు. భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని ఆలయాధికారులు తెలిపారు.