పద్మావతీ అమ్మవారి దర్శన సమయం పొడిగింపు
తిరుచానూరు : వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తడం సర్వసాధారణం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తిరుచానూరులో కొలువైన శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతి అమ్మవారి(అలిమేలు మంగమ్మ)ని కూడా దర్శించుకుంటారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి దర్శన సమయాన్ని ఏప్రిల్ 15వ తేదీ నుంచి మరోగంట పొడిగించారు. సాధరణంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయాన్ని ఉదయం 5గంటలకు తెరిచి రాత్రి 9.30గంటలకు మూసివేసేవారు. దర్శన సమయాన్ని పొడిగించడంతో జూన్ నెలాఖరు వరకు రాత్రి 10.30 గంటల వరకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు. ఆలయంలోకి వెళ్లేందుకు రాత్రి 10 వరకు భక్తులను అనుమతిస్తారు.
అదేవిధంగా ఆలయంలో ఏకాంత సేవను ప్రతిరోజు రాత్రి 8.45 (శుక్రవారం మాత్రం రాత్రి 9.15) గంటలకు నిర్వహించేవారు. అయితే జూన్ నెలాఖరు వరకు రాత్రి 9.45గంటలకు ఏకాంతసేవను నిర్వహించనున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్ధం రాత్రి 10.30గంటల వరకు తిరుచానూరు-తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను టీటీడీ కోరింది.