Tiruchanuru
-
నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభమైంది. ఆలయ డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంలోని లడ్డూ కౌంటర్‌ను వెలుపలికి తరలించాలని టీటీడీ ఈవో, జేఈవోలు ఆదేశించినట్లు తెలిపారు. దీంతో ఓ భక్తుడు అందించిన రూ.80లక్షల విరాళంతో వాహనమండపం వెనుక నూతన భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ భవనంలో కింది భాగం లడ్డూ కౌంటర్లు, మొదటి అంతస్తులో పరకామణి గదిని ఏర్పాటుచేశామన్నారు. ఇకపై భక్తులకు బార్‌కోడింగ్‌తో కూడిన లడ్డూ టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ రవి, ఏఈ శివయ్య పాల్గొన్నారు. -
పద్మావతీ అమ్మవారికి బంగారు వడ్డాణం కానుక
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి ఆదివారం రూ.10లక్షల విలువైన రాళ్లు పొదిగిన బంగారు వడ్డాణం కానుకగా అందింది. తిరుచానూరుకు చెందిన అమరజ్యోతి కల్యాణమండపం అధినేత బలరామనాయుడు రూ.10లక్షల వెచ్చించి, 286 గ్రాముల బంగారంతో పచ్చ, కెంపు, తెలుపు రాళ్లను పొదిగించి వడ్డాణాన్ని తయారుచేయించారు. ఆదివారం అమ్మవారి ఆలయంలో పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ రవి, అర్చకులు బాబు స్వామిలకు వడ్డాణం అందించారు. అధికారులు దాత కుటుంబసభ్యులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. -
నేడు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. 9 రోజుల పాటు ఎటువంటి అవరోధాలు, ఆటంకాలూ కలుగకుండా బ్రహ్మోత్సవాలు సవ్యంగా జరగాలని సకల దేవతలను ప్రార్థిస్తూ అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఉద్యానవనంలో సర్వసేనాధిపతియైన విష్వక్సేనులు సమక్షంలో పుట్టమన్ను సేకరించనున్నారు. పుట్టమన్నుతో సహా విష్వక్సేనుల వారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి నవపాలికలలో పుట్టమన్ను నింపి, అందులో నవధాన్యాలు వేసి, అంకురార్పణకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం లక్ష కుంకుమార్చన.. శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారిని కొలువుదీర్చి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు లక్షకుంకుమార్చన సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు టికెట్ రూ.1,116 చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చు. భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని ఆలయాధికారులు తెలిపారు. -
వైభవంగా పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుచానూరు (చిత్తూరు): తిరుచారూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవంలో తొలిరోజు రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పపై పుష్కరిణిలో విహరించారు. అందులో భాగంగా రెండో రోజైన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామికి అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 7.30 గంటల నుంచి తిరుచ్చి వాహనసేవ జరుగుతుంది. -
పద్మావతీ అమ్మవారి దర్శన సమయం పొడిగింపు
తిరుచానూరు : వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తడం సర్వసాధారణం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తిరుచానూరులో కొలువైన శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతి అమ్మవారి(అలిమేలు మంగమ్మ)ని కూడా దర్శించుకుంటారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి దర్శన సమయాన్ని ఏప్రిల్ 15వ తేదీ నుంచి మరోగంట పొడిగించారు. సాధరణంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయాన్ని ఉదయం 5గంటలకు తెరిచి రాత్రి 9.30గంటలకు మూసివేసేవారు. దర్శన సమయాన్ని పొడిగించడంతో జూన్ నెలాఖరు వరకు రాత్రి 10.30 గంటల వరకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు. ఆలయంలోకి వెళ్లేందుకు రాత్రి 10 వరకు భక్తులను అనుమతిస్తారు. అదేవిధంగా ఆలయంలో ఏకాంత సేవను ప్రతిరోజు రాత్రి 8.45 (శుక్రవారం మాత్రం రాత్రి 9.15) గంటలకు నిర్వహించేవారు. అయితే జూన్ నెలాఖరు వరకు రాత్రి 9.45గంటలకు ఏకాంతసేవను నిర్వహించనున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్ధం రాత్రి 10.30గంటల వరకు తిరుచానూరు-తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను టీటీడీ కోరింది. -
వైభవంగా పంచమి తీర్థం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం పద్మసరోవరం(పుష్కరిణి)లో అత్యంత వైభవంగా పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్రస్నానం చేసి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి పుట్టిన రోజున నిర్వహించే ముఖ్యమైన ఘట్టం చక్రస్నానం. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9.30గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. వేదపండితులు అమ్మవారికి, చక్రతాళ్వారుకు కన్నులపండువగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం 11.50గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానమాచరించారు. అమ్మవారికి శ్రీవారిసారె పంచమీతీర్థం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారికి తిరుమల ఆలయం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి వారి సారె పంపారు. టీటీడీ ఈవో గిరిధ ర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆలయం నుంచి తీసుకొచ్చి తిరుమలలో ఊరేగింపు నిర్వహించారు. తిరుమల నుంచి పరిచారకులు నెత్తినపెట్టుకుని నడకదారిలో తిరుపతి అలిపిరి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబారీలపై ఊరేగింపుగా తిరుచానూరు తీసుకొచ్చి తిరుపతి జేఈవో భాస్కర్‌కు అందజేశారు. ఆయన సారెను పంచమీతీర్థం మండపానికి తీసుకురాగా వేదపండితులు అమ్మవారికి అలంకరించారు. అదేవిధంగా శ్రీపద్మావతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారు తరపున తిరుమల దేవేరికి పచ్చరాయి పొదిగిన విలువైన హారాన్ని కానుకగా అందజేశారు. ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు ఈనెల 19న ధ్వజారోహణంతో ప్రారంభమైన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను గురువారం రాత్రి ఆలయంలో వేదపండితులు ధ్వజావరోహణం నిర్వహించి ముగించారు. నేడు పుష్పయాగం బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అమ్మవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. తెలిసోతెలియకో జరిగిన పొరపాట్లకు దోషనివారణగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం దాతలు సమకూర్చిన దాదాపు ఆరు టన్నుల 12రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పయాగం నిర్వహిస్తారు. -
తిరుప్పావడ సేవలో గవర్నర్ దంపతులు
సాక్షి, తిరుమల: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. పుష్కరిణి నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. తర్వాత ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి, వకుళమాతను దర్శించుకుని హుం డీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ గవర్నర్ దంపతులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాన్వాయ్‌లో ఆగిన గవర్నర్ కారు.. మరో కారులో ప్రయాణం తిరుమల పర్యటనలో గురువారం ఉదయం గవర్నర్ కారు మధ్యలో ఆగింది. అతిథి గృహం నుంచి ఆలయానికి వెళ్లే సమయంలో రాంబగీచా వద్ద కారులో హఠాత్తుగా వాసన రావడంతో పాటు ముందుకు కదలలేదు. దీంతో గవర్నర్ నరసింహన్ దంపతులు కాన్వాయ్‌లో వెనుకే వస్తున్న మరో కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. హ్యాండ్ బ్రేక్‌ను డ్రైవర్ రిలీజ్ చేయకుండానే కారు నడపడంతో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసు దర్యాప్తునకు ఆదేశించినట్టు సమాచారం. చక్రస్నానంలో.. తిరుచానూరు: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. పంచమీతీర్థం మండపంలో అమ్మవారు, చక్రతాళ్వార్లకు నిర్వహించిన స్నపన తిరుమంజనంను తిలకించారు. అనంతరం పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారికి శ్రీవారి సారె సాక్షి, తిరుమల/తిరుచానూరు: తన పట్టపురాణి అయిన పద్మావతి అమ్మవారికి వేంకటేశ్వర స్వామివారు సారె పంపారు. గురువారం తిరుమలలో ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పుష్పాలు, తులసిమాల, నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలతో కూడిన సారెను టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, డెప్యూటీఈవో చిన్నంగారి రమణ మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిం చారు. కార్యక్రమంలో జీయరు స్వాము లు, అర్చకులు, డాలర్ శేషాద్రి పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్న సారెను టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్‌కు అందజేశారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు నడు మ ఏనుగు అంబారిపై సారెను ఊరేగింపుగా కోమలమ్మ సత్రం, కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరుచానూరు పసుపు మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయం మీదుగా పంచమీతీర్థ మండపానికి తీసుకొచ్చి ఆలయ అర్చకులకు అప్పగించారు. వేడుకగా స్నపన తిరుమంజనం పద్మావతి అమ్మవారి చక్రస్నానం పురస్కరించుకుని గురువారం పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపంలో అమ్మవారికి, చక్రతాళ్వార్లకు ఆలయ అర్చకులు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల నుంచి అమ్మవారికి శ్రీవారి సారె వచ్చిన తరువాత 10.30 గంటలకు పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పచ్చల హారాన్ని అలంకరించారు. జియ్యర్ స్వాముల సమక్షంలో పాంచరాత్ర ఆగమ పండితులు మణికంఠభట్టర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్లకు చక్రస్నానం వేడుకగా నిర్వహించారు. -
సూర్య చంద్రప్రభలపై అలమేలు మంగమ్మ
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లోభాగంగా మంగళవారం ఉదయం పద్మావతీ అమ్మవారు పాండురంగడు అలంకరణలో సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. రాత్రి చిన్నికృష్ణుడి అవతారంలో చంద్రప్రభపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి నామస్మరణలు.. కళాబృందాల భజనల మధ్య వాహన సేవలు వైభవంగా సాగాయి. పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవరోజైన మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై పాండురంగడి అలంకరణలో చల్లనితల్లి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 7 గంటలకు అమ్మవారిని ఆలయం నుంచి వాహనమండపానికి వేంచేపుగా తీసుకొచ్చి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్యాభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఉదయం 8 గంటలకు భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 8 గంటలకు అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వాహన సేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్నం, పంచాయతీ ఈవో ఎం.జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి గొడుగుల సమర్పణ తిరుచానూరు : పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనసేవల్లో వినియోగించే గొడుగులను మంగళవారం ఆలయ అధికారులకు అందజేశారు. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్.గోపాల్జీ నేతృత్వంలో 7 గొడుగులను వాహనమండపం వద్ద ఆలయ సూపరింటెండెంట్ శేషాద్రిగిరి, వాహన ఇన్స్పెక్టర్ నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్జీ మాట్లాడుతూ మూడేళ్లుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులను అందజేస్తున్నామన్నారు. అనంతరం వీరికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. -
స్వర్ణరథంపై సర్వతేజోమయి
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. భక్తుల కోలాటాలు, భజనబృందాల కళా ప్రదర్శనల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువలా సాగింది. ఉదయం పద్మావతిదేవి సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుచానూరు : కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం రాత్రి శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు గరుత్మంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకరణలో తిరువీధుల్లో భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం 12గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారికి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 4.10గంటలకు స్వర్ణరథంపై సర్వతేజోమయి అయిన అమ్మవారు కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7గంటలకు ఆస్థానమండపంలో అమ్మవారికి ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహనమండపానికిు తీసుకొచ్చి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య మణిమాణిక్యాలు, శ్రీవారి పాదాలు, శ్రీవారి సహస్రలక్ష్మీ కాసుల హారంతో అమ్మవారిని దివ్యాలంకారశోభితంగా అలంకరించారు. రాత్రి 8.30గంటలకు భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజన బృందాలు, జీయర్ స్వాముల దివ్యప్రభంద పారాయణం, వేదగోష్టి నడుమ శ్రీవారి పాదాలతో అమ్మవారు గరుత్మంతునిపై ఆశీనులై తిరువీధులలో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గరుడసేవలో అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. -
చిన్నశేషునిపై లోకమాత
తిరుచానూరు: పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజైన బుధవారం రాత్రి యోగముద్రలోని బద్రీనారాయణుడి అలంకరణలో అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే నిద్రమేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 9.16 నుంచి 9.30 గంటల్లోపు ధనుర్లగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు గజచిత్రపటాన్ని ధ్వజారోహణం చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఆస్థానమండపంలో అమ్మవారికి కన్నులపండువగా ఊంజల్‌సేవ జరిగింది. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి చిన్నశేషునిపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య ఆభరణాలతో అమ్మవారిని యోగముద్రలో ఉన్న బద్రీనారాయణుడిగా అలంకరించారు. రాత్రి 8 గంటలకు గజ, తురగ, వృషభాలు వెంటరాగా, మంగళ వాయిద్యాలు, భజన బృందాలు, భక్తుల కోలాటాలు, జియ్యర్ స్వాముల ప్రబంధనం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. -
నేడు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు రోజు ఆనవారుుతీ ప్రకారం ఆలయంలో నిర్వహించే లక్ష కుంకుమార్చన సేవలు వేదపండితులు, అర్చకులు, శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి నామాన్ని లక్ష మార్లు స్తుతిస్తూ అర్చన చేశారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన తిరుచానూరు: శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులోని ఆలయంలో లోకకల్యాణార్థం మంగళవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవను ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రతి ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందు రోజు ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని మంగళవారం వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామ, నిత్యార్చనలతో నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అమ్మవారిని వేంచేపుగా శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి తీసుకొచ్చి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారి సహస్రనామాలను ఆలయ అర్చకులు, వేదపండితులు లక్షమార్లు స్తుతిస్తూ మధ్యాహ్నం 12.30 గంటల వరకు కుంకుమతో అర్చన చేశారు. తరువాత భక్తులకు ప్రసాదంగా కుంకుమను అందజేశారు. సాయంత్రం ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, వాహన ఇన్స్పెక్టర్ నాగరాజు, వీజీవో రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
పద్మావతి అమ్మవారి లక్ష కుంకుమార్చన సేవతో ఉత్సవాలు ప్రారంభం తిరుచానూరు: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా మంగళవారం సాయంత్రం ఆలయంలో ఘనంగా అంకురార్పణ నిర్వహించారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు సవ్యంగా జరగాలని ప్రార్థిస్తూ పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు లక్ష కుంకుమార్చన సేవ జరిపారు. సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారి సన్నిధి ముఖమండపంలో సర్వసేనాధిపతి విష్వక్సేనుని కొలువుదీర్చారు. పాంచరాత్ర ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, రక్షాబంధనం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామిని ఆలయం నుంచి వేంచేపుగా ఉద్యానవనంలోకి తీసుకొచ్చి, స్వామి సమక్షంలో పుట్టమన్ను సేకరించారు. తరువాత విష్వక్సేనుల వారిని, పుట్టమన్నును తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయంలోని యాగశాలకు తీసుకొచ్చారు. పుట్టమన్నును నవపాలికలలో నింపి అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ. గోపాల్, జేఈవో భాస్కర్, ఆలయ డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.