తిరువీధుల్లో ఊరేగుతున్న విష్వక్సేనుడు
పద్మావతి అమ్మవారి లక్ష కుంకుమార్చన సేవతో ఉత్సవాలు ప్రారంభం
తిరుచానూరు: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా మంగళవారం సాయంత్రం ఆలయంలో ఘనంగా అంకురార్పణ నిర్వహించారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు సవ్యంగా జరగాలని ప్రార్థిస్తూ పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు లక్ష కుంకుమార్చన సేవ జరిపారు. సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారి సన్నిధి ముఖమండపంలో సర్వసేనాధిపతి విష్వక్సేనుని కొలువుదీర్చారు.
పాంచరాత్ర ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, రక్షాబంధనం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామిని ఆలయం నుంచి వేంచేపుగా ఉద్యానవనంలోకి తీసుకొచ్చి, స్వామి సమక్షంలో పుట్టమన్ను సేకరించారు. తరువాత విష్వక్సేనుల వారిని, పుట్టమన్నును తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయంలోని యాగశాలకు తీసుకొచ్చారు. పుట్టమన్నును నవపాలికలలో నింపి అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ. గోపాల్, జేఈవో భాస్కర్, ఆలయ డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.