
లడ్డూ కౌంటర్‌ను ప్రారంభిస్తున్న డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభమైంది. ఆలయ డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంలోని లడ్డూ కౌంటర్‌ను వెలుపలికి తరలించాలని టీటీడీ ఈవో, జేఈవోలు ఆదేశించినట్లు తెలిపారు. దీంతో ఓ భక్తుడు అందించిన రూ.80లక్షల విరాళంతో వాహనమండపం వెనుక నూతన భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ భవనంలో కింది భాగం లడ్డూ కౌంటర్లు, మొదటి అంతస్తులో పరకామణి గదిని ఏర్పాటుచేశామన్నారు. ఇకపై భక్తులకు బార్‌కోడింగ్‌తో కూడిన లడ్డూ టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ రవి, ఏఈ శివయ్య పాల్గొన్నారు.