వైభవంగా పంచమి తీర్థం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం పద్మసరోవరం(పుష్కరిణి)లో అత్యంత వైభవంగా పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్రస్నానం చేసి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి పుట్టిన రోజున నిర్వహించే ముఖ్యమైన ఘట్టం చక్రస్నానం.
ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9.30గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. వేదపండితులు అమ్మవారికి, చక్రతాళ్వారుకు కన్నులపండువగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం 11.50గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానమాచరించారు.
అమ్మవారికి శ్రీవారిసారె
పంచమీతీర్థం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారికి తిరుమల ఆలయం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి వారి సారె పంపారు. టీటీడీ ఈవో గిరిధ ర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆలయం నుంచి తీసుకొచ్చి తిరుమలలో ఊరేగింపు నిర్వహించారు. తిరుమల నుంచి పరిచారకులు నెత్తినపెట్టుకుని నడకదారిలో తిరుపతి అలిపిరి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబారీలపై ఊరేగింపుగా తిరుచానూరు తీసుకొచ్చి తిరుపతి జేఈవో భాస్కర్‌కు అందజేశారు. ఆయన సారెను పంచమీతీర్థం మండపానికి తీసుకురాగా వేదపండితులు అమ్మవారికి అలంకరించారు. అదేవిధంగా శ్రీపద్మావతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారు తరపున తిరుమల దేవేరికి పచ్చరాయి పొదిగిన విలువైన హారాన్ని కానుకగా అందజేశారు.
ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఈనెల 19న ధ్వజారోహణంతో ప్రారంభమైన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను గురువారం రాత్రి ఆలయంలో వేదపండితులు ధ్వజావరోహణం నిర్వహించి ముగించారు.
నేడు పుష్పయాగం
బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అమ్మవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. తెలిసోతెలియకో జరిగిన పొరపాట్లకు దోషనివారణగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం దాతలు సమకూర్చిన దాదాపు ఆరు టన్నుల 12రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పయాగం నిర్వహిస్తారు.