సూర్య చంద్రప్రభలపై అలమేలు మంగమ్మ
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లోభాగంగా మంగళవారం ఉదయం పద్మావతీ అమ్మవారు పాండురంగడు అలంకరణలో సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. రాత్రి చిన్నికృష్ణుడి అవతారంలో చంద్రప్రభపై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి నామస్మరణలు.. కళాబృందాల భజనల మధ్య వాహన సేవలు వైభవంగా సాగాయి.
పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవరోజైన మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై పాండురంగడి అలంకరణలో చల్లనితల్లి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 7 గంటలకు అమ్మవారిని ఆలయం నుంచి వాహనమండపానికి వేంచేపుగా తీసుకొచ్చి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు.
పట్టుపీతాంబర వజ్రవైఢూర్యాభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఉదయం 8 గంటలకు భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 8 గంటలకు అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వాహన సేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్నం, పంచాయతీ ఈవో ఎం.జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారికి గొడుగుల సమర్పణ
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనసేవల్లో వినియోగించే గొడుగులను మంగళవారం ఆలయ అధికారులకు అందజేశారు. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్.గోపాల్‌జీ నేతృత్వంలో 7 గొడుగులను వాహనమండపం వద్ద ఆలయ సూపరింటెండెంట్ శేషాద్రిగిరి, వాహన ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్‌జీ మాట్లాడుతూ మూడేళ్లుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులను అందజేస్తున్నామన్నారు. అనంతరం వీరికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు.