pagididdharaju
-
మేడారం: గద్దెలపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు
సాక్షి, ములుగు : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన వనదేవతలు సమ్మక్క – సారలమ్మ జాతర అసలు ఘట్టం మొదలైంది. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు బుధవారం రాత్రి గద్దెలపై ఆశీనులయ్యారు. గిరిజన పూజారులు, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు, గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును పెనుక వంశస్తులు తీసుకొచ్చారు. వీరి రాకతో జాతర లాంఛనంగా ప్రారంభమైంది. గురువారం (ఫిబ్రవరి 6) సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. రేపు ఉదయం పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. బుధవారం నుంచి శనివారం వరకు (నాలుగు రోజులు) తేదీ వరకు సమ్మక్క– సారలమ్మ మహా జాతర కొనసాగుతుంది. ఇక మేడారం మహా జాతర నేపథ్యంలో జనం పోటెత్తారు. ఎటు చూసినా ‘సమ్మక్క సారలమ్మ’సందడి నెలకొంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర కోసం తెలంగాణ వ్యాప్తంగా ఈ సారి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కంటే ఈ సారి సమాచార, రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగవడంతో ఎక్కువ మంది వన దేవతల దర్శనం కోసం మేడారానికి పోటెత్తుతున్నారు. మేడారంలో ప్రముఖుల పూజలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రముఖుల తాకిడి పెరిగింది. బుధవారం మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, వైరా ఎమ్మెల్యే రాములు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ కుమార్తెలు సుస్మిత, సుమిత్ర వరాల తల్లులను దర్శించుకున్నారు. నిల్చునే తలనీలాల సమర్పణ మేడారం జాతరలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఇక తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట సైతం కిక్కిరిసిపోయింది. దీంతో జంపన్న వాగు వెంట ఎక్కడపడితే అక్కడే తలనీలాలు సమర్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కూర్చునే స్థలం కూడా లేకపోవడంతో భక్తులను నిల్చోబెట్టే నాయీ బ్రాహ్మణులు తలనీలాలు తీయడం కనిపించింది. ట్రిప్‌కు రూ.3వేలు ఏటూరునాగారం: మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈసారి విహంగ వీక్షణం చేసేందుకు వీలు కల్పించారు. హెలికాప్టర్లో మేడారం జాతర పరిసరాల్లో ఒక ట్రిప్ వేయాలనుకునే వారు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న పలువురు భక్తులు మంగళవారం హెలికాప్టర్లో జాతరను విహంగ వీక్షణం చేసి సంబురపడ్డారు. ఇక దూర భారం, ఇతర కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులు స్థానికంగా మినీ మేడారం జాతర్లలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, వృత్తి రీత్యా వలస వెళ్లిన అనేక మంది తమ సొంత ఊళ్లకు జాతర కోసం రాకపోకలు అధికమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ డిపో నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. -
మేడారం: నేడు గద్దెపైకి పగిడిద్దరాజు
సాక్షి, మేడారం(మహబూబాబాద్): సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మేడారంలోని గద్దెలపై సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజరులు ప్రతిష్టించనున్నారు. ఈ క్రమంలో గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకుని పెనుక వంశస్తులు కాలినడకన ప్రయణమయ్యారు. అటవీ మార్గం గుండా దాదాపు 66 కి.మీ నడుచుకుంటూ మేడారం గద్దెల వద్దకు చేరుకుని పగిడిద్దను రాజును ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా పోనుగొండ్ల గ్రామ ప్రజలంతా నేడు తమ ఇళ్లను మట్టితో పూతపూసి, రంగురంగు ముగ్గులతో అలంకరించుకుంటారు. పెనుక వంశస్థులు ఇంటి నుంచి స్వామి వారిని కుంకుమ భరణి రూపంలో ఆలయానికి తీసుకొస్తారు. పడగ రూపంలో అలంకరించిన స్థానిక స్వామివారి ప్రతిమతో అటవీ మార్గం గుండా కాలినడకన గిరిజనులు మేడారం బయలుదేరారు. కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం రాత్రికి సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లను గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు సమ్మక్క, సారక్క గద్దెలను ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పువ్వులతో అలంకరిస్తారు. ఇందుకోసం దాత వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా బెంగుళూరు నుంచి పువ్వులను తెప్పించారు. కాగా సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి హెలికాప్టర్లో అక్కడి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఛత్తిష్‌ఘడ్ హోంమంత్రి కుటుంబంతో ఆలయాన్ని వచ్చారు. -
నేడు సమ్మక్క కల్యాణం
సాక్షి ప్రతినిధి, వరంగల్: లక్షలాది మంది భక్తుల సాక్షిగా వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం వైభవంగా జరగనుంది. మాఘమాసంలో మేడారం గ్రామం ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదీవాసీ సంప్రదాయం. ఇందుకోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వారికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంట లేని వారు కోళ్లు, మేకల వంటివాటిని సమర్పించుకునేవారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. సమ్మక్క ఆలయమే వేదిక.. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. ఈ సారి బుధవారం, పౌర్ణమి ఒకేరోజున(జనవరి 31) రావడం విశేషం. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి బయల్దేరారు. ప్రధాన పూజారి పెనక బుచ్చిరాములుతోపాటు ఇతర పూజారులు సురేందర్, మురళీధర్ పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకుని 65 కిలోమీటర్లు కాలినడకన మేడారానికి తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో తాడ్వాయి మండలం లక్ష్మీపురంలో పెనక వంశీయుల ఇంట్లో మంగళవారం రాత్రి బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం కాలినడకన మేడారం బయల్దేరుతారు. ఇక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారి కాక సారయ్య, కాక కిరణ్ ఇతర పూజారులు తీసుకొస్తారు. సమ్మక్కకు కల్యాణం.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న విడిది గృçహానికి వస్తారు. సమ్మక్క నుంచి ఆహ్వానం రాగానే వీరు మేడారంలోని ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెళ్లికొడుకు పగిడిద్దరాజు వచ్చాడంటూ సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. ఈ కబురు అందుకున్న సమ్మక్క పూజారులు పసుపు, కుంకుమలతో ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును సమ్మక్క గుడిలోనికి ఆహ్వానిస్తారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు నైవేద్యం సమర్పించి ఆకలి తీరుస్తారు. అనంతరం సమ్మ క్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలిసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతాడు. (ఎడ్లబండ్లపై మేడారానికి తరలివస్తున్న భక్తులు) లక్షలాది మంది రాక సమ్మక్క–పగిడిద్దరాజు వివాహం అనంతరం గద్దెలపై కొలువైన సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. అమ్మలను దర్శించుకుని కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనేది వారి నమ్మకం. మరుసటిరోజు(గురువారం) శక్తి రూపంలో చిలకలగుట్టపై కొలువైన సమ్మక్క తల్లి.. మేడారం గద్దెల మీదకు చేరుకుంటుంది. దీంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. సారలమ్మ ఆగమనం నేడే.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యా ణం జరిగిన తర్వాత సారలమ్మతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. -
పగిడిద్దరాజు పెళ్లికొడుకాయెనె..
సమ్మక్కను మనువాడేందుకు పయనం.. సంప్రదాయబద్ధంగా గుడిలో గిరిజనుల పూజలు పడిగెతో కాలినడకన మేడారానికి.. పూనుగొండ్ల(కొత్తగూడ), న్యూస్‌లైన్ : పగిడిద్దరాజు పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యాడు. గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్కను పరిణయమాడేందుకు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి మంగళవారం బయలుదేరాడు. సంప్రదాయ డోలి వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కుల మధ్య పగిడిద్దరాజును కాలినడకన పూజారులు తీసుకెళ్లారు. తొలుత తలపతి పెక్క చిన్నబక్కయ్య ఇంట్లో పెళ్లి కుమారుడిగా పగిడిద్దరాజును ముస్తాబు చేసేందుకు పానుపు(నూతన వస్త్రాలు, నవధాన్యాలు, పసుపు, కుంకుమ)ను భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసి గుడికి తరలించారు. గుడిలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేసి పడిగెను సిద్ధం చేశారు. కుండలో భద్రపరిచిన మువ్వలను ధరించిన పూజారులు ముందు నడుస్తుండగా వాటి సవ్వడికి శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పగిడిద్దరాజు పడిగెను తీసుకెళ్తున్న పూజారుల కాళ్లు కడిగి పడిగెను తాకేందుకు మహిళలు పోటీపడ్డారు. అందరూ భక్తిపారవశ్యంతో పగిడిద్దరాజును మేడారం తరలించారు. లక్ష్మీపురంలో బస.. పగిడిద్దరాజు మంగళవారం రాత్రి కర్లపెల్లి మీదుగా లక్ష్మీపురం చేరుకుంటాడు. పెనక వంశీయుల ఇంట్లో బస చేసి అక్కడి ప్రజలకు దర్శనమిస్తాడు. బుధవారం తెల్లవారుజామున బయలుదేరి సాయంత్రం వరకు మేడారం చేరుకుంటాడు. దీంతో సమ్మక్క వద్దకు పగిడిద్దరాజు, గోవిందరాజులు వచ్చి కలుస్తారు. ముగ్గురు పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పోలీసు బందోబస్తు నడుమ దేవతలు వారివారి గద్దెలపైకి చేరి భక్తులకు దర్శనమిస్తారు.