కోడలి తల నరికిన మామ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు ధర్మపురి జిల్లా పాలక్కోడు సమీపంలో కోడలి తలనరికి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మామ ఉదంతం శుక్రవారం చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా పాలక్కోడు సమీపం కుత్తలఅల్లి గ్రామానికి చెందిన రమేష్, ఆనంది (30) దంపతులు. వీరికి శ్వేత (4) కుమార్తె ఉంది. రమేష్ మూడేళ్ల క్రితం శరణ్య అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్యాభర్తలు గొడవపడేవారు.
గురువారం రాత్రి గొడవపడగా అత్తామామలు సుబ్రమణి, ఏకమ్మాళ్ ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె అత్తామామల మాటలు వినిపించుకోలేదు. భర్తతో భరించలేనంటూ శుక్రవారం ఉదయం ఆనంది తన కుమార్తె శ్వేతతో సహా పుట్టింటికి బయలుదేరింది. ఇంతలో అత్తామామలు వారించారు. ఆమె బస్‌స్టేష న్కు చేరుకుంది. ఇంతలో మామ సుబ్రమణి తనవద్దనున్న కొడవలితో బస్టాండ్‌కు చేరుకున్నాడు. కోడలి తల నరికివేశాడు. మొండెంతో వేరుపడిన తలను తీసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.