Palamaneru municipality
-
పలమనేరులో నువ్వా- నేనా..?
సాక్షి, పలమనేరు: తాతపోతే బొంతనాదన్నట్టు తయారైంది పలమనేరు మున్సిపాలిటీలో పరిస్థితి. మరో మూడునెలల్లో ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి పదవీ విరమణ చెందనున్నారు. దీంతో ఆ పోస్టుపై ఇదే కార్యాలయానికి చెందిన కొందరి కన్ను పడింది. దీంతో పక్కాగా ఓ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వారి ప్రయత్నాల్లో వారు తలమునకలైనట్లు సృష్టమవుతోంది. నిబంధనలు ఇలా.. సాధారణంగా కమిషనర్ బదిలీ గానీ రిటైర్డ్ గానీ అయితే ఆ పోస్టుకు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే వీలుగాని పక్షంలో అదే కార్యాలయంలోని గెజిటెడ్ హోదా కలిగిన ఇంజినీరింగ్ డీఈ, లేదా మేనేజర్‌ను ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీగా రెగ్యులర్ కమిషనర్ వచ్చే దాకా నియమించుకోవచ్చు. అయితే ఇన్చార్జ్ ఇస్తే పవర్ ఉండదు. అందుకే ఎవరు ఈ పోస్టుకొచ్చినా ఎఫ్ఏసీనే కోరుకుంటారు. ఈ తంతు స్థానిక రాజకీయ నేతలు, అధికారుల పలుకుబడిని బట్టి జరిగే అవకాశాలుంటాయి. ఇక్కడ సాగుతున్న తంతు మరోలా.. ఇదే కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగం ఏఈగా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాకు ముందు డీఈగా పదోన్నతి బదిలీపై వచ్చారు. ప్రాముఖ్యతను బట్టి కమిషనర్ లేనపుడు డీఈకి ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీ కమిషనర్ చాన్స్ ఉంటుంది. ఇదే ఆశతో సదరు అధికారి ఇప్పటికే స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకుని బెర్తు తనకేనని సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీ కమిషనర్ అవకాశం మేనేజర్‌కు దక్కే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించిన ఇక్కడి మేనేజర్ తన సత్తా ఏంటో చూపింది. గత ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ తాజాగా గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2 మేనేజర్‌గా ప్రమోషన్ పొందారు. అయితే ప్రమోషన్‌తో పాటు ట్రాన్స్ఫర్ వస్తుందని అందరూ భావించారు. కానీ చక్రం తిప్పిన ఆ మేనేజర్ ప్రమోషన్ పొంది ఇక్కడికే రిటైన్ చేయించుకున్నారు. ఈ తతంగం వెనుక బడాహస్తమే ఉన్నట్టు స్థానిక కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాంగ్ స్టాండిగ్‌లో ఉన్న మేనేజర్ మళ్లీ ఇక్కడికే బదిలీ చేయించుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీన్నంతా గమనిస్తున్న రాయదుర్గం మున్సిపల్ మేనేజర్ తన పలుకుబడిని ఉపయోగించి పలమనేరు మేనేజర్‌గా బదిలీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఆయన పెద్దనేతల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. చదవండి: మార్పు వైపు మరో అడుగు రెగ్యులర్ కమిషనర్ వస్తే అన్నిటికీ చెక్.. మున్సిపాలిటీలో సాగుతున్న ఎత్తులు, పైఎత్తులను స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఇప్పటికే పసిగట్టినట్టు తెలిసింది. గత కొన్నాళ్లుగా మున్సిపాలిటీలో గాడితíప్పిన పాలనపై తన షాడోల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఆయన కొందరు అధికారులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పలమనేరు పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 55,373 జనాభా ఉన్నారు. ఇప్పుడది 60 వేలకు మించింది. గత ఐదేళ్లుగా పురపాలకసంఘంలో సాగిన వ్యయ, ఆదాయాల మేరకు ప్రస్తుతం గ్రేడ్–3లో ఉన్న మున్సిపాలిటీని గ్రేడ్–2గా మార్చే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే రెగ్యులర్ కమిషనర్‌ను నియమించేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్ -
ఇదేం.. సం‘దేశం’
►సంప్రదాయాన్ని గౌరవించిన వైఎస్సార్సీపీ ►టీడీపీకి చెందిన వార్డు ఉప ఎన్నికలకు దూరం ►ఫలితంగా రెండు చోట్ల ఏకగ్రీవం ►కానీ వైఎస్సార్సీపీ వార్డుల్లో టీడీపీ పోటీ ►సంప్రదాయాన్ని కాదన్న అధికార పార్టీ ►ఏప్రిల్ 9న ఎన్నికలు అనివార్యం సంస్కృతి సంప్రదాయాలకు తెలుగుదేశం పార్టీ కొత్త నిర్వచనం చెప్పింది. సభ్యుడు చనిపోయిన చోట ఉప ఎన్నికలో ఏపార్టీ అయినా ఆ కుటుంబానికే తిరిగి అవకాశమివ్వాలనేది రాజకీయ సంప్రదాయం. అదే విధానాన్ని గౌరవించి జిల్లాలోని రెండు వార్డు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వైఎస్సార్సీపీ బరిలో నిలవలేదు. కానీ ఇందుకు భిన్నంగా టీడీపీ వ్యవహరించింది. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు చనిపోయిన వార్డులో తమ అభ్యర్థులను పోటీకి నిలిపి రాజకీయమే ముక్కున వేలేసుకునేలా చేసింది. చిత్తూరు (అర్బన్): జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, పలమనేరు మునిసిపాలిటీల్లో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరులోని 33వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొంది న కటారి అనురాధ నగర తొలి మహిళా మేయర్‌గా ఎన్నికయ్యారు. 2015 నవంబరులో ఈమె హత్యకు గురవడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అలాగే 38వ డివిజన్లో శివప్రసాద్‌రెడ్డి 2015 డిసెంబరులో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ స్థానానికి సైతం ఉప ఎన్నికలు వచ్చాయి. 33వ డివిజన్లో అనురాధ కోడలు కటారి హేమలత టీడీపీ నుంచి బరిలోకి దిగడంతో సంప్రదాయాలను గౌరవిస్తూ వైఎస్సార్సీపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. 38వ వార్డులో శివప్రసాద్‌రెడ్డి సోదరి జ్యోతి వైఎస్సార్సీపీ తరపున నామినేషన్ వేశారు. అయినా టీడీపీ నాయకులు సానుభూతి చూపకుండా వసంతకుమార్ నాయుడు అనే వ్యక్తిని పార్టీ తరపున బరిలోకి దింపి బీ–ఫామ్ కూడా అందచేసింది. నగరిలో 26వ వార్డులో టీడీపీ తరపున గెలిచిన సెల్వం గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఇక్కడ ఆయన సతీమణి జీవ నామినేషన్ వేయడంతో వైఎస్సార్సీపీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఎవరినీ పోటీకి ఉంచలేదు. పలమనేరులో 23వ వార్డులో హరికృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ తరపున కౌన్సిలర్‌గా గెలిచి గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మహ్మద్ నియాజ్‌ను వ్యక్తిని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఈ వార్డులో టీడీపీ మదన్మోహన్ను పోటీకి పెట్టింది. మరోపార్టీకి చెందిన సభ్యులు చనిపోయిన చోట ఎన్నికల్లో పోటీ పెట్టరాదనే విధానానికి వైఎస్సార్సీపీ రెండుచోట్ల నామినేషన్లు వేయలేదు. ఫలితంగా చిత్తూరు 33వ డివిజన్లో కటారి హేమలత (మేయర్ అభ్యర్థి), పలనమేరులో ఆర్ఎస్.జీవ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. చిత్తూరులోని 38వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి జ్యోతిపై, పలమనేరులోని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహ్మద్నియాజ్లపై టీడీపీ నుంచి అభ్యర్థుల్ని పోటీలోకి దింపారు. దీంతో ఈ రెండు వార్డులకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. -
కొంపముంచిన అప్పులు!
విషం తాగిన దంపతులు భార్య మృతి,భర్త పరిస్థితి విషమం గంటావూరులో విషాదఛాయలు పలమనేరు: పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో బుధవారం ఉదయం ఓ కుటుంబాన్ని అప్పులు మింగేశాయి. అప్పులు తాళలేక దంపతులు విషం తాగారు. భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. గంటావూరుకు చెందిన క్రిష్ణమూ ర్తి జాతీయ రహదారికి ఆనుకుని హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యాపారం నిమిత్తం ఆయన పలువురి వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చడం కష్టతరంగా మారింది. కొన్నాళ్లుగా ఆయన కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా లాభం లేకపోయింది. కన్న కొడుకు పరిస్థితి ఇలా అయిపోయిందని మానసికంగా కుంగిపోయిన తల్లి ఇటీవల చనిపోయింది. అతని కోసం రెండ్రోజులు ఎదురుచూసి తల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. అతని ప్రాణస్నేహితుడు అనారోగ్యంతో వారం క్రితం మృతిచెందాడు. తల్లి, ప్రాణస్నేహితుడు మృతిచెందిన విష యం కర్ణాటకలోని హసన్ ప్రాంతంలో ఉంటున్న క్రిష్ణమూర్తికి తెలిసింది. వారం క్రితం స్వగ్రామానికి చేరుకున్నా డు. మనిషి తిరిగి వచ్చినందుకు కుటుం బ సభ్యులు ఆనందించారు. అయితే అప్పులెలా తీర్చాలనే ఆలోచన అతన్ని వేధించసాగింది. మంగళవారం అర్ధరాత్రి క్రిష్ణమూర్తి, అతని భార్య కోమల విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసు లు వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా కోమల మృతిచెందింది. క్రిష్ణమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి పిల్లలు లేరు. ఉన్న ఇల్లు తప్పా ఆస్తిపాస్తులేమీ లేవని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.