ఇదేం.. సం‘దేశం’
►సంప్రదాయాన్ని గౌరవించిన వైఎస్సార్‌సీపీ
►టీడీపీకి చెందిన వార్డు ఉప ఎన్నికలకు దూరం
►ఫలితంగా రెండు చోట్ల ఏకగ్రీవం
►కానీ వైఎస్సార్‌సీపీ వార్డుల్లో టీడీపీ పోటీ
►సంప్రదాయాన్ని కాదన్న అధికార పార్టీ
►ఏప్రిల్ 9న ఎన్నికలు అనివార్యం
సంస్కృతి సంప్రదాయాలకు తెలుగుదేశం పార్టీ కొత్త నిర్వచనం చెప్పింది. సభ్యుడు చనిపోయిన చోట ఉప ఎన్నికలో ఏపార్టీ అయినా ఆ కుటుంబానికే తిరిగి అవకాశమివ్వాలనేది రాజకీయ సంప్రదాయం. అదే విధానాన్ని గౌరవించి జిల్లాలోని రెండు వార్డు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వైఎస్సార్‌సీపీ బరిలో నిలవలేదు. కానీ ఇందుకు భిన్నంగా టీడీపీ వ్యవహరించింది. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు చనిపోయిన వార్డులో తమ అభ్యర్థులను పోటీకి నిలిపి రాజకీయమే ముక్కున వేలేసుకునేలా చేసింది.
చిత్తూరు (అర్బన్): జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, పలమనేరు మునిసిపాలిటీల్లో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరులోని 33వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొంది న కటారి అనురాధ నగర తొలి మహిళా మేయర్‌గా ఎన్నికయ్యారు. 2015 నవంబరులో ఈమె హత్యకు గురవడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అలాగే 38వ డివిజన్‌లో శివప్రసాద్‌రెడ్డి 2015 డిసెంబరులో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ స్థానానికి సైతం ఉప ఎన్నికలు వచ్చాయి. 33వ డివిజన్‌లో అనురాధ కోడలు కటారి హేమలత టీడీపీ నుంచి బరిలోకి దిగడంతో సంప్రదాయాలను గౌరవిస్తూ వైఎస్సార్‌సీపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు.
38వ వార్డులో శివప్రసాద్‌రెడ్డి సోదరి జ్యోతి వైఎస్సార్‌సీపీ తరపున నామినేషన్ వేశారు. అయినా టీడీపీ నాయకులు సానుభూతి చూపకుండా వసంతకుమార్ నాయుడు అనే వ్యక్తిని పార్టీ తరపున బరిలోకి దింపి బీ–ఫామ్ కూడా అందచేసింది. నగరిలో 26వ వార్డులో టీడీపీ తరపున గెలిచిన సెల్వం గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఇక్కడ ఆయన సతీమణి జీవ నామినేషన్ వేయడంతో వైఎస్సార్‌సీపీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఎవరినీ పోటీకి ఉంచలేదు. పలమనేరులో 23వ వార్డులో హరికృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ తరపున కౌన్సిలర్‌గా గెలిచి గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మహ్మద్ నియాజ్‌ను వ్యక్తిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఈ వార్డులో టీడీపీ మదన్‌మోహన్‌ను పోటీకి పెట్టింది.
మరోపార్టీకి చెందిన సభ్యులు చనిపోయిన చోట ఎన్నికల్లో పోటీ పెట్టరాదనే విధానానికి వైఎస్సార్‌సీపీ రెండుచోట్ల నామినేషన్లు వేయలేదు. ఫలితంగా చిత్తూరు 33వ డివిజన్‌లో కటారి హేమలత (మేయర్ అభ్యర్థి), పలనమేరులో ఆర్‌ఎస్.జీవ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. చిత్తూరులోని 38వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జ్యోతిపై, పలమనేరులోని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహ్మద్‌నియాజ్‌లపై టీడీపీ నుంచి అభ్యర్థుల్ని పోటీలోకి దింపారు. దీంతో ఈ రెండు వార్డులకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి.