Palem bus accident case
-
‘పాలెం’ డ్రైవర్ ఐదేళ్లకు పట్టుబడ్డాడు...
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మొదటి నిందితుడైన బస్సుడ్రైవర్ ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. 45 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న ఆ ప్రమాదం... ప్రైవేట్ బస్సు ప్రయాణమంటేనే దేశవ్యాప్తంగా వణు కు పుట్టించింది. పాలెం సమీపంలో 2013 అక్టోబర్ 30న ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ కేసులో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్ ఫిరోజ్ పాషా మొదటి ముద్దాయి. ఘటన జరిగిన నాటి నుంచి డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రాష్ట్ర సీఐడీ పోలీసులు ఏడాదిపాటు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదులుకున్నారు. అతడి బంధువులను విచారించగా దేశం వదిలి పారిపోయి ఉంటాడని, ఆ కుటుంబంలో ఎవరూ కనిపించడంలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు బృందం మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో 2014లో చార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో డ్రైవర్ వాంగ్మూలం కీలకమైంది. దీనితో మరోసారి ప్రయత్నిద్దామని 15 రోజుల క్రితం సీఐడీ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బెంగుళూర్, హుబ్లీ, మంగుళూర్ లో సీఐడీ బృందం వేట ప్రారంభించింది. ఇదే సమ యంలో పాషా పేరు మీద రేషన్‌కార్డు వివరాలున్నా యా.. అని ఆ రాష్ట్రంలో ఆరా తీయగా అతడు బతికే ఉన్నాడని, అతడి పేరిట ప్రతినెలా సరుకులు తీసుకుంటున్నాడని ప్రభుత్వరికార్డుల్లో బయటపడింది. దీంతో ప్రతినెల మొదటివారంలో మంగుళూర్ జిల్లా రూరల్ మండలంలోని ఓ రేషన్ దుకాణం వద్ద సీఐడీ బృందం కాపు కాసింది. సరుకులు తీసుకునేందుకు వచ్చి ఎట్టకేలకు సీఐడీ బృందానికి చిక్కాడు. వేలిముద్రలు తనిఖీ రేషన్‌సరుకులు తీసుకుంటున్న వ్యక్తి ఫిరోజ్ పాషా నా.. కాదా అన్న వివరాలు పోల్చుకునేందుకు అదే రేషన్‌షాపు వద్ద వేలిముద్రలు సేకరించారు. పాలెం ఘటన సందర్భంగా సేకరించిన వేలిముద్రలతో రేషన్ తీసుకున్న ఫిరోజ్ పాషా వేలిముద్రలను పోల్చి చూశారు. వేలిముద్రలు ఒకరివే అని తేలడంతో వెం టనే అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. -
జెసి ప్రభాకర రెడ్డి భార్య అరెస్ట్
హైదరాబాద్: పాలెం బస్సు ప్రమాద దుర్ఘటన కేసుకు సంబంధించి మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర రెడ్డి భార్య ఉమా ప్రభాకర రెడ్డిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను కోర్టుకు తరలించినట్లు సిఐడి అదనపు డిజి కృష్ణప్రసాద్ చెప్పారు. ప్రభాకర రెడ్డి భార్య ఉమకు మహబూబ్ నగర్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆమె బెయిలుపై విడుదలయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ యజమానితోపాటు బస్సు డ్రైవర్, షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లా అనేవారిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సును జబ్బార్ ట్రావెల్స్ వారు నడుపుతున్నప్పటికీ, అది జెసి సోదరులకు చెందిన దివాకర్ రోడ్డు లైన్స్‌కు చెందినది కావడంతో ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం బస్సు యజమాని హోదాలో ఉన్న జేసీ ఉమారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి 36 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏ1 నిందితురాలిగా ఉమా ప్రభాకర్‌రెడ్డిని పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డు నిర్మాణంలోని లోపాలు, బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం, బస్సు డిజైన్‌లో లోపాలే దుర్ఘటనకు కారణం అని ఆయన వివరించారు. ఓల్వా బస్సు డ్రైవర్ సీటు కింద ముందు భాగంలో 9 అంగుళాల ఎత్తులో బ్యాటరీ అమర్చారని, కల్వర్ట్‌కు బ్యాటరీ ఢీ కొట్టడంతోనే మంటలు చెలరేగాయని తెలిపారు. బస్సు అడుగు భాగం డిజైన్‌లో ఎక్కువ శాతం ఉడ్, ప్లాస్టిక్ ఉండటం వల్ల ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పారు. బస్సు లోపల అదనంగా సీట్లు తయారు చేసి ప్రయాణికులను ఎక్కించారని చెప్పారు. ఘటన తర్వాత జబ్బార్ ట్రావెల్స్ - దివాకర్ రోడ్ లైన్స్ వారు నకిలీ లీజ్ అగ్రిమెంట్ సృష్టించారని డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు. -
జెసి ప్రభాకర రెడ్డి భార్య అరెస్ట్
-
ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం
అంతర్ రాష్ట్రాల మధ్య నడిచే ఏసీ బస్సుల్లో భద్రతా ప్రమాణాల పెంపు విమాన ల్లో మాదిరి ఏసీ బస్సుల్లోనూ భద్రతా చర్యల వీడియో ప్రదర్శన అందుబాటులో హ్యామర్లు, అగ్నిమాపక యంత్రం ఓల్వో బస్సుల్లో స్పీడ్ లాక్ సిస్టం.. గంటకు 100 కి.మీ. మాత్రమే సేఫ్టీ డ్రైవింగ్‌పై 135మంది ఓల్వో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ 12 లక్షల కి.మీ. తిరిగిన బస్సుల కండిషన్‌ను మెరుగుపరుస్తాం రంగారెడ్డి జిల్లా రీజియన్ ఆర్టీసీ సీఎంఈ వెంకన్న తాండూరు, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ పకడ్బందీ చర్యలు చేపట్టిందని రంగారెడ్డి జిల్లా రీజియన్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (సీఎంఈ) వెంకన్న పేర్కొన్నారు. గురువారం తాండూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్ రాష్ట్రాల మధ్య నడిచే ఏసీ బస్సు సర్వీసుల్లో ప్రమాదాలను నివారించేందుకు భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రీజియన్ పరిధిలోని హైదరాబాద్-1, 2, పికెట్‌తోపాటు వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల పరిధిలో మొత్తం 505 బస్సు సర్వీసులు ఉన్నాయన్నారు. గరుడ, గరుడ+తో కలుపుకొని 40 ఏసీ బస్సులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే రంగారెడ్డి రీజియన్‌లో ఏసీ బస్సులు అధికంగా ఉన్నాయని వెంకన్న తెలిపారు. పాలెం బస్సు ప్రమాద ఘటన అనంతరం ఏసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రతా ప్రమాణాల పెంపుపై ఆర్టీసీ దృష్టి సారించిందని చెప్పారు. ప్రతి ఏసీ బస్సులో అగ్నిమాపక యంత్రం, ప్రాథమిక చికిత్స బాక్స్ (కిట్స్)లను ఏర్పాటు చేశామన్నారు. ఏసీ బస్సుల్లో కిటికీల అద్దాలు పిక్స్డ్గా ఉంటాయని, అత్యవసర పరిస్థితుల్లో అద్దాలను పగులకొట్టేందుకు సీట్ల కింద నాలుగు హ్యామర్ (సుత్తి)లను ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. విమానాల్లో ఎయిర్ హోస్టెస్ మాదిరిగా ఏసీ బస్సులోనూ అత్యవసర కిటీకీలు, అగ్నిమాపక యంత్రం, హ్యామర్లు, ప్రాథమిక చిక్సిత కిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలియజేసే రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో సీడీ ద్వారా ప్రదర్శనను ప్రయాణికులకు చూపిస్తామని ఆయన వివరించారు. బస్సు బయలుదేరే ముందు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. తద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు అవగాహన ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గంటకు 120-130 కి.మీ. వెళ్లే ఓల్వో బస్సుల వేగాన్ని తగ్గించినట్లు వెంకన్న తెలిపారు. ఈ బస్సుల్లో గంటకు 100 కి.మీ.కు స్పీడ్‌ను లాక్ చేసినట్లు చెప్పారు. నిపుణుల బృందంతో డ్రైవర్లకు శిక్షణ.. భద్రతా చర్యల్లో భాగంగా రీజియన్ పరిధిలో 135మంది ఓల్వో బస్సుల డ్రైవర్లకు బెంగళూరు నుంచి నిపుణుల బృందం ద్వారా సేఫ్టీ డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు సీఎంఈ తెలిపారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లోని 12లక్షల కి.మీ. దూరం ప్రయాణించిన 88 బస్సుల కండీషన్‌ను మెరుగుపర్చనున్నామన్నారు. కోచ్ వర్క్‌లు, బాడీ తదితర విభాగాల కండీషన్‌కు రూ.15 వేల రూ.20వేల ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పరిగి, వికారాబాద్, తాండూరు డిపోల పరిధిలోని 64 పల్లె వెలుగు బస్సుల సీట్ల కండీషన్‌ను మెరుగుపర్చుతున్నామన్నారు. వాహన కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపులో భాగంగా బీఎస్-3 బస్సుల ఇంజిన్ శక్తి వృథా కాకుండా బస్సులు నడిపేలా రీజియన్ పరిధిలో 1,250 మంది డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటికే 700మంది డ్రైవర్లకు శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. రీజియన్ కేఎంపీఎల్ కూడా పెరిగిందని ఆయన తెలిపారు. 4.86గా ఉన్న రీజియన్ కెంఎంపీల్ 5కు పెరిగిందని, తాండూరు డిపో కేఎంపీఎల్ 5.22 నుంచి 5.31కి పెరిగిందని సీఎంఈ వివరించారు. ఇంధన పొదుపులో మెకానిక్, డ్రైవర్లదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. -
ఎవరినీ వదిలిపెట్టం - 40 రోజుల్లో ఛార్జిషీట్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రయివేట్ వోల్వో బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని సీఐడీ ఛీఫ్ కృష్ణ ప్రసాద్ చెప్పారు. 40 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామన్నారు. 15 నిమిషాల్లోనే 45 మంది దుర్మరణం చెందారని తెలిపారు. పాలెం దుర్ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టం అని కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఇద్దరి అరెస్టులతోనే సరిపెట్టుకోం అన్నారు. చట్టపరంగా ఉన్న అంశాల్ని పరిశీలిస్తున్నామన్నారు. వోల్వో బస్సు బాడిబిల్డింగ్ లోపాలు, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు,అధికారుల నిర్లక్ష్యం , వీటన్నింటిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీసీ, ఎంవీ యాక్ట్ కింది నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.