జెసి ప్రభాకర రెడ్డి భార్య అరెస్ట్ | JC Prabhakar Reddy wife Uma arrest | Sakshi
Sakshi News home page

జెసి ప్రభాకర రెడ్డి భార్య అరెస్ట్

Published Wed, Feb 26 2014 3:40 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

పాలెం వద్ద అక్టోబర్ 30న  దగ్ధమైన వోల్వో బస్ - Sakshi

పాలెం వద్ద అక్టోబర్ 30న దగ్ధమైన వోల్వో బస్

హైదరాబాద్: పాలెం బస్సు ప్రమాద దుర్ఘటన కేసుకు సంబంధించి మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర రెడ్డి భార్య ఉమా ప్రభాకర రెడ్డిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను కోర్టుకు తరలించినట్లు సిఐడి అదనపు డిజి కృష్ణప్రసాద్ చెప్పారు. ప్రభాకర రెడ్డి భార్య ఉమకు మహబూబ్ నగర్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆమె బెయిలుపై విడుదలయ్యారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ యజమానితోపాటు బస్సు డ్రైవర్‌, షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లా అనేవారిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ప్రమాదానికి గురైన వోల్వో బస్సును జబ్బార్ ట్రావెల్స్‌ వారు నడుపుతున్నప్పటికీ, అది జెసి సోదరులకు చెందిన దివాకర్ రోడ్డు లైన్స్‌కు చెందినది కావడంతో ఆ సంస్థపై  క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం బస్సు యజమాని హోదాలో ఉన్న జేసీ ఉమారెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఈ దుర్ఘటనకు సంబంధించి  36 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏ1 నిందితురాలిగా ఉమా ప్రభాకర్‌రెడ్డిని పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డు నిర్మాణంలోని లోపాలు, బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం, బస్సు డిజైన్‌లో లోపాలే  దుర్ఘటనకు కారణం అని ఆయన వివరించారు. ఓల్వా బస్సు డ్రైవర్ సీటు కింద ముందు భాగంలో 9 అంగుళాల ఎత్తులో బ్యాటరీ అమర్చారని, కల్వర్ట్‌కు బ్యాటరీ ఢీ కొట్టడంతోనే మంటలు చెలరేగాయని తెలిపారు. బస్సు అడుగు భాగం డిజైన్‌లో ఎక్కువ శాతం ఉడ్, ప్లాస్టిక్ ఉండటం వల్ల ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పారు. బస్సు లోపల అదనంగా  సీట్లు తయారు చేసి ప్రయాణికులను ఎక్కించారని చెప్పారు.  ఘటన తర్వాత  జబ్బార్ ట్రావెల్స్ - దివాకర్ రోడ్ లైన్స్ వారు నకిలీ లీజ్ అగ్రిమెంట్ సృష్టించారని  డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement