ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం | safety is important fror passengers | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం

Published Fri, Jan 31 2014 6:03 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

safety is important fror passengers

 అంతర్ రాష్ట్రాల మధ్య నడిచే ఏసీ బస్సుల్లో భద్రతా ప్రమాణాల పెంపు
 విమాన ల్లో మాదిరి ఏసీ బస్సుల్లోనూ భద్రతా చర్యల వీడియో ప్రదర్శన
 అందుబాటులో హ్యామర్లు, అగ్నిమాపక యంత్రం
 ఓల్వో బస్సుల్లో స్పీడ్ లాక్ సిస్టం.. గంటకు 100 కి.మీ. మాత్రమే
 సేఫ్టీ డ్రైవింగ్‌పై 135మంది ఓల్వో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ
 12 లక్షల కి.మీ. తిరిగిన బస్సుల కండిషన్‌ను మెరుగుపరుస్తాం
 రంగారెడ్డి జిల్లా రీజియన్  ఆర్టీసీ సీఎంఈ వెంకన్న
 
 తాండూరు, న్యూస్‌లైన్:
 ఇటీవల జరిగిన పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ పకడ్బందీ చర్యలు చేపట్టిందని రంగారెడ్డి జిల్లా రీజియన్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (సీఎంఈ) వెంకన్న పేర్కొన్నారు. గురువారం తాండూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్ రాష్ట్రాల మధ్య నడిచే ఏసీ బస్సు సర్వీసుల్లో ప్రమాదాలను నివారించేందుకు భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రీజియన్ పరిధిలోని హైదరాబాద్-1, 2, పికెట్‌తోపాటు వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల పరిధిలో మొత్తం 505 బస్సు సర్వీసులు ఉన్నాయన్నారు. గరుడ, గరుడ+తో కలుపుకొని 40 ఏసీ బస్సులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే రంగారెడ్డి రీజియన్‌లో ఏసీ బస్సులు అధికంగా ఉన్నాయని వెంకన్న తెలిపారు.
 
  పాలెం బస్సు ప్రమాద ఘటన అనంతరం ఏసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రతా ప్రమాణాల పెంపుపై ఆర్టీసీ దృష్టి సారించిందని చెప్పారు. ప్రతి ఏసీ బస్సులో అగ్నిమాపక యంత్రం, ప్రాథమిక చికిత్స బాక్స్ (కిట్స్)లను ఏర్పాటు చేశామన్నారు. ఏసీ బస్సుల్లో కిటికీల అద్దాలు పిక్స్‌డ్‌గా ఉంటాయని, అత్యవసర పరిస్థితుల్లో అద్దాలను పగులకొట్టేందుకు సీట్ల కింద నాలుగు హ్యామర్ (సుత్తి)లను ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. విమానాల్లో ఎయిర్ హోస్టెస్ మాదిరిగా ఏసీ బస్సులోనూ అత్యవసర కిటీకీలు, అగ్నిమాపక యంత్రం, హ్యామర్‌లు, ప్రాథమిక చిక్సిత కిట్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలియజేసే రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో సీడీ ద్వారా ప్రదర్శనను ప్రయాణికులకు చూపిస్తామని ఆయన వివరించారు. బస్సు బయలుదేరే ముందు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. తద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు అవగాహన ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గంటకు 120-130 కి.మీ. వెళ్లే ఓల్వో బస్సుల వేగాన్ని తగ్గించినట్లు వెంకన్న తెలిపారు. ఈ బస్సుల్లో గంటకు 100 కి.మీ.కు స్పీడ్‌ను లాక్ చేసినట్లు చెప్పారు.
 
 నిపుణుల బృందంతో డ్రైవర్లకు శిక్షణ..
 భద్రతా చర్యల్లో భాగంగా రీజియన్ పరిధిలో 135మంది ఓల్వో బస్సుల డ్రైవర్లకు బెంగళూరు నుంచి నిపుణుల బృందం ద్వారా సేఫ్టీ డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు సీఎంఈ తెలిపారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లోని 12లక్షల కి.మీ. దూరం ప్రయాణించిన 88 బస్సుల కండీషన్‌ను మెరుగుపర్చనున్నామన్నారు. కోచ్ వర్క్‌లు, బాడీ తదితర విభాగాల కండీషన్‌కు రూ.15 వేల రూ.20వేల ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పరిగి, వికారాబాద్, తాండూరు డిపోల పరిధిలోని 64 పల్లె వెలుగు బస్సుల సీట్ల కండీషన్‌ను మెరుగుపర్చుతున్నామన్నారు. వాహన కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపులో భాగంగా బీఎస్-3 బస్సుల ఇంజిన్ శక్తి వృథా కాకుండా బస్సులు నడిపేలా రీజియన్ పరిధిలో 1,250 మంది డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటికే 700మంది డ్రైవర్లకు శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. రీజియన్ కేఎంపీఎల్ కూడా పెరిగిందని ఆయన తెలిపారు. 4.86గా ఉన్న రీజియన్ కెంఎంపీల్ 5కు పెరిగిందని, తాండూరు డిపో కేఎంపీఎల్ 5.22 నుంచి 5.31కి పెరిగిందని సీఎంఈ వివరించారు. ఇంధన పొదుపులో మెకానిక్, డ్రైవర్లదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement