75 వసంతాల ‘పల్లెటూరి పిల్ల’.. తెలుగు తెరపై చెరగని ముద్ర!
జయాపజయాల స్థాయితో సంబంధం లేకుండాకొన్ని సినిమాలకు చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.వాటికి ఉండే అనేకానేక ఇతర విశేషాల తాలూకు ఘనత అది. కాలం గడిచిన కొద్దీ చిత్ర కథ, కథనాల కన్నా ఆ విశేషాల వల్ల సదరు సినిమా మైలురాయిగా మిగిలిపోతుంది. ఈ ఏప్రిల్ 27తో సరిగ్గా 75 వసంతాలు(ప్లాటినమ్ జూబ్లీ) నిండిన ‘పల్లెటూరి పిల్ల’ అలాంటిదే.అప్పట్లో ఘన విజయం సాధించి, 7 కేంద్రాల్లో నేరుగా శతదినోత్సవం జరుపుకొన్న ఈ సినిమా ప్రత్యేకతలు పుష్కలం. ఆనాటి ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం చెరిగిపోని తన ముద్రలను ఈనాటికీ గుర్తు చేస్తూనే ఉంది.ఎన్టీఆర్ అసలు మొదటి సినిమా ఇదే! నటుడిగా మొదలై ప్రజానేతగా ఎదిగిన ఎన్టీ రామారావు తొలి సినిమా అనగానే ‘మన దేశం’ (1949) అనుకుంటాం కానీ, అసలు ఆయన నటుడిగా తొలిసారిగా ఎంపికైనదీ, తొట్టతొలిసారిగా కెమెరా ముందు నిల్చున్నదీ ఈ ‘పల్లెటూరి పిల్ల’తోనే! అయితే, రిలీజులో మొదట ‘మన దేశం’ వస్తే, రెండోది ‘షావుకారు’, మూడోది ‘పల్లెటూరి పిల్ల’ అయ్యాయి. నిజానికి, ఎన్టీఆర్‌ను ఈ ‘పల్లెటూరి పిల్ల’ దర్శక – నిర్మాత బి.ఏ. సుబ్బారావు వద్దకు తీసుకువెళ్ళింది కూడా ‘మన దేశం’ దర్శకుడు ఎల్వీ ప్రసాదే! అందగాడు, స్ఫురద్రూపి అయిన ఎన్టీఆర్‌ను చూస్తూనే, తన తొలి సినిమా హీరో ఇతనే అని సుబ్బారావు తేల్చేశారు. అయితే, తొలి సినిమా రూపొందిస్తూ, తొలిసారి కెమెరా ముందుకు వస్తున్న నటుణ్ణి హీరోగా పెట్టడం భారమేనంటూ ప్రసాద్, ఈలోగా తన సినిమాలో ఒక సహాయక పాత్ర ఇస్తానన్నారు. అదే – ఎన్టీఆర్ తొలిసారి తెరపై కనిపించిన ‘మన దేశం’లోని పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అన్న మాట!తెలుగు సినిమా పరిశ్రమ పురోగతిలో ఇవాళ్టికీ ధ్రువతారలుగా చెప్పుకొనే ఎన్టీఆర్ – ఏయన్నార్ అనే ఇద్దరు అగ్రనటులు కలసి తొలిసారిగా నటించిన చిత్రం కూడా ‘పల్లెటూరి పిల్లే’. అప్పటి దాకా మీర్జాపురం రాజా వారి ‘శోభనాచల’ సంస్థలో ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ దాకా వివిధ శాఖల్లో, స్థాయుల్లో పనిచేస్తున్న బి.ఏ. సుబ్బారావు ఆసక్తి కొద్దీ, ఆ సంస్థ అండదండలతో దర్శకుడిగా, నిర్మాతగా మారిందీ ఈ సినిమాతోనే. 1948 మొదట్లోనే షూటింగ్ ఆరంభమైనా, ఆర్థిక ఇబ్బందులతో చిత్రనిర్మాణం విపరీతంగా జాప్యమైంది. ఆఖరికి మళ్ళీ రాజా వారి చేయూతతోనే 1950 మొదట్లో సినిమా పూర్తి చేశారు. అందుకే, ‘బి.ఏ. సుబ్బారావు, శోభనాచల పిక్చర్స్ జాయింట్ ప్రొడక్షన్’ అంటూ నిర్మాణసంస్థగా రెండు పేర్లూ వేశారు. ఎట్టకేలకు నాటి ప్రసిద్ధ పంపిణీ సంస్థ పూర్ణా పిక్చర్స్ ద్వారా విడుదల చేయించారు.గాంధీ ఆశయం చూపే జానపదం జానపద చిత్రాలకే డబ్బు వస్తుందనీ, సాంఘికాలు సహా తక్కినవి ఏవి తీసినా ఆర్థికంగా నష్టం వస్తుందనీ తెలుగు చిత్రసీమలో భావిస్తున్న రోజులవి. నిర్మాతలంతా జానపదాల వైపు, మంత్రతంత్రాల కాకమ్మకథల వైపు పరుగులు తీస్తున్న కాలమది. అలాంటి వాతావరణంలో అనారోగ్యకరమైన అంశాలను ప్రేక్షకుల మీద రుద్దకుండా, అభ్యుదయానికి దోహదం చేస్తూనే విజయవంతమయ్యే ఫోక్లోర్ సినిమా తీయడం సాధ్యమేనని ‘పల్లెటూరి పిల్ల’ ఋజువు చేసింది. కత్తులూ కటార్లూ వాడినా, మాయలూ మంత్రాలూ లేని ఈ జానపదం మన తెలుగు ప్రాంతాల్లో ప్రభువుల పక్షాన పాలన చేసిన పాలెగాళ్ళ సంస్కృతిని తెరపై చూపింది. గ్రామాలను కాపు కాయాల్సిన వాళ్ళు కొన్నిసార్లు నిరంకుశంగా, పల్లెల్ని దోచుకు తినే వైనానికి విలన్ కంపన దొర (నటుడు ఏ.వి. సుబ్బారావు) పాత్ర ప్రతిరూపం. అయితే, ఈ చిత్రానికి మూలం మాత్రం 18వ శతాబ్దిలోకెల్లా ప్రాచుర్యం పొందిన నాటకాల్లో రెండోదైన షెరిడాన్ ఆంగ్ల రచన ‘పిజారో’. అధికారం, అత్యాశ, నమ్మకద్రోహం లాంటి ఎన్నో మిళితమైన విషాదాంత డ్రామా ఇది. దాన్ని ఆధారంగా తీసుకొని, తాపీ ధర్మారావు, ఆదినారాయణరావు, సదాశివబ్రహ్మం, చిత్రపు నారాయణమూర్తి, బి.ఏ. సుబ్బారావు... ఇలా అందరూ కలసి మన నేటివిటీకి తగ్గట్టుగా వండిన వంటకం ‘పల్లెటూరి పిల్ల’. మూడు ముక్కల్లో చెప్పాలంటే, ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడానికి కంపన దొర అనే ముఠా నేత ప్రయత్నాలను గ్రామస్థులంతా ఏకమై ప్రతిఘటించడమే కథా వస్తువు. దుర్మార్గుడైన ముఠా నేతకు చివరలో హృదయ పరివర్తన కలుగుతుంది. ‘‘జీవితకాలమంతా గాంధీజీ కలవరించిన గ్రామ పునర్నిర్మాణమును ప్రత్యక్షంగా నిరూపించే మహత్తర చిత్రము’’ అంటూ అప్పట్లో ప్రచారం చేశారు.కంపన దొర అనుచరుడిగా ఉండి, పల్లెటూరి పిల్ల (అంజలీదేవి) దెబ్బతో మనిషిగా మారి, గ్రామం కోసం పోరాడే హీరో పాత్ర ఎన్టీఆర్‌ది. సదరు పల్లెటూరి పిల్లకు వరసైన వాడైనా, హీరో హీరోయిన్ల సాన్నిహిత్యం చూసి, తన ప్రేమను వదులుకొని పక్కకు తప్పుకొని, ఆఖరులో వారి కోసం, ప్రజాక్షేమం కోసం ప్రాణమే త్యాగం చేసి మహాత్ముడిగా నిలిచే కీలక పాత్ర ఏయన్నార్‌ది. తాపీ ధర్మారావు రాసిన మాటలు, ‘శాంత వంటి పిల్ల లేదోయి...’ లాంటి పాటలు అప్పట్లో జనానికి పట్టాయి.ఇటు ఎన్టీఆర్... అటు ఎమ్జీఆర్! ఇవాళ ఇంతగా చెప్పుకుంటున్న ఈ ‘పల్లెటూరి పిల్ల’ నిర్మాణమే కాదు, రిలీజ్ కూడా ఆలస్యమే. రకరకాల రిలీజ్ తేదీలు మారింది. ఆఖరి క్షణంలోనూ 1950 ఏప్రిల్ 20 నుంచి ఎందుకనో ఓ వారం వాయిదా వేశారు. ఆఖరికి ఏప్రిల్ 27న మద్రాసు సహా తెలుగు నాట అంతటా జనం ముందుకొచ్చింది. ఎన్టీఆర్ హీరోగా చేసిన తొలి చిత్రమిదే అయినా, ఆయన హీరోగా తర్వాత మొదలైన విజయా వారి ‘షావుకారు’ జనం ముందుకొచ్చి, సక్సెస్‌ఫుల్‌గా 3 వారాలవుతున్న వేళ ఈ ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ నాటికే ఒకపక్క విజయా వారి ‘పాతాళభైరవి’ షూటింగ్ జోరుగా సాగుతోంది. మరోపక్క వాహినీ వారి ఆణిముత్యం ‘మల్లీశ్వరి’ కొంత పూర్తయింది. రిలీజుకు ముందే ఆ ఏడాది తమిళ ఉగాది నాడు ఉదయం మద్రాసులోని ‘మినర్వా’ థియేటర్లో ఈ ‘పల్లెటూరి పిల్ల’ ప్రివ్యూ వేశారు. గమ్మత్తేమిటంటే, ఒక పక్కన ఎన్టీఆర్ సినిమా చూపిస్తుంటే, అదే రోజున అదే సమయంలో ‘సాగర్’ టాకీస్‌లో ఎమ్జీఆర్ కొత్త తమిళ చిత్రం ‘మరుదనాడ్ ఇళవరసి’ ప్రెస్షో వేయడం. (ఆ తమిళ చిత్రం మిగిలిన కేంద్రాల కన్నా 12 రోజులు ఆలస్యంగా ఆ రోజే మద్రాస్‌లో రిలీజైంది). యాదృచ్ఛికమే అయినా ఆ రెండు చిత్రాల ప్రివ్యూలు జరిగిన సరిగ్గా ఆ ఉగాది నాటి రాత్రే 8.47 గంటలకు తిరువణ్ణామలైలో భగవాన్ రమణ మహర్షి సమాధిగతులయ్యారు. హీరోగా ఎన్టీఆర్‌కు అదే తొలి సినిమా కానీ, ఎమ్జీఆర్‌కు మాత్రం అప్పటికే హీరోగా కొంత పేరుంది. ఇటు ఎన్టీఆర్ తెలుగు సినిమా, అటు ఎమ్జీఆర్ తమిళ సినిమా... రెండూ జానపదాలే. రెండూ హిట్టే. కాలగతిలో ఇద్దరూ ఆయా భాషల చిత్రసీమలకు మకుటం లేని మహారాజులయ్యారు. ఆపైన పార్టీలు పెట్టి, జనరంజక పాలకులూ అయ్యారు.ఆఖరు దాకా... ఆనాటి మంచితనం! రిలీజులో ఆలస్యమైనా, హీరోగా ఎన్టీఆర్‌కు తొలి రోజులైనా, ‘పల్లెటూరి పిల్ల’ హిట్టయింది. హీరోగా ఎన్టీఆర్, దర్శక – నిర్మాతగా సుబ్బారావు స్థిరపడ్డారు. మూడు దశాబ్దాల పైగా ఇద్దరూ ఎవరికి వారు వెండితెరపై వెలిగారు. ‘రాజు –పేద’, ‘చెంచులక్ష్మి’, ‘భీష్మ’, ‘రాణీ రత్నప్రభ’, ‘మోహినీ భస్మాసుర’ లాంటి అనేక చిత్రాలను సుబ్బారావు స్వీయ నిర్మాణంలో రూపొందించారు. తెరపై తొలి అవకాశమిచ్చారన్న కృతజ్ఞతతో ఎన్టీఆర్ ‘సతీ సావిత్రి’, ‘మావారి మంచితనం’ వరకు సుబ్బారావుతో సినిమాలు చేస్తూనే వచ్చారు. కుమారులు హరికృష్ణ – బాలకృష్ణలు తొలిసారిగా కలిసి నటించిన ‘రామ్ – రహీమ్’ (1974)కు కూడా సుబ్బారావే డైరెక్టర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)లో రాష్ట్ర ప్రభుత్వ న్యూస్‌రీల్స్ రూపకల్పన బాధ్యతలు అప్పగించడం విశేషం.దిలీప్ కుమార్‌కు ఫ్లాపు... అమితాబ్‌కు హిట్టు! ఎన్టీఆర్ – బి.ఏ. సుబ్బారావుల తొలి ప్రయత్నం ‘పల్లెటూరి పిల్ల’ 1990ల దాకా రీరిలీజ్ అవుతూ, అభిమానుల్ని అలరించింది. తొలి రిలీజప్పుడే ఈ సినిమా తమిళంలో ‘గ్రామ పెణ్’గా అనువాదమైంది. (తమిళంలో అనువాదమైన తొలి తెలుగు సినిమా ఏయన్నార్ ‘కీలుగుర్రం’ అయితే, రెండో తెలుగు సినిమా ఎన్టీఆర్ ‘పల్లెటూరి పిల్ల’). తరువాత కొన్నేళ్ళకు ప్రసిద్ధ నిర్మాత ‘జెమినీ’ వాసన్ ఇదే కథను దేవానంద్, దిలీప్‌కుమార్‌లతో హిందీలో ‘ఇన్సానియత్’ (1955) పేరిట రీమేక్ చేశారు. హిందీ చలనచిత్ర చరిత్రలో ఆ అగ్రతారలిద్దరూ కలసి నటించిన ఏకైక సినిమా అది. హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా జిప్పీ అనే చింపాజీని రప్పించి, ఈ హిందీ వెర్షన్లో నటింపజేయడం విశేషం. హీరోల కన్నా ఈ హాలీవుడ్ చింపాజీకి ఇచ్చిన పారితోషికం, చేసిన ఖర్చే ఎక్కువ. జెమినీ వారి హిందీ హిట్స్ ‘చంద్రలేఖ’ వగైరాలతో పోలిక లేదు కానీ, పబ్లిసిటీ ప్రభంజనంలో ‘ఇన్సానియత్’ సో సో అనిపించుకుంది. చిత్ర మేమంటే, వీటన్నిటికీ మూలమైన ‘పిజారో’ నాటక ఇతివృత్తం స్ఫూర్తితో రకరకాల మార్పులతో తర్వాత అనేక భాషల్లో సినిమాలొచ్చాయి. జాగ్రత్తగా గమనిస్తే, చిరస్మరణీయ బాక్సాఫీస్ సూపర్‌హిట్ ‘షోలే’కు కూడా ఇదే ప్రేరణ. త్యాగంలో దిలీప్ కుమార్ పాత్రకూ, అమితాబ్ పాత్రకూ పోలికలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టరైజేషన్ దిలీప్‌కు ఫ్లాపైతే, అమితాబ్‌కు సూపర్ హిట్.ఏయన్నార్ అలా వచ్చారు! ‘పల్లెటూరి పిల్ల’ రూపకల్పన ప్రస్థానం ఆది నుంచి అనేక మలుపులు తిరిగింది. కాకినాడలో ప్రసిద్ధ ‘యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్’ నాటకాల రోజుల నుంచి బి.ఏ. సుబ్బారావుకు సుపరిచితులైన అంజలీదేవి, ఆదినారాయణరావులు చిత్ర హీరోయిన్, సంగీత దర్శకులుగా ఓకే. మొదట ఎన్టీఆర్‌తో పాటు ఉండే మరో హీరో పాత్రకు ఈలపాట రఘురామయ్యను అనుకున్నారు. రఘురామయ్యతో కొద్దిగా షూటింగ్ కూడా చేశాక, చిత్రనిర్మాణం విపరీతంగా ఆలస్యమైంది. ఆఖరికి ఆ పాత్ర ఏయన్నార్‌కు దక్కింది. అప్పటికే, ‘బాలరాజు’ (1948 ఫిబ్రవరి 26) వచ్చేసింది. శోభనాచల వారి ‘కీలుగుర్రం’ (రిలీజ్ 1949 ఫిబ్రవరి 19) పట్టాలెక్కింది. అలా హీరోగా పేరు తెచ్చుకున్న ఏయన్నార్ ఈ చిత్రంలో హీరోయిన్ లేకుండా, ఆఖరికి ప్రాణాలు కూడా వదులుకొనే త్యాగమయ పాత్రకు ఒప్పుకోవడం విశేషమే. స్టార్డమ్ ఇంతగా ప్రబలని ఆ రోజుల్లో రంగస్థల, సినీ నటీనటులకు తాము పోషించే పాత్ర తాలూకు ప్రాధాన్యమే తప్ప, ఇమేజ్ పట్టింపులు ఉండేవి కాదనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఏయన్నార్ రాకతో, అంతకు ముందు రఘురామయ్యతో తీసిన సీన్లను రీషూట్ చేశారు. మానిన గాయాల మధురస్మృతులుఈ ‘పల్లెటూరి పిల్ల’తో మొదలైన ఎన్టీఆర్, ఏయన్నార్ల టాప్ స్టార్ కాంబినేషన్ మాత్రం మరెక్కడా లేని విధంగా మొత్తం 15 చిత్రాల్లో కొనసాగింది. ఈ చిత్రంలోనే ఏయన్నార్ మీదకు వచ్చే ఎద్దుతో ΄పోరాడే సీన్లో రియలిస్టిక్‌గా నటించినప్పుడు ఎన్టీఆర్ కుడి చేతి ఎముక విరిగింది. అలా ఆ తొలి చిత్రం నుంచి సినీ కెరీర్లో మొత్తం 7 సందర్భాల్లో వివిధ సినిమాల షూటింగుల్లో అదే చేతికి దెబ్బ తగిలి, ఎన్టీఆర్‌కు ఫ్రాక్చరైంది. అలా జరిగినప్పుడల్లా ఆయన పుత్తూరు రాజుల కట్టువైద్యాన్ని ఆశ్రయించి, ఆరోగ్యవంతులయ్యారు. తొలిచిత్రం ‘పల్లెటూరి పిల్ల’ ఫైట్ సీన్లోనే ఆస్ట్రేలియన్ ఎద్దు కొమ్ము విసిరినప్పుడు గాయమై, ఎన్టీఆర్ ఎడమ కన్ను కింద చిన్న గాటు పడింది. ముఖం మీద ఆ చిరుగాటు మచ్చ కెరీర్‌కు అవరోధమవుతుందని అందరూ భావించారు కానీ, అవేవీ ఎన్టీఆర్ ప్రస్థానానికి అడ్డు కాలేదు. ఆ చిరుగాటునే ‘కొండవీటి సింహం’ (1981)లో ఎన్టీఆర్ వేసిన ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ పాత్రకు తగ్గట్టుగా మేకప్‌లో పెద్దదిగా చేసి, ఎఫెక్టివ్‌గా వాడుకోవడం విశేషం. తొలి సినిమా ‘పల్లెటూరి పిల్ల’ ఇచ్చిన గుర్తులు ఎన్టీఆర్కే కాదు... సినీ ప్రియులకూ ఇవాళ్టికీ ఇలా మిగిలాయి.– రెంటాల జయదేవ