palley raghunathareddy
-
ఆశల పల్లకి
► కేబినెట్లో చోటు కోసం ముగ్గురు నేతల యత్నాలు ► జూన్ 8 తర్వాత విస్తరణ యోచనలో చంద్రబాబు ► పనితీరు బాగోలేదని మంత్రి ‘పల్లె’ను తప్పించే యోచన ► సునీత పనితీరూ అలాగే ఉన్నా కొనసాగింపునకే మొగ్గు ► బెర్తు కోసం బీకే, బాలకృష్ణ, పయ్యావుల మధ్య పోటీ (సాక్షిప్రతినిధి, అనంతపురం) రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? ఈ సందర్భంగా పనితీరు బాగోలేదని ఓ మంత్రికి ఉద్వాసన తప్పదా? ఖాళీ అయ్యే బెర్త్ కోసం జిల్లా నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందా?... టీడీపీలో తాజా పరిణామాలను చూస్తే ఔననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుండటంతో ఉగాది తర్వాత లేదంటే జూన్ 8పైన విస్తరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది. జిల్లా నుంచి ప్రస్తుతం పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. వీరిద్దరి పనితీరుపై చంద్రబాబు పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పల్లె తనకు కేటాయించిన శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారని, ఆయన్ని తప్పించాలని బాబు నిర్ణయించినట్లు తెలిసింది. తోటి మంత్రులు, జిల్లా అధికారులను పక్కనపెడితే సమాచార శాఖలో తన సొంత జిల్లాలో అధికారులపైనా పల్లె ఏమాత్రమూ పట్టు సాధించలేకపోయారు. దీనికితోడు ఇటీవల కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి పదవి హామీతోనే ఆయన సైకిల్ ఎక్కినట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో సామాజికవర్గాల సమీకరణలో ‘పల్లె’పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి సునీత సేఫ్ పరిటాల సునీత పనితీరుపైనా చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నారు. పౌరసరఫరాల శాఖలో అవినీతిపై ఇటీవల తీవ్ర ఆరోపణలొచ్చాయి. ‘చంద్రన్న కానుక’లో రూ.కోట్లు దోపిడీ జరిగినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. పైగా సునీతకు పెద్దగా చదువు లేకపోవడంతో తనశాఖలో ఫైళ్లు చూడలేకపోతున్నారని, ఇంగ్లిష్తో పాటు తెలుగులోని ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో చదవలేకపోవడం, నిర్ణయాలు తీసుకోకుండా మరొకరిపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను కూడా తప్పించి.. ఈ రెండు స్థానాల్లో కొత్తవారిని తీసుకోవాలని చంద్రబాబు మొదట భావించారు. అయితే.. సునీత తప్పిస్తే ‘అనంత’లో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడొచ్చనే ఆలోచనతో కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆ ఒక్కడు ఎవరో? జిల్లా నుంచి మంత్రి పదవి కోసం బీకే పార్థసారథి, పయ్యావుల కేశవ్‌తో పాటు సీఎం బావమరిది బాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు పోటీపడుతున్నారు. ప్రస్తుతం రెండు మంత్రి పదవులూ హిందూపురం లోక్‌సభ స్థానానికే దక్కాయి. ఈసారి ‘పురం’తో పాటు ‘అనంత’ లోక్‌సభ స్థానం నుంచి ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీ కోటాలో ఒకరికి బెర్తు దక్కే అవకాశం ఉంది. ‘పురం’ లోక్‌సభ పరిధి నుంచి సునీత కొనసాగితే.. ‘అనంత’ నుంచి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోవాలని కాలవ ప్రయత్నించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయనపై చంద్రబాబుకు సదాభిప్రాయం లేదని తెలుస్తోంది. చీఫ్ విప్ పదవి నుంచి కూడా తప్పించాలని చూసినా, సామాజిక సమీకరణాల నేపథ్యంలోసేఫ్ అయ్యారు. తర్వాత రేసులో ఉన్న వ్యక్తి పయ్యావుల కేశవ్. సీఎం కుమారుడు లోకేశ్, బాలకృష్ణ కూడా కేబినెట్‌పై ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరికి బెర్త్ ఖరారైనా రాష్ట్రంలో మరో ‘కమ్మ’నేతకు కేబినెట్లో అవకాశం ఉండదు. వీరిద్దరికీ చోటు దక్కకపోతే కేశవ్ రేసులో ఉండొచ్చు. అప్పుడు ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారవుతారు. ఇది సమస్యగా మారితే బీకే పార్థసారథికి బీసీ కోటాలో చోటు దక్కే అవకాశముంది. అప్పుడు రెండు మంత్రి పదవులూ మళ్లీ ‘పురం’ లోక్‌సభ పరిధిలోకే వెళతాయి. ఈ క్రమంలో బీకే, కేశవ్‌లో ఎవరు బెర్త్ దక్కించుకుంటారో వేచి చూడాలి. -
నేతలదే పైచేయి!
► హెచ్డీఎస్కు కలెక్టర్ ఆమోదముద్ర ► మొత్తం 11 మందితో కమిటీ ► ప్రజాప్రతినిధుల అనుచరులకు పెద్దపీట ► ముందే చెప్పిన ‘సాక్షి’ అనంతపురం మెడికల్ : సర్వజనాస్పత్రి అభివృద్ధి సొసైటీ(హెచ్‌డీఎస్)లో ప్రజాప్రతినిధుల అనుచరులకు పెద్దపీట వేశారు. రాజకీయ నేతలు సూచించిన వారినే చేర్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుకు కలెక్టర్ కోన శశిధర్ ఆమోదముద్ర వేశారు. రాజకీయ నేతలు కాకుండా సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను చేర్చాలని జీవో జారీ చేసినా.. అది నామమాత్రంగానే మిగిలిపోయింది. గతంలో కమిటీల్లో రాజకీయ నాయకులకు చోటుండేది. అయితే.. ప్రభుత్వం పారదర్శకత పేరుతో నేతలను తొలగించింది. ఎన్జీఓ ప్రతినిధులు, సంఘ సేవకులకు స్థానం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 23న ఓ జీవో జారీ చేసింది. దీని ప్రకారం కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వర్కింగ్ చైర్మన్‌గా ఎన్జీఓ ప్రతినిధి లేదా సంఘ సేవకుడు, మెంబర్ అండ్ కన్వీనర్‌గా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు సభ్యులు కలిపి మొత్తం 11 మంది ఉంటారు. కమిటీ నియామకానికి సంబంధించి పూర్తి అధికారాలను కలెక్టర్‌కు కట్టబెట్టింది. రాజకీయ నేతలకు చోటు లేదన్న విషయం తెలిసి సంఘ సంస్కర్తల పేరుతో వారి అనుచరులకు పెద్దపీట వేశారు. కలెక్టర్ ఆమోదముద్ర వేసిన కమిటీని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 11 మందితో కమిటీ సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీలో మొత్తం 11 మంది ఉన్నారు. వర్కింగ్ చైర్మన్‌గా డాక్టర్ వై.రామసుబ్బయ్య (రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్), చైర్మన్‌గా కోన శశిధర్ (కలెక్టర్), మెంబర్ కన్వీనర్‌గా డాక్టర్ మైరెడ్డి నీజర (మెడికల్ కళాశాల ప్రిన్సిపల్) ఉన్నారు. సభ్యులుగా రామగిరి మండలం గంగంపల్లికి చెందిన కె.రామ్మూర్తినాయుడు, ఎం.పవన్‌కుమార్ (శాంతిసేన రక్తసహకార బంధువు), అనంతపురంలోని కాయగూరల వీధికి చెందిన కె.వెంకటేశులు, నల్లమాడ మండలం వంకరగుంటకు చెందిన కేశవరెడ్డి, డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు (సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్), చల్లా ఓబుళేసు (నగర పాలక సంస్థ కమిషనర్)తో పాటు డీఎంఈ, జిల్లా ప్రశాంతి సమాఖ్య అధ్యక్షురాలిని చేర్చారు. వీరిలో నలుగురు సభ్యులు రాజకీయ నేతల అనుచరులు కావడం గమనార్హం. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సూచించిన వారిని కమిటీలో చేర్చారు. హెచ్‌డీఎస్‌లో రాజకీయానిదే పైచేయిగా ఉంటోందంటూ జనవరి 30న ‘ప్రభుత్వానివి ‘ఉత్త’ర్వులే’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. అదే రోజు కమిటీ సభ్యుల వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం కలెక్టర్ ఆమోదముద్ర వేసిన కమిటీలో వాళ్లంతా ఉండటాన్ని బట్టి చూస్తే అధికార యంత్రాంగం కూడా నేతలకు తలొగ్గిందన్నది స్పష్టమవుతోంది. కాగా.. ఈ నెలాఖరులోగా కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ కలెక్టర్ వద్దకు నేడో, రేపో వెళ్లనుంది.