నేతలదే పైచేయి! | H DS Collector approved in pressures | Sakshi
Sakshi News home page

నేతలదే పైచేయి!

Published Thu, Mar 17 2016 4:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

నేతలదే పైచేయి!

నేతలదే పైచేయి!

హెచ్‌డీఎస్‌కు కలెక్టర్ ఆమోదముద్ర
మొత్తం 11 మందితో కమిటీ
  ప్రజాప్రతినిధుల అనుచరులకు పెద్దపీట
ముందే చెప్పిన ‘సాక్షి’

 
అనంతపురం మెడికల్ : సర్వజనాస్పత్రి అభివృద్ధి సొసైటీ(హెచ్‌డీఎస్)లో    ప్రజాప్రతినిధుల అనుచరులకు పెద్దపీట వేశారు. రాజకీయ నేతలు సూచించిన వారినే చేర్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుకు కలెక్టర్ కోన శశిధర్ ఆమోదముద్ర వేశారు. రాజకీయ నేతలు కాకుండా సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను చేర్చాలని  జీవో జారీ చేసినా.. అది నామమాత్రంగానే మిగిలిపోయింది. గతంలో  కమిటీల్లో  రాజకీయ నాయకులకు చోటుండేది. అయితే.. ప్రభుత్వం పారదర్శకత పేరుతో నేతలను తొలగించింది. ఎన్జీఓ ప్రతినిధులు, సంఘ సేవకులకు స్థానం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 

సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 23న ఓ జీవో జారీ చేసింది. దీని ప్రకారం కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వర్కింగ్ చైర్మన్‌గా ఎన్జీఓ ప్రతినిధి లేదా సంఘ సేవకుడు, మెంబర్ అండ్ కన్వీనర్‌గా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు సభ్యులు కలిపి మొత్తం 11 మంది ఉంటారు. కమిటీ నియామకానికి సంబంధించి పూర్తి అధికారాలను కలెక్టర్‌కు కట్టబెట్టింది. రాజకీయ నేతలకు చోటు లేదన్న విషయం తెలిసి సంఘ సంస్కర్తల పేరుతో వారి అనుచరులకు పెద్దపీట వేశారు. కలెక్టర్ ఆమోదముద్ర వేసిన కమిటీని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.  

 11 మందితో కమిటీ
సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీలో మొత్తం 11 మంది ఉన్నారు. వర్కింగ్ చైర్మన్‌గా డాక్టర్ వై.రామసుబ్బయ్య (రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్), చైర్మన్‌గా కోన శశిధర్ (కలెక్టర్), మెంబర్ కన్వీనర్‌గా డాక్టర్ మైరెడ్డి నీజర (మెడికల్ కళాశాల ప్రిన్సిపల్) ఉన్నారు. సభ్యులుగా రామగిరి మండలం గంగంపల్లికి చెందిన కె.రామ్మూర్తినాయుడు, ఎం.పవన్‌కుమార్ (శాంతిసేన రక్తసహకార బంధువు), అనంతపురంలోని కాయగూరల వీధికి చెందిన కె.వెంకటేశులు, నల్లమాడ మండలం వంకరగుంటకు చెందిన కేశవరెడ్డి, డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు (సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్), చల్లా ఓబుళేసు (నగర పాలక సంస్థ కమిషనర్)తో పాటు డీఎంఈ, జిల్లా ప్రశాంతి సమాఖ్య అధ్యక్షురాలిని చేర్చారు.

వీరిలో నలుగురు సభ్యులు రాజకీయ నేతల అనుచరులు కావడం గమనార్హం. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సూచించిన వారిని కమిటీలో చేర్చారు. హెచ్‌డీఎస్‌లో రాజకీయానిదే పైచేయిగా ఉంటోందంటూ జనవరి 30న ‘ప్రభుత్వానివి ‘ఉత్త’ర్వులే’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. అదే రోజు కమిటీ సభ్యుల వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం కలెక్టర్ ఆమోదముద్ర వేసిన కమిటీలో వాళ్లంతా ఉండటాన్ని బట్టి చూస్తే అధికార యంత్రాంగం కూడా నేతలకు తలొగ్గిందన్నది స్పష్టమవుతోంది.  కాగా.. ఈ నెలాఖరులోగా  కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ కలెక్టర్ వద్దకు నేడో, రేపో వెళ్లనుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement