నారా లోకేశం పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇప్పటివరకు తాను పర్యటించిన చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు లోకేశం. చాక్లెట్ల మాదిరి టిక్కెట్లు పంచిపెట్టడాన్ని కొందరు ఆశావహులు తప్పుపడుతున్నారట. చంద్రబాబు ఆదేశాలతో ప్రకటిస్తున్నారా? లేక సొంతంగా ఇచ్చేస్తున్నారా అని సందేహపడుతున్నారని టాక్. నారా లోకేశం కామెడీపై ఓ లుక్కేద్దాం..
తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పాదయాత్ర ఆ పార్టీ నాయకుల్లోనే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చేసినట్లుగా.. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తనకు కావాల్సినవారి పేర్లు ప్రకటిస్తూ.. వారిని ఆశీర్వదించాలని కేడర్‌ను కోరుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు లోకేశ్ తీరుతో గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థిగా పరిటాల శ్రీరాం పేరును నారా లోకేష్ ఖరారు చేశారు. శ్రీరాం చేతిని పట్టుకుని పైకెత్తి మరీ ఆశీర్వదించాలంటూ కోరారు. 2014లో ధర్మవరం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వరదాపురం సూరి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్‌కు..
ఇక, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు వరదాపురం సూరి. త్వరలోనే వరదాపురం సూరి టీడీపీలో తిరిగి ప్రవేశించబోతున్నారని.. ఆయనకు ధర్మవరం టిక్కెట్ కూడా ఖరారు అయిందని టీడీపీ వర్గాల్లోనే కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇంతలో పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన నారా లోకేష్ ఏకంగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంను అభ్యర్థిగా ప్రకటించేశారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరాం.. వైఎస్ఆర్సీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఘెరంగా ఓటమి చెందారు. వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన ధర్మవరంలోకి అడుగుపెట్టారు పరిటాల శ్రీరాం. తన తల్లి పరిటాల సునీతకు తిరిగి రాప్తాడు అప్పగించి ధర్మవరం టీడీపీ ఇంఛార్జిగా శ్రీరాం కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరాం పోటీ చేస్తున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు.
లోకేశ్ ప్రకటనతో టీడీపీలో చర్చ..
లోకేశ్ ప్రకటన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి రెండు టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే మాకు అలాగే ఇవ్వాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నుంచి డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి, దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేవలం తాడిపత్రికే పరిమితం కావాలని జేసీ కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఖరారు కావటంతో తమ గళం వినిపించేందుకు జేసీ ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వటం పట్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత పెంచుతూ పోతుంటే.. చంద్రబాబునాయుడు మాత్రం సొంత సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కట్టడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
దీంతో, మొత్తం మీద చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి లాభం కలిగించకపోగా.. పార్టీ నాయకుల్లోనే విభేదాలు పెంచుతోంది. అసలు లోకేశ్ ప్రకటిస్తున్న టిక్కెట్లు నిజమేనా.. లేక ఉత్తిత్తి టిక్కెట్లా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment