ఆశల పల్లకి
► కేబినెట్‌లో చోటు కోసం ముగ్గురు నేతల యత్నాలు
► జూన్ 8 తర్వాత విస్తరణ యోచనలో చంద్రబాబు
► పనితీరు బాగోలేదని మంత్రి ‘పల్లె’ను తప్పించే యోచన
► సునీత పనితీరూ అలాగే ఉన్నా కొనసాగింపునకే మొగ్గు
► బెర్తు కోసం బీకే, బాలకృష్ణ, పయ్యావుల మధ్య పోటీ
(సాక్షిప్రతినిధి, అనంతపురం) రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? ఈ సందర్భంగా పనితీరు బాగోలేదని ఓ మంత్రికి ఉద్వాసన తప్పదా? ఖాళీ అయ్యే బెర్త్ కోసం జిల్లా నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందా?... టీడీపీలో తాజా పరిణామాలను చూస్తే ఔననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుండటంతో ఉగాది తర్వాత లేదంటే జూన్ 8పైన విస్తరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
జిల్లా నుంచి ప్రస్తుతం పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. వీరిద్దరి పనితీరుపై చంద్రబాబు పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పల్లె తనకు కేటాయించిన శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారని, ఆయన్ని తప్పించాలని బాబు నిర్ణయించినట్లు తెలిసింది. తోటి మంత్రులు, జిల్లా అధికారులను పక్కనపెడితే సమాచార శాఖలో తన సొంత జిల్లాలో అధికారులపైనా పల్లె ఏమాత్రమూ పట్టు సాధించలేకపోయారు. దీనికితోడు ఇటీవల కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి పదవి హామీతోనే ఆయన సైకిల్ ఎక్కినట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో సామాజికవర్గాల సమీకరణలో ‘పల్లె’పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికి సునీత సేఫ్
పరిటాల సునీత పనితీరుపైనా చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నారు. పౌరసరఫరాల శాఖలో అవినీతిపై ఇటీవల తీవ్ర ఆరోపణలొచ్చాయి. ‘చంద్రన్న కానుక’లో రూ.కోట్లు దోపిడీ జరిగినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. పైగా సునీతకు పెద్దగా చదువు లేకపోవడంతో తనశాఖలో ఫైళ్లు చూడలేకపోతున్నారని, ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోని ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో చదవలేకపోవడం, నిర్ణయాలు తీసుకోకుండా మరొకరిపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను కూడా తప్పించి.. ఈ రెండు స్థానాల్లో కొత్తవారిని తీసుకోవాలని చంద్రబాబు మొదట భావించారు. అయితే.. సునీత తప్పిస్తే ‘అనంత’లో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడొచ్చనే ఆలోచనతో కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఆ ఒక్కడు ఎవరో?
జిల్లా నుంచి మంత్రి పదవి కోసం బీకే పార్థసారథి, పయ్యావుల కేశవ్‌తో పాటు సీఎం బావమరిది బాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు పోటీపడుతున్నారు. ప్రస్తుతం రెండు మంత్రి పదవులూ హిందూపురం లోక్‌సభ స్థానానికే దక్కాయి. ఈసారి ‘పురం’తో పాటు ‘అనంత’ లోక్‌సభ స్థానం నుంచి ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీ కోటాలో ఒకరికి బెర్తు దక్కే అవకాశం ఉంది. ‘పురం’ లోక్‌సభ పరిధి నుంచి సునీత కొనసాగితే.. ‘అనంత’ నుంచి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోవాలని కాలవ ప్రయత్నించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయనపై చంద్రబాబుకు సదాభిప్రాయం లేదని తెలుస్తోంది.
చీఫ్ విప్ పదవి నుంచి కూడా తప్పించాలని చూసినా, సామాజిక సమీకరణాల నేపథ్యంలోసేఫ్ అయ్యారు. తర్వాత రేసులో ఉన్న వ్యక్తి పయ్యావుల కేశవ్. సీఎం కుమారుడు లోకేశ్, బాలకృష్ణ కూడా కేబినెట్‌పై ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరికి బెర్త్ ఖరారైనా రాష్ట్రంలో మరో ‘కమ్మ’నేతకు కేబినెట్‌లో అవకాశం ఉండదు. వీరిద్దరికీ చోటు దక్కకపోతే కేశవ్ రేసులో ఉండొచ్చు. అప్పుడు ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారవుతారు. ఇది సమస్యగా మారితే బీకే పార్థసారథికి బీసీ కోటాలో చోటు దక్కే అవకాశముంది. అప్పుడు రెండు మంత్రి పదవులూ మళ్లీ ‘పురం’ లోక్‌సభ పరిధిలోకే వెళతాయి. ఈ క్రమంలో బీకే, కేశవ్‌లో ఎవరు బెర్త్ దక్కించుకుంటారో వేచి చూడాలి.