ఆల్ ద బెస్ట్
పరీక్ష పేరు : పంచాయతీ కార్యదర్శి
పరీక్ష కేంద్రాలు : 185
అభ్యర్థులు : 45,862
అధికారులు, సిబ్బంది : 2,360
పోలీస్ సిబ్బంది : 370
పేపర్-1 సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
పేపర్ -2 సమయం : మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగనుండగా, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 185 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 45,862 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు చెప్పారు. డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పరీక్షల నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 185 కేంద్రాలకు 185 మంది అసిస్టెంట్ సైజన్ అధికారులను, 37 మంది రూట్ అధికారులను, 38 మంది లైజన్ అధికారులను నియమించారు. 2,100 మంది ఇన్విజిలెటర్లను నియమించారు.
కాగా, శనివారం డివిజన్ స్థాయి కేంద్రాల అధికారులకు, ఇన్విజిలెటర్లతో ఆర్డీవోలు సమావేశం నిర్వహించారు. పరీక్ష కు నిమిషం ఆలస్యమైనా అనుమతించవద్దని ఇన్విజిలేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అవాంతరాలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఇద్దరు పోలీసుల చొప్పున 370 మంది పోలీసు అధికారులను నియమించారు. ఇదిలా ఉండగా, ఇది వరకే 46 వేలు కార్యదర్శుల ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 08732 -223652, 231300లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్
ఆదిలాబాద్ కల్చరల్ : అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఆదిలాబాద్‌లోని బస్టాండ్ ఎదుట హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు టీఆర్ఎస్ వీ నియోజకవర్గ అధ్యక్షుడు బండశ్రీను, పట్టణ అధ్యక్షుడు కన్నెవార్ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.