ఆర్టీసీ ధనుర్మాస టూర్ ప్యాకేజీలు
విజయవాడ, న్యూస్‌లైన్ : ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాల దర్శనానికి ఆర్టీసీ కృష్ణా రీజియన్ శ్రీకారం చుట్టింది. మంగళగిరిలోని పానకాల స్వామి దేవస్థానం, జగ్గయ్యపేట దగ్గరలోని వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి, తిరమలగిరి, జమలాపురంలోని వెంకటేశ్వరస్వామి, మధిరకు సమీపంలోని నెమలి వేణుగోపాల్‌స్వామి ఆలయూలను ఒక్కరోజులోనే దర్శించుకునే అవకాశం కల్పించింది. ప్రతి ఆదివారం, నెలలోని ముఖ్య రోజుల్లో వేకువజామున ఆరు గంటలకు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేరి తిరిగి అదేరోజు రాత్రి 9 గంటలకు బస్టాండ్‌కు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందుకు పెద్దలకు రూ.325 (డీలక్స్), రూ.290 (ఎక్స్‌ప్రెస్), పిల్లలకు రూ.245 (డీలక్స్), రూ.220 (ఎక్స్‌ప్రెస్) టికెట్‌గా నిర్ణయించారు.
24 గంటల్లో పారిజాతత్రయం
ప్రతి ఆదివారం ఒక్కరోజులో మూడు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కల్పించారు. ఏలూరులోని ద్వారకా తిరుమల (చినతిరుపతి), తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, విశాఖ జిల్లా సింహాచలంను ఒకేరోజు దర్శించుకోవచ్చు. ఉదయం 4 గంటల సమయంలో బయల్దేరి మరుసటి రోజు 4 గంటలకు బస్టాండ్‌కు తిరిగి వచ్చే విధంగా ఏర్పాటుచేశారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయూణించే పెద్దలకు రూ.940, పిల్లలకు రూ.715 టికెట్ ధర నిర్ణయించారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
పట్టిసీమకు టూర్ ప్యాకేజీ
గోదావరి పరవళ్లు, పట్టిసీమ ప్రకృతి సోయగాలను కనులారా వీక్షించేందుకు రీజియన్‌లో జనవరి 15వ తేదీ వరకు ప్రతి ఆదివారం టూర్ ప్యాకేజీని నిర్ణయించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి వేకువజామున మూడు గంటల సమయంలో ప్రారంభమై రాత్రికి విజయవాడకు చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.375 టికెట్‌గా వసూలు చేస్తారు. గోదావరిలో బోటు షికారుకు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.350 చెల్లించాలి. వివరాలకు సెంట్రల్ మార్కెంటింగ్ సెల్ నంబర్ 9959225475లో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.