pandits
-
కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో స్థానికేతరులే లక్ష్యంగా మరోమారు రెచ్చిపోయారు ఉగ్రవాదులు. షోపియాన్ జిల్లాలో కశ్మీరీ పండింట్లే లక్ష్యంగా శనివారం కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని చౌధరీ గుండ్ ప్రాంతంలో తన ఇంటి సమీపంలోనే పురాన్ క్రిష్ణ భట్ అనే వ్యక్తిని కాల్చి చంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భట్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారన్నారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు పోలీసు అధికారులు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు.. బాధితుడు భట్‌కు ఇద్దరు 10 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని, తాము భయం భయంగా బతుకుతున్నామని ఆయన బంధువు ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల భయంతో భట్ ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టేందుకు సైతం భయపడేవాడని చెప్పారు. ఇంతకు ముందు ఆగస్టు 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో సునీల్ కుమార్ అనే పండిట్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత కొద్ది రోజులు పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించినా.. మరోమారు తూటా పేలటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొద్ది నెలలుగా కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటో తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పండిట్లు ఆందోళనలు సైతం చేపట్టారు. ఇదీ చదవండి: కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి -
కశ్మీర్ ఫైల్స్.. అదే నిజమైతే ఉరి తీయండి
ది కశ్మీర్ ఫైల్స్ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్ పండిట్ల వలసలకు ఫరూఖ్ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన. అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. ది పొలిటికల్ హీట్! -
వారిని మనమే కాపాడుకోవాలి!
ఒకప్పుడు కశ్మీర్లో ముస్లింలు, పండిట్లు తమ సంతోషాలను, బాధలను పరస్పరం పంచుకుంటూ గడిపారు. మా బాల్యంలో పండిట్ల కుటుంబాలతో కలిసిమెలిసి జీవిస్తూ పొందిన అద్భుత జ్ఞాపకాలను 1989లో పూర్తిగా కోల్పోయాము. కశ్మీర్ సమాజ అస్తిత్వమే మారిపోయింది. కశ్మీరీ పండిట్లు మూకుమ్మడిగా వలసపోకుండా ప్రభుత్వ యంత్రాంగం, సమాజం ఎందుకు అడ్డుకోలేదని దశాబ్దాలుగా మేం దిగ్భ్రాంతి చెందుతూనే ఉన్నాము. ఇప్పటికీ అమాయకులైన, నిరాయుధులైన పౌరులను కాల్చిచంపడంపై విశ్వాసం ఉంచుతున్న వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు? సొంత ప్రజలైన కశ్మీరీ పండిట్లు, కశ్మీరీ సిక్కుల పక్షాన కశ్మీరీ ముస్లిమ్‌లం నిలబడటంలో విఫలమైతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు అంటూ శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ మట్టు తన బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. కశ్మీర్లో ఇటీవల వరుసగా జరిగిన పౌరుల హత్యలు ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని కకావికలు చేశాయి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఊహాగానాలకు, చెలరేగుతున్న పుకార్లకు అంతే లేకుండా పోయింది. ఈ ఘటనలకు వెనుక అసలు మూలం 1989లో చోటు చేసుకుందని గ్రహిస్తేనే ప్రస్తుతం జరుగుతున్న పౌరుల హత్యలపై కాస్త స్పష్టత కలుగవచ్చు. ఆనాడు కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడటంతోపాటు, కశ్మీర్ లోయ విడిచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ వచ్చాయి. కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తొలి వలసకు అదే మూలం. అప్పుడు నా వయస్సు నాలుగేళ్లు మాత్రమే. నా తల్లిదండ్రులు మా పొరుగునే ఉన్న పండిట్లను కౌగలించుకుని తమ ఇళ్లను ఖాళీ చేసి వెళుతున్న వారికి కన్నీళ్లతో వీడ్కోలు పలికిన జ్ఞాపకాలు నాలో చాలానే మిగిలి ఉన్నాయి. మా ఇంటి పొరుగునే ఉన్న వృద్ధ దంపతులు పండిట్ రఘునాథ్ మాటో ఆయన భార్య మా బాల్య జీవితాల్లో విడదీయరాని భాగమై ఉండేవారు. వారి పిల్లలు, మనవళ్లు దేశంలోని అనేక నగరాల్లో చక్కగా స్థిరపడి సంవత్సరానికి ఒకసారి తమ పెద్దలను కలవడానికి కశ్మీర్ వస్తుండేవారు. ఆ సమయంలో మేమంతా ఒక పెద్ద కుటుంబంలా ఉండేవాళ్లం. వారి ఇంట్లో గంటలసేపు నేను గడిపేవాడిని. వారు మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు. రుచికరమైన స్నాక్స్ తినడానికి ఇచ్చేవారు. ఇక బాబూజీ అయితే తన గ్రామ్‌ఫోన్‌ని సగర్వంగా మాకు చూపేవారు. తన ఇంట్లో మేము కూర్చుని ఉండగా జ్యోతిష్య ప్రపంచం గొప్పతనం గురించి మాకు వివరించి చెప్పేవారు. ఆ ఇంట్లో చిన్న కిటికీ ఉండేది. కశ్మీరులో ఎక్కువగా పెరిగే గుల్మ వృక్షం నుంచి ఆ కిటికీ బయట పెద్దగా గాలి వీస్తుండేది. ఒక కొత్త, కృత్రిమ, అసంపూర్ణ కశ్మీర్ కొన్నేళ్ల తర్వాత నేను బర్న్ హాల్ స్కూల్లో చదువుతున్నప్పుడు, ప్రతి రోజూ సాయంత్రం ట్యూషన్ కోసం జవహర్ నగర్ లోని పండిట్ దీనానాథ్ వలి చిన్న ఇంటికి వెళ్లేవాడిని. ప్రతి సాయంత్రం వారి ఇంట్లో గంటన్నరసేపు గడిపిన సమయంలో పిట్టకథలు, జానపద కథలను ఎక్కువగా చెబుతూ తరచుగా మాత్రమే పాఠ్యాంశాలను ఆయన చెబుతుండేవారు. నిజంగానే ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. నాకంటే పెద్దవాళ్లకు కశ్మీర్లో అందరూ కలిసిమెలిసి బతికిన సుసంపన్నమైన అనుభవాలు ఎక్కువగా ఉండేవి. ముస్లింలు, పండిట్లు తమ సంబరాలు, బాధలను పరస్పరం పంచుకుంటూ గడిపేవారు. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కలిసే కొంటె చేష్టలకు పాల్పడేవారు. స్థానిక సరకుల దుకాణంలో కమ్యూనిటీ పెద్దలు కూడి సాయంకాలం చర్చల్లో పాల్గొనేవారు. మా బాల్యంలో, విద్యార్థి జీవితంలో మేం పొందిన ఆ అద్భుత జ్ఞాపకాలను 1989లో పూర్తిగా కోల్పోయాము. దాంతో కశ్మీర్ సమాజ అస్తిత్వమే మారిపోయింది. ఉమ్మడిగా జీవించిన చరిత్ర చెరిగిపోయి సామాజికంగా అసంపూర్ణంగా మిగిలిన, శాంతిని కోల్పోయిన ఒక కృత్రిమ కశ్మీర్ ఆవిర్భవించింది. కశ్మీరీ పండిట్లు మూకుమ్మడిగా వలసపోయిన ఆ మహాప్రస్థానం 1989లో సంభవించకుండా ప్రభుత్వ యంత్రాంగం, సమాజం ఎందుకు అడ్డుకోలేదని దశాబ్దాలుగా మేం దిగ్భ్రాంతి చెందుతూనే ఉన్నాము. పండిట్లను నిలుపుకోవడానికి మేం ప్రయత్నించలేదా? దానికోసం మరింతగా మేము కృషి చేసి ఉంటే బాగుండేదేమో! కశ్మీరీ పండిట్ల పక్షాన మేం గట్టిగా నిలబడి ఉంటే కశ్మీర్ చరిత్ర పంథా మరొకలా ఉండేదా? మరొక సామూహిక విషాదం ఇటీవల కొద్ది రోజులుగా పైగా కశ్మీర్ లోని మైనారిటీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని చంపడానికి సాక్షీభూతులుగా ఉన్న మా సామూహిక భయాలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మా మనస్సుల్లో, ఆప్తులను కోల్పోయిన మా ఆలోచనల్లో ప్రతిధ్వనించి ఉండాలి. కశ్మీర్లో నా తరం ఇలాంటి ప్రశ్నల మధ్యనే పెరుగుతూ వచ్చింది. వేలాదిమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న హింసాత్మక ఘటనలకు చరిత్ర ఉల్లేఖనాలుగా ఇలాంటి ప్రశ్నలు మాలో మెదులుతూనే ఉన్నాయి. శ్రీనగర్ నడిబొడ్డున తన షాపులో కూర్చుని ఉన్న పేరొందిన కెమిస్టు మఖన్ లాలా బింద్రూను ఉగ్రవాదులు ఇటీవల కాల్చిచంపిన తర్వాత ఆయన ఇంటికి నేను వెళ్లాను. ఒక సామూహిక, విషాదానుభవం నన్ను ముంచెత్తింది. నిస్సహాయత్వం నన్ను ఆవహించింది. ఆయన కుటుంబం ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలుకుతున్నప్పుడు మేం మరొక సామూహిక విషాదం ఊబిలో చిక్కుకున్నామా అని నాకనిపించింది. కొద్ది రోజుల తర్వాత ఉగ్రవాదులు ఈద్గాలోని సంగమ్వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చొరబడి, ఆ స్కూల్ ప్రిన్సి పాల్ సుపీందర్ కౌర్, టీచర్ దీపక్ చంద్‌లను పాశవికంగా చంపేశారు. ఒకే ప్లాన్, ఒకే పద్ధతిలో జరిగిన హత్యలవి. అదేరోజు సుపిందర్ కౌర్ ఇంటికి నేను వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించినప్పుడు, కొన్ని దశాబ్దాల క్రితం మేం అనుభవించిన బాధ, ఆగ్రహం, నిస్సహాయతలు నన్ను చుట్టుముట్టాయి. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి కూడా నా వద్ద మాటల్లేవు. మా శాంతిని, మా గతాన్ని మాకు దూరం చేస్తూ రాక్షసులు తలపెట్టిన దారుణ విషాదాలు రేపిన అవే గాయాలు మా భవిష్యత్ తరాలను కూడా వెంటాడనున్నట్లు తలిచి, కంపించిపోయాను. అస్పష్ట ముసుగును తొలగించాల్సిన సమయం! మరొక అర్థం లేని, అనాగరిక ఉగ్ర చర్యలో బిహార్‌కి చెందిన ఒక చిరు వ్యాపారిని లాల్ బజార్లో కాల్చి చంపారు. శ్రీనగర్‌లో జీవిస్తున్న వేలాదిమంది స్థానికేతర వ్యాపారులకు, కూలీలకు, కార్మికులకు ఉగ్రవాదులు చేసిన హెచ్చరిక ఇది. ఆ వ్యాపారి చేసిన తప్పేమిటి? తన భార్యా పిల్లలను పోషించడానికి వేలమైళ్ల దూరంలో ఉంటూ వీధుల్లో చిరు వ్యాపారం చేసుకునే అతడి ప్రాణం నిలువునా తీయడాన్ని ఏ సైద్ధాంతిక సమరం సమర్థిస్తుంది? నిజంగానే శ్రీనగర్‌కి ఇది దుస్సహమైన వారం. నగరం నడిబొడ్డున ఇలా ఎలా జరుగుతుంది అని మేం ఆశ్చర్యపడుతున్నాం. ఇలాంటి దారుణాలను అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవలసి ఉంది? ఇలాంటి హత్యా ఘటనలకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని మెజారిటీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ ప్రతిఘటన రావాలని మేం అర్థం చేసుకోవలసి ఉంది. ఇలాంటి అనాగరిక హత్యలకు ముగింపు పలకడానికి కారణమవుతున్న సామాజిక పవిత్రత లేదా మనమే ఉండాలనే భావన పూర్తిగా నశించాలి. మన రాజకీయ అభిప్రాయాలతో, సిద్ధాంతాలతో పనిలేకుండా ఇలాంటి ఘటనల పట్ల మన ఖండన మండనలు ఎలాంటి సందిగ్ధతలూ లేని రీతిలో వెలువడాల్సి ఉంది. ఇలాంటి హత్యలను గుర్తు తెలియని సాయుధులు చేసినవిగా పేర్కొనడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. స్పష్టత లేని, అసందిగ్ధతతో కూడిన పరదాలే, జరుగుతున్న విషాదాలను ఇలాంటి గణాంకాలతో కప్పి పుచ్చుతుంటాయి. ఇలాంటి క్రూరహత్యలకు పాల్పడుతున్న శక్తులను ఉగ్రవాదులుగా మాత్రమే వర్ణిస్తూ స్థానిక మీడియా, సమాజం పెద్ద ఎత్తున ముందుకు రావాలని నేను విన్నవిస్తున్నాను. తమ క్రూరచర్యలను ఇంకా కొనసాగించేందుకు అమాయకులను, నిరాయుధులైన పౌరులను కాల్చిచంపడంపై విశ్వాసం ఉంచుతున్న వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు? ముఫ్తీలు, అబ్దుల్లాలు అనే రెండు రాజకీయ కుటుంబాలను మాత్రమే కాపాడుతూ, మిగిలిన వారిని విసిరివేయదగిన సరకులలాగా మాత్రమే భావిస్తూ మన పోలీసులు అడ్డుకోవడానికి ప్రజలు దృఢమైన వైఖరిని చేపట్టాల్సి ఉంది. మన మైనారిటీ కమ్యూనిటీలు (కశ్మీరీ పండిట్లు, కశ్మీరీ సిక్కులు) సురక్షిత వాతావరణంలో నివసించడానికి మనం దృఢనిర్ణయంతో లేచి నిలబడాల్సి ఉంది. తటస్థంగా ఉండటానికి, కపట వైఖరిని ప్రదర్శించడానికీ ఇది సమయం కాదు. అటో ఇటో తేల్చుకోవాలంటూ పిలుపు ఇవ్వాల్సిన సమయం ఇది. మన సొంత ప్రజల పక్షాన మనం నిలబడటంలో విఫలమైతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు. -
మంచుకొండల ఆత్మఘోష
మంచుకొండల కాశ్మీరం మళ్ళీ రక్తమోడుతోంది. బరి తెగించిన ముష్కరుల దాడుల్లో అమాయకులు బలి కావడం పెరిగింది. కొద్దిరోజులుగా జమ్మూ – కశ్మీర్లో జరుగుతున్న వరుస సంఘటనల్లో అక్కడి అల్పసంఖ్యాక వర్గాలైన కశ్మీరీ పండిట్లు సహా అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రతాదళాల ప్రాణత్యాగం చేయడం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. కానీ, గడచిన ఆరేళ్ళ గణాంకాల లెక్కలు తీస్తే తీవ్రవాదులు రూటు మార్చి, భద్రతాదళాల బదులు ఇప్పుడు పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. పేరున్న వ్యక్తులు, కశ్మీర్ లోయలోని స్థానికేతరులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కశ్మీరీ పండిట్ అయిన ప్రసిద్ధ కెమిస్ట్ సహా ముగ్గురు పౌరులను మంగళవారం కొద్ది గంటల వ్యవధిలో తీవ్రవాదులు కాల్చి చంపడం అందుకు ఉదాహరణ. వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ సహా పార్టీలన్నీ దీన్ని ఖండించాయి. ఆ రక్తపుమరకలు ఆరక ముందే గురువారం శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి తుపాకీలు ధరించిన ఆగంతుకులు చొచ్చుకు వచ్చి, టీ తాగుతున్న ప్రిన్సిపాల్‌పై, మరో కశ్మీరీ పండిట్ టీచర్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి, ప్రాణాలు తీయడం మరో తీరని విషాదం. జనంతో మమేకమయ్యేందుకు కేంద్ర మంత్రులు పలువురు తొమ్మిది వారాల కార్యక్రమం చేస్తున్న సమయంలో గత పది రోజుల్లో ఇలా ఏడుగురు పౌరులు బలి కావడం గమనార్హం. బీజేపీ తెచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టంతో కొత్తగా ఏర్పడ్డ ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ నెలలోనే హోమ్ మంత్రి అమిత్ షా కూడా పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలో ఈ వరుస దాడులు, హత్యలు కలవరపరిచే విషయాలు. కాశ్మీరం కళకళలాడుతోందంటున్న పాలకుల మాటల్లోని డొల్లతనానికి నిదర్శనాలు. మతపరంగా అస్థిరతను సృష్టించి, అల్పసంఖ్యాకుల్లో భయాన్ని పెచ్చరిల్ల జేయడం కోసమే ఈ దాడులని సాక్షాత్తూ డీజీపీయే చెప్పారు. 2016 నుంచి గత ఆరేళ్ళలో కశ్మీర్లో ఇదే ధోరణి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉత్తిపుణ్యానికి 27 మంది పౌరుల ప్రాణాలు తీవ్రవాదపు కోరలకు చిక్కాయి. తాజాగా ఆరెస్సెస్‌కు పని చేస్తున్నారంటూ సుప్రసిద్ధ ఫార్మసిస్టునూ, పోలీసు ఇన్ఫార్మర్ అంటూ బీహారీ వీధి వర్తకుణ్ణీ – ఇలా రకరకాల నెపాలతో తీవ్రవాదులు దారుణకాండకు దిగుతున్నారు. పాకిస్తాన్‌లోని లష్కరే తాయిబాకు ఇక్కడి మరోరూపమైన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’, మరోపక్క ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ– కశ్మీర్’ లాంటి వేర్వేరు సంస్థలు ఈ దారుణాలకు పాల్పడింది తామేనని ప్రకటించుకోవడం నివ్వెరపరుస్తోంది. నిఘా వర్గాల వైఫల్యాన్ని పట్టి చూపిస్తోంది. కశ్మీర్‌లోని ప్రముఖ వ్యాపారులే లక్ష్యంగా కొన్నాళ్ళుగా దాడులు జరుగుతున్నాయి. ఏ వర్గంతోనూ సంబంధం లేని అమాయకులను చంపడం ద్వారా దశాబ్దాలుగా అక్కడ శాంతియుతంగా జీవిస్తున్న అల్పసంఖ్యాకులను భయపెట్టడమే పరమార్థం. పండిట్లు కశ్మీర్‌కు సత్వరమే తిరిగొచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడమే తీవ్రవాదుల దృష్టిలో ఆ ఫార్మసిస్టు చేసిన తప్పు. కశ్మీర్‌కు తిరిగిరావాలనుకొనే వారిని హెచ్చరించడమే వారి ఉద్దేశం. ‘స్థానికులు కానివారెవరూ ఇక్కడకు రాకూడదు, జీవనం గడపకూడద’న్న అవాంఛనీయ ధోరణికీ, అసహనానికీ ఈ ఘటనలు సూచిక. ఈ నీచప్రయత్నాలకు ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. రోజువారీ వ్యవహారంగా మారిన హింసకు ముగింపు పడేలా చూడాలి. ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వానికి తావివ్వకుండా పగ్గాలను తమ చేతిలోనే ఉంచుకోవాలనే ధోరణినీ సత్వరమే వదిలించుకోవాలి. ఏళ్ళూపూళ్ళ కశ్మీర్ సమస్యకు పైపూతలు పనికిరావు. లోతైన పరిష్కారమే శరణ్యం. జరుగుతున్న ప్రతి దాడీ, పోతున్న ప్రతి ప్రాణం గుర్తుచేస్తున్నది అదే! ఇలాంటి పరిస్థితుల్లోనూ ముష్కరుల చేతిలో ఫార్మసిస్టు మఖన్‌లాల్ బింద్రూ అసువులు బాసినప్పుడు, ఆ కుటుంబ సభ్యులు గుండె దిటవుతో మాట్లాడిన తీరు జాతికి స్ఫూర్తిదాయకం. ‘ఆ దుండగులు తుపాకులతో ఈ దేహాన్ని కాల్చవచ్చు. కానీ, మా ఆత్మనూ, మా ఈ స్ఫూర్తినీ చంపలేరు’ అన్న ఉద్వేగభరితమైన మాటలు చాలాకాలం చెవులలో రింగుమంటాయి. తీవ్రవాదం పంజా విసిరిన 1990లలో ఎందరో పురిటిగడ్డను వీడిపోయినా, హిమసీమలనే అంటిపెట్టుకొని బతుకుతున్న ఇలాంటి కొద్ది కశ్మీరీ పండిట్ల కుటుంబాల నైతిక స్థైర్యం అనుసరణీయం. అక్కడ ఇప్పుడు అందరికీ కావాల్సిన పరమౌషధం అదే. మరి, అంతటా భయం, అందరిపైనా అనుమానం నెలకొన్న కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి పాలకులు ఏం చేస్తున్నారు? జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికో, ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికో ‘నయా కశ్మీర్ నిర్మాణం’ నినాదాలను కేంద్ర పాలకులు ఎత్తుకుంటే సరిపోతుందా? కశ్మీర్‌పై పాకిస్తాన్ కుయుక్తులు, ఈ దాడులతో ప్రజలకు చేరవేయదలుచుకున్న భావం ఏమిటో తెలుస్తూనే ఉంది. కానీ, అదే సమయంలో కశ్మీర్లో నిద్రాణంగా ఆగ్రహం, బాధ, ఆవేదన గూడుకట్టుకున్నాయన్నది వాస్తవం. ఆ సంగతి గుర్తించాలి. భారత అనుకూల భావాలు తగ్గుతూ, వేర్పాటువాదానికి ఊతం అందుతున్న తీరును ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలను కలుపుకొని, తగిన చర్యలు చేపట్టాలి. జూన్‌లో ప్రధాని జరిపిన అఖిలపక్షం తదుపరి కర్తవ్యాన్ని చేపట్టాలి. అలా కాకుండా, పెట్టుబడులు, పర్యాటకులు, రోడ్ల నిర్మాణం, విద్యుదుత్పత్తి లాంటి మాటలు చెప్పి, గణాంకాల లెక్కలతో కశ్మీర్ శాంతిసౌభాగ్యాల సీమ అని నమ్మబలికితే అది ఆత్మవంచనే. కశ్మీరే కాదు... దేశం దాన్ని ఎంతోకాలం భరించలేదు. -
మోదీని కలిసిన కశ్మీరీ పండిట్లు
హోస్టన్ : అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కశ్మీరీ పండిట్లు కలిశారు. ఆదివారం హోస్టన్‌లో మోదీతో కశ్మీరీ పండిట్లు సమావేశమైన సందర్భంగా నూతన కశ్మీర్ ఆవిర్భావానికి తాము బాసటగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మనందరం నవ కశ్మీర్ నిర్మాణం చేపట్టాలని ప్రధాని మోదీ కశ్మీరీ పండిట్లతో అన్నారు. ప్రధాని మోదీతో భేటీ వివరాలను కశ్మీరీ పండిట్ సురీందర్ కౌల్ వివరిస్తూ ప్రధాని మోదీకి తామంతా అండగా నిలుస్తామని చెప్పామని అన్నారు. కశ్మీరీ పండిట్ల తరపున ఆయనకు వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ ప్రగతికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చారిత్రక నిర్ణయం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది కశ్మీరీ పండిట్ల తరపన ధన్యవాదాలు తెలిపామని వెల్లడించారు. కశ్మీర్‌ను శాంతియుత ప్రాంతంగా మలిచి అక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే ప్రధాని కల నెరవేరేందుకు తాము సహకరిస్తామని మోదీకి హామీ ఇచ్చామని చెప్పారు. -
ఆర్మీ ‘పండిట్’ నియామకాల్లో అక్రమాలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్మీలో రిలీజియస్ టీచర్స్ (పండిట్) ఉద్యోగాల నియామక ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్లో జరిగిన ఇంటర్వ్యూకు దేశంలోని అనేక రాష్ట్రాల అభ్యర్థులు హాజరయ్యారు. 2013 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ పేర్కొంది. కొందరు ఆర్మీ సుబేదార్ అధికారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలొచ్చాయి. ఆర్మీ సుబేదార్ ఎమ్ఎన్ త్రిపాఠి కుంభకోణం మొత్తానికి సూత్రధారిగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంటర్వ్యూలో సులభమైన ప్రశ్నలు అడిగేందుకు పలువురు అభ్యర్థుల నుంచి నగదును బినామీల అకౌంట్ల ద్వారా త్రిపాఠి స్వీకరించినట్లు తెలంగాణ, ఏపీ హెడ్‌క్వార్టర్ మేజర్ జనరల్ శ్రీనివాస్‌రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. త్రిపాఠితో పాటు సత్యప్రకాశ్, ఎంకే పాండే, నాయక్ ఆదిత్యనారాయణ్ తివారీ, క్రాఫ్ట్స్‌మెన్ ప్రవీణ్‌కుమార్ సారస్వత్, నాయక్ సుబేదార్ పూజాన్ ద్వివేదీ, లాన్స్‌నాయక్ జితేంద్రకుమార్ యాదవ్, నాయక్ జగదీశ్ నారాయణ్‌పాండే, నాయక్ çసుబేదార్ బాల్ కృష్ణగార్గ్, సిపాయ్ మద్వేంద్ర మిశ్రా, సిపాయ్ రాజేశ్‌కుమార్ గోస్వామి, నాయక్ సుబేదార్ శక్తిధర్‌తివారీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. త్రిపాఠికి బినామీగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంద్రజీత్‌గుప్తా, మితాయిలాల్‌గుప్తా, అమర్‌నాథ్‌గుప్తా, విశ్వజీత్ గుప్తా, మధ్యప్రదేశ్‌కు చెందిన పంకజ్ బిల్తారేపై కూడా కేసులు నమోదయ్యాయి. 12 మంది అభ్యర్థులకు, నిందితులకు మధ్య రూ.42 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు ఆర్మీ అంతర్గత విచారణలో తేలిందని సీబీఐ వెల్లడించింది. -
వైభవంగా మహానందీశ్వరుడి కల్యాణోత్సవం
మహానంది: మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి కల్యాణోత్సవం గురువారం వైభవంగా జరిగింది. మహానంది దేవస్థానం చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలా చక్రవర్తి తదితరులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాలకు చెందిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి శాశ్వత కల్యాణోత్సవానికి రూ. 10,116 చెల్లించి మొదటి టికెట్‌ను తీసుకున్నారు. అలాగే ఈఓ శంకర వరప్రసాద్ రూ. 10,116 చెల్లించారు. అలాగే పలువురు భక్తులు ఒకరోజు కల్యాణోత్సవానికి రూ. 1116 చొప్పున చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలరాజు, శివారెడ్డి, సీతారామయ్య, రామకృష్ణ, మునెయ్య, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో శివ చతుస్సప్తాహ భజనలు ప్రారంభం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో బుధవారం శ్రావణ మాసారంభం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలను శాస్త్రోక్త పూజలతో ప్రారంభించారు. లోకకల్యాణం కోసం ప్రతి ఏటా శ్రావణమాసంలో ఈ అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణంలోని వీరశిరోమండపంలో అఖండ శివసప్తాహం నిర్విఘ్నంగా జరగాలని ఈవో నారాయణభరత్‌గుప్త, అర్చకులు,వేదపండితులు మహాగణపతి పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండి శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలని మహాసంకల్పాన్ని చెప్పారు. అనంతరం చండీశ్వరపూజ, కలశస్థాపన, కంకణపూజ, కంకణధారణ, దీక్షాధారణ కార్యక్రమాలతో భజన ప్రారంభించారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ శివసప్తాహంలో కర్నూలు సుంకులాంబదేవి భజన బందం, శ్రీరామాంజనేయ భజన బందం, చెన్నకేశవ నాటక కళామండలి, పూర్ణాహుతి వరకు గురునిమిషాంబాదేవి భజన మండలి, యమ్ మల్లికార్జునస్వామి, గోపనదేవరహళ్లి బందాలు పాల్గొంటాయి. ఈ మాసమంతా ప్రతిరోజు రాత్రింబవళ్లు నిరంతరంగా వీరు ఓంనమఃశివాయ పంచాక్షరి ప్రణవ భజనలు చేస్తారు.