శ్రీనగర్: కశ్మీర్‌లో స్థానికేతరులే లక్ష్యంగా మరోమారు రెచ్చిపోయారు ఉగ్రవాదులు. షోపియాన్ జిల్లాలో కశ్మీరీ పండింట్లే లక్ష్యంగా శనివారం కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని చౌధరీ గుండ్ ప్రాంతంలో తన ఇంటి సమీపంలోనే పురాన్ క్రిష్ణ భట్ అనే వ్యక్తిని కాల్చి చంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భట్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారన్నారు.
ఉగ్రవాదుల కాల్పుల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు పోలీసు అధికారులు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు.. బాధితుడు భట్‌కు ఇద్దరు 10 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని, తాము భయం భయంగా బతుకుతున్నామని ఆయన బంధువు ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల భయంతో భట్ ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టేందుకు సైతం భయపడేవాడని చెప్పారు.
ఇంతకు ముందు ఆగస్టు 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో సునీల్ కుమార్ అనే పండిట్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత కొద్ది రోజులు పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించినా.. మరోమారు తూటా పేలటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొద్ది నెలలుగా కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటో తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పండిట్లు ఆందోళనలు సైతం చేపట్టారు.
ఇదీ చదవండి: కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment