వైభవంగా మహానందీశ్వరుడి కల్యాణోత్సవం
మహానంది: మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి కల్యాణోత్సవం గురువారం వైభవంగా జరిగింది. మహానంది దేవస్థానం చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలా చక్రవర్తి తదితరులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాలకు చెందిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి శాశ్వత కల్యాణోత్సవానికి రూ. 10,116 చెల్లించి మొదటి టికెట్‌ను తీసుకున్నారు. అలాగే ఈఓ శంకర వరప్రసాద్ రూ. 10,116 చెల్లించారు. అలాగే పలువురు భక్తులు ఒకరోజు కల్యాణోత్సవానికి రూ. 1116 చొప్పున చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలరాజు, శివారెడ్డి, సీతారామయ్య, రామకృష్ణ, మునెయ్య, తదితరులు పాల్గొన్నారు.