సర్వజనాస్పత్రిలో మళ్లీ షార్ట సర్క్యూట్
అనంతపురం రూరల్ : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో మళ్లీ షార్ట సర్క్యూట్ సంభవించింది. ఈ నెల 9న ఆర్థో ఆపరేషన్ థియేటర్ కాలిపోయిన ఘటనను మరువకముందే మరోసారి అదే తరహా సంఘటన జరగడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రక్తనిధి కేంద్రం ఎదురుగా ఉన్న బోర్డులో మంటలు చెలరేగాయి. దాదాపు అరగంట పాటు పొగ కమ్ముకుంది. రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
చిన్నపిల్లల వార్డు నుంచి చిన్నారులను తీసుకుని తల్లిదండ్రులు బయటకు వెళ్లిపోయారు. ఆ వార్డు మొత్తం ఖాళీ అయ్యింది. ఎక్స్రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర సేవలు బంద్ అయ్యాయి. కరెంటు సరఫరా ఆగిపోవడంతో పోస్టునేటల్ వార్డులో బాలింతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. చంటి బిడ్డలకు చీర కొంగులతో గాలి ఊపారు. టిఫిన్ సైతం చీకట్లోనే చేయాల్సి వచ్చింది.
తరచూ సమస్యలే : సర్వజనాస్పత్రిలో తరచూ కరెంటు సమస్యలు తలెత్తుతున్నాయి. ముగ్గురు కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉన్నారు. వీరే అన్ని విభాగాలూ చూసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఆరుగురు ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.