వధువు/వరుడు కావలెను..
సాక్షి, సిటీబ్యూరో: పేపర్లలో ప్రకటనలు.. స్పందించి వచ్చిన వారికి వధువు, వరుడి తల్లిగా ఓ మహిళను పరిచయం చేయడం.. ఆపై డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం.. ఇలా నిర్వహిస్తున్న నకిలీ మ్యారేజ్ బ్యూరో ముఠా గుట్టు రట్టు అయ్యింది. సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ జి.శంకర్రాజు ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీసీఎస్ డీసీపీ సి.రవివర్మ వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన గుర్తు తెలియని డాక్టర్ (35), రంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన వై.వెంకటరాజేష్ (27) నకిలీ మ్యారేజ్ బ్యూరోకు తెరలేపారు.
‘‘మెడిసిన్ చదివిన వధువుకు అన్ని అర్హతలు గల వరుడు కావలెను’’. ‘‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వరుడికి అందమైన వధువు కావలెను’’. ‘‘విడాకులు పొందిన కోటీశ్వరురాలికి తగిన వరుడు కావలెను’’. పలు రకాలుగా దిన పత్రికల్లో పెండ్లి పందిరి కింద ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనలు నిజమేనని నమ్మిన పలువురు డాక్టర్, రాజేష్‌లకు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపేవారు. పెళ్లి సంబంధం కుదిర్చేందుకు ముందుగా తాము సూచించిన బ్యాంకు అకౌంట్లో రూ.3 నుంచి రూ.5 వేల వరకు డిపాజిట్ చేయించుకునే వారు.
పథకం ప్రకారం వరంగల్ జిల్లాకు చెందిన మౌలా శ్రీనివాస్ (27), రాజేష్ భార్య వై.లక్ష్మి (22) పేరుతో బ్యాంకు అకౌంట్లను తెరిచారు. వాటి ఏటీఎం కార్డులు మాత్రం డాక్టర్ వద్దనే పెట్టుకున్నాడు. బ్యాంకులో డబ్బులు వేయగానే డ్రా చేసుకునేవాడు. కొంత సొమ్మును ముఠా సభ్యులకు ఇచ్చేవాడు. రెండేళ్లలో సుమారు రూ.5 లక్షలను కాజేశారు. వధువు తరఫు కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే వరుడి తల్లిగా, వరుడి తరఫు వారు ఫోన్‌చేస్తే వధువు తల్లిగా లక్ష్మితో మాట్లాడించి అందిన కాడికి దోచుకునేవారు.
ఇలా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, కడప, విజయనగరం జిల్లాలకు చెందిన సుమారు రెండు వేల మందిని మోసగించారు. కొందరు బాధితులు ఇటీవలే సైబర్‌క్రైమ్ ఏసీపీ డాక్టర్ బి.అనురాధను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇన్ స్పెక్టర్ శంకర్రాజు, ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది ప్రసాద్, హనీఫ్‌లు చాకచక్యంతో ముఠా గుట్టును రట్టు చేశారు. వీరిలో శ్రీనివాస్, లక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేష్, డాక్టర్ పరారీలో ఉన్నాడు. డాక్టర్ అనే వ్యక్తి వివరాలు పేరు నిందితులకు సైతం తెలియకపోవడం గమనార్హం.